బంగ్లాదేశ్‌ సరిహద్దు మీదుగా అక్రమంగా హైదరాబాద్‌లోకి

7 Jul, 2021 07:47 IST|Sakshi

సాక్షి, రాజేంద్రనగర్‌: దేశంలోకి అక్రమంగా ప్రవేశించి నివసిస్తున్న ఇద్దరు మయన్మార్‌ దేశస్తులను రాజేంద్రనగర్‌ పోలీసులు మంగళవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వీరి వద్ద నుంచి ఆధార్, పాన్‌ కార్డులను స్వాదీనం చేసుకున్నారు. మయన్మార్‌కు చెందిన అబ్దుల్‌ మునాఫ్‌ అలియాస్‌ అన్సారీ(31) 2014లో బంగ్లాదేశ్‌ సరిహద్దు మీదుగా పంజాబ్‌కు చేరుకుని అక్కడి నుంచి ముంబై, ఢిల్లీలలో నివసించాడు. అనంతరం రాజేంద్రనగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని చింతల్‌మెట్‌ ప్రాంతానికి వచ్చి దినసరి కూలీగా బతుకుతున్నాడు.

మయన్మార్‌కు చెందిన అఫీజ్‌ అహ్మద్‌(34) 2017లో బంగ్లా సరిహద్దు మీదుగా చింతల్‌మెట్‌ ప్రాంతానికి వచ్చి మునాఫ్‌తో ఉంటున్నాడు. 2018 నుంచి వీరిద్దరు ఇక్కడే ఉంటూ పనులు చేసుకుంటూ వారి భార్యలను సైతం నగరానికి రప్పించారు. ఇక్కడే ఆధార్, పాన్, ఓటర్‌ కార్డు తదితర వాటిని ఏజెంట్ల ద్వారా సమకూర్చుకున్నారు. పోలీసులు అబ్దుల్‌ మునాఫ్, అఫీజ్‌ అహ్మద్‌ను అదుపులోకి తీసుకున్నారు. వారి భార్యలు నూర్‌ కాలీమా, షేక్‌ రోఫికా పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇరువురిని రిమాండ్‌కు తరలించి కేసు  దర్యాప్తు చేస్తున్నారు.  

>
మరిన్ని వార్తలు