నంబర్‌ ప్లేట్‌పై ‘అప్నా టైమ్‌ ఆయేగా’.. పోలీసుల టైం వచ్చింది!

31 Jul, 2021 08:55 IST|Sakshi
నంబర్‌ ప్లేట్‌పై అప్నా టైమ్‌ ఆయేగా స్లోగన్‌

సాక్షి, నల్లకుంట: నంబర్‌ ప్లేట్‌పై నంబర్‌ కనిపించకుండా ట్రాఫిక్‌ వయోలెన్స్‌కు పాల్పడిన ఓ మైనర్‌పై కేసు నమోదు చేసిన నల్లకుంట పోలీసులు వాహనాన్ని సీజ్‌ చేశారు. సీఐ మొగిలిచర్ల రవి కథనం ప్రకారం.. గురువారం సాయంత్రం ఓయూ ఎన్‌సీసీ ఎక్స్‌ రోడ్స్‌ వద్ద నల్లకుంట సెక్టార్‌–2 పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. అదే సమయంలో విద్యానగర్‌ చర్చి కాలనీకి చెందిన ఓ మైనర్‌  (16) హీరో మ్యాస్ట్రో ద్విచక్ర వాహనంపై అటుగా వచ్చాడు. వాహనం నంబర్‌ ప్లేట్‌పై నల్లటి తొడుగు ఉండడంతో ఆ వాహనాన్ని వెంబడించిన పోలీసులు విద్యానగర్‌ చర్చి వద్ద నిలిపి వేశారు.

ట్రాఫిక్‌ ఉల్లంఘనలకు పాల్పడిన సమయంలో పోలీసులు పంపించే ఈ చలానాల నుంచి తప్పించుకోవడానికి వెనుక నంబర్‌ ప్లేట్‌పై మాస్క్‌ లాంటి నల్లటి ఓ తొడుగును తొడిగాడు. దానిపై ‘అప్నా టైమ్‌ ఆయేగా’ అనే స్లోగన్‌ రాశాడు. ఆర్సీ చెక్‌ చేయగా వాహన నంబర్‌ టీఎస్‌11ఈసీ 7505 అని ఉంది. ఇక ఏముంది అప్నా టైమ్‌ ఆయేగా కాదు ఇప్పుడు పోలీసుల టైం వచ్చిందంటూ మోటారు వాహన చట్టం ప్రకారం నల్లకుంట పోలీసులు ఆ వాహనాన్ని సీజ్‌ చేసి స్టేషన్‌కు తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది. మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులపైన కూడా కేసులు నమోదు చేస్తామని పోలీసులు స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు