గణేష్‌ నిమజ్జనం: హైదరాబాద్‌ మెట్రో ప్రత్యేక సేవలు

18 Sep, 2021 20:50 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆదివారం గణేష్‌ నిమజ్జనం దృష్టా హైదరాబాద్‌ మెట్రో ప్రత్యేక సేవలు అందించనుంది. రేపు అర్థరాత్రి రెండు గంటల వరకు మెట్రో రైళ్లు నడవనున్నాయి. ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో మెట్రో రైళ్ల సమయం పొడిగించారు. అంతేగాక ఈ అర్థరాత్రి నుంచి అంతరాష్ట్ర వాహనాల ప్రవేశంపై పోలీసులు నిషేధం విధించారు. అదే విధంగా పలుచోట్ల ఆర్టీసీ బస్సులను దారి మళ్లించనున్నారు. ఎయిర్‌పోర్టుకు వెళ్లేవారు ప్రత్యేక మార్గాల్లో వెళ్లాలని సూచించారు.

40 క్రేన్లు 32 మంది గజ ఈతగాళ్లు
మరోవైపు హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనానికి పోలీసులు అన్నీ ఏర్పాట్లు పూర్తి చేశారు. భారీ భద్రతను కట్టుదిట్టం చేశారు. ఉస్సేన్ సాగర్ ట్యాంక్ బండ్‌పై ఎలాంటి సమస్య తలెత్తకుండా భారీ క్రేన్స్‌తో పాటు అన్నీ ఏర్పాట్లు చేశారు. ట్యాంక్‌బండ్‌పై 40 క్రేన్లు 32 మంది గజ ఈతగాళ్లను ఉంచారు. ఖైరతాబాద్‌ వినాయక నిమజ్జనానికి ఎన్టీఆర్‌ మార్గ్‌లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
చదవండి: Ganesh Idol Immersion: హైదరాబాద్‌లో గణేష్‌ నిమజ్జనం.. ట్రాఫిక్‌ ఆంక్షలు ఇలా..

క్రేన్‌ నెంబర్‌ 4లో ఖైరతాబాద్‌ మహాగణపతి నిమ్మజనం
2.5 కిలోమీటర్ల పొడవునా ఖైరతాబాద్‌ గణేష్‌ శోభాయాత్ర సాగనుంది. క్రేన్‌ నెంబర్‌ 4లో ఖైరతాబాద్‌ మహాగణపతి నిమ్మజనం జరగనుంది. రేపు ఉదయం 6 గంటల నుంచి ఎల్లుండి ఉదయం వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు అమలు కానున్నాయి. కరోనా నిబంధనలు పాటిస్తూ ప్రశాంత వాతావరణంలో నిమజ్జనం జరుపుకోవాలని, పోలీసులకు ప్రజలు సహకరించాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ సూచించారు.
చదవండి: రేపు, ఎల్లుండి మద్యం దుకాణాలు బంద్‌

20వ తేదీ ఉదయం వరకు నిమజ్జనం పూర్తి
ట్రాఫిక్ అదనపు సీపీ చౌహాన్ మాట్లాడుతూ.. నిమజ్జనం సాఫీగా జరిగేందుకు ట్రాఫిక్ విభాగం తరపున అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. క్రేన్‌లు క్విక్ రిలీజ్ పద్దతిలో విగ్రహాలు నిమజ్జనం చేస్తాయని,  దీని వల్ల విగ్రహాల నిమజ్జనం తొందరగా అవుతుందన్నారు. ప్రతిచోట సైన్ బోర్డ్‌లు ఏర్పాటు చేశామని, ఫ్లై ఓవర్ నిర్మాణాల వల్ల కొన్ని చోట్ల శోభాయాత్ర దారి మళ్లింపు చేస్తున్నామని తెలిపారు. ఫలక్‌నుమా ఫ్లై ఓవర్ బ్రిడ్జి వల్ల ప్రత్యామ్నయ దారిలో శోభాయాత్ర దారి మళ్లించామని, ప్రతి ఒక్కరూ కోవిడ్‌ నిబంధనలు పాటించాలని సూచించారు. పెద్ద విగ్రహాల వెంట 8 మంది భక్తులు, చిన్న విగ్రహాల వెంట నలుగురు మాత్రమే రావాలని కోరారు. 20వ తేదీ ఉదయం వరకు నిమజ్జనం పూర్తి చేసేలా ప్రతి ఒక్క మండప నిర్వాహకులు సహకరించాలని కోరారు.

మరిన్ని వార్తలు