టపాసుల వేళ అపశ్రుతులు.. మంటలంటుకుని కళ్లకు, ఒంటికి గాయాలు 

26 Oct, 2022 08:21 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దీపావళి వేళ బాణసంచా కాలుస్తున్న క్రమంలో నగరంలో కొన్నిచోట్ల అపశ్రుతులు చోటుచేసుకున్నాయి. పలువురికి కళ్లకు, ఒంటికి గాయాలయ్యాయి. నగర వ్యాప్తంగా సుమారు 100 మందికి పైగా బాధితులు పలు ఆస్పత్రుల్లో చేరారు. కంటి గాయాలకు గురైనవారిలో ఎక్కువ మంది చిన్నారులే కావడం గమనార్హం. 

సరోజినీదేవి ఆస్పత్రికి క్యూ.. 
మెహిదీపట్నంలోని సరోజినీదేవి కంటి ఆస్పత్రిలో దీపావళిని ముందు రోజు ముగ్గురు, పండగ రోజు రాత్రి సమయంలో 45 మంది దాకా కంటి గాయాలతో సంప్రదించారు. ఇందులో 21 మంది అవుట్‌ పేషెంట్‌ విభాగంలో చూపించుకుని వెళ్లిపోగా 19 మంది అడ్మిట్‌ అయ్యారు. పండగ తర్వాత రోజు కూడా మరో 2 కేసులు వచ్చాయని వైద్యులు చెప్పారు. వీరిలో అయిదేళ్ల వయసు నుంచి 67 ఏళ్లు పైబడిన వారు ఉన్నారు.

మొత్తం బాధితుల్లో అత్యధికులు చిన్నారులే. బాధితుల్లో మల్లెపల్లికి చెందిన అజయ్‌ సింగ్‌ (25), విజయ్‌ ఆనంద్‌ (61), సి. మహావీర్‌ (15)ల ఎడమ కళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. వీరితో పాటు కుడికన్నుకు గాయమైన హయత్‌నగర్‌కు చెందిన రాజి (37)లకు శస్త్ర చికిత్సలు నిర్వహించారు. బాధితుల్లో ఒక అబ్బాయి కంటి చూపు కోల్పోయాడని వైద్యులు తెలిపారు.  

ఎల్వీ ప్రసాద్‌ ఆస్పత్రికి.. 
బంజారాహిల్స్‌లోని ఎల్వీప్రసాద్‌ కంటి ఆస్పత్రికి పెద్ద సంఖ్యలోనే బాణసంచా బాధితులు నమోదయ్యారు. పండగ ముందురోజున అయిదుగురు, దీపావళి రోజున 21 మంది, మరుసటి రోజున (సాయంత్రం 4గంటల వరకూ) 11 మంది కంటి గాయాలతో ఆస్పత్రికి వచ్చారని వీరిలో 9 మందికి సర్జరీలు చేశామని వైద్యులు తెలిపారు. గాంధీ ఆస్పత్రిలో బాణసంచా కారణంగా 7 కాలిన గాయాల కేసులు నమోదయ్యాయి. చందానగర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో తీవ్రగాయాలతో ఒకరు చికిత్స పొందుతున్నారు. పలు ప్రాంతాల్లోని ప్రభుత్వ ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ బాణసంచా బాధితులు చికిత్స పొందుతున్నట్టు సమాచారం.  

కాలిన గాయాలతో ఉస్మానియాకు... 
నగరంలో కంటి గాయాలతో చిన్నారులు ఆస్పత్రుల పాలు కాగా కాలిన గాయాలతో పెద్దలు ఆస్పత్రులకు క్యూ కట్టారు. ఉస్మానియా ఆస్పత్రిలో 18 మందికి కాలిన గాయాల బాధితులు సంప్రదించగా ఇందులో ఒకరు తీవ్ర గాయాలతో అడ్మిట్‌ అయ్యారు. శరీరం కాలిన ఆ మహిళ (63) పరిస్థితి విషమంగా ఉందని, ఆమె దాదాపు 95 శాతం కాలిన గాయాల బారిన పడడంతో వైద్య సేవలు అందిస్తున్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. 

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

మరిన్ని వార్తలు