తెలంగాణలో లాక్‌డౌన్‌.. ఫేక్‌ జీవో వైరల్‌ చేసిన వ్యక్తి అరెస్ట్‌

5 Apr, 2021 14:01 IST|Sakshi
సోమవారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడిస్తున్న నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ 

లాక్‌డౌన్‌ పేరుతో నకిలీ జీవో సృష్టికర్త కటకటాల్లోకి..

నిందితుడు ప్రైవేట్‌ కంపెనీలో చార్టెడ్‌ అకౌంటెంట్‌

తమ బ్యాడ్మింటన్‌ గ్రూప్‌లో ఏప్రిల్‌ 1న పోస్టు

సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ కావడంతో దుమారం

నిందితుడిని అరెస్టు చేసిన పోలీసు ప్రత్యేక బృందం

సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ ప్రైవేట్‌ సంస్థలో ఆయనో చార్టెడ్‌ అకౌంటెంట్‌. ఏప్రిల్‌ ఫస్ట్‌ నేపథ్యంలో తనతో బ్యాడ్మింటన్‌ ఆడే వారిని ఫూల్స్‌ చేయాలని భావించాడు. దీనికోసం లాక్‌డౌన్‌ అంటూ నకిలీ జీవో సృష్టించి సోషల్‌ మీడియా ద్వారా పోస్టు చేశాడు. దీనిపై తీవ్ర కలకలం రేగడంతో రంగంలోకి దిగిన టాస్క్‌ఫోర్స్, సైబర్‌ క్రైమ్‌ పోలీసుల బృందం సోమవారం నిందితుడిని అరెస్టు చేసింది. నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పూర్తి వివరాలు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌ నెల్లూరులోని దర్గా మిట్ట ప్రాంతానికి చెందిన శ్రీపతి సంజీవ్‌కుమార్‌ 1993లో హైదరాబాద్‌కు వలసవచ్చాడు. సీఏ చదివిన అతడు ప్రస్తుతం కార్వే అండ్‌ కంపెనీలో చార్టెడ్‌ అకౌంటెంట్‌గా పని చేస్తున్నాడు. ఇతడి భార్య ప్రభుత్వ ఉద్యోగిని. మాదాపూర్‌లో నివసిస్తున్న సంజీవ్‌కుమార్‌ నిత్యం స్థానికులతో కలసి బ్యాడ్మింటన్‌ ఆడుతుంటాడు. వీరంతా ఓ వాట్సాప్‌ గ్రూప్‌ క్రియేట్‌ చేసుకున్నారు. 

తేదీ మార్చి నకిలీ జీవో పోస్టు.. 
కాగా, ఏప్రిల్‌ ఫస్ట్‌ నేపథ్యంలో గత గురువారం ఈ గ్రూప్‌ సభ్యుల్ని ఫూల్స్‌ని చేయాలని సంజీవ్‌కుమార్‌ భావించాడు. దీనికోసం ప్రభుత్వ వెబ్‌సైట్‌ నుంచి గత ఏడాది లాక్‌డౌన్‌ విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోను (నం.45) డౌన్‌లోడ్‌ చేసుకున్నాడు. ఇందులో తేదీలు మార్చి ఆ కాపీని బ్యాడ్మింటన్‌ గ్రూప్‌లో షేర్‌ చేశాడు. అందులో సభ్యుడైన శరత్‌కుమార్‌ దాన్ని ఇతర గ్రూపుల్లోకి పంపారు. అలా సోషల్‌ మీడియాలోకి వచ్చిన ఈ జీవో తీవ్ర కలకలం సృష్టించింది. ఏకంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్పందించి నకిలీ జీవో అంటూ వివరణ ఇవ్వాల్సి వచ్చింది. ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాల్సిందిగా ఆదేశించింది.

సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది. నిందితుడిని పట్టుకోవడానికి ఈ అధికారులతో పాటు వెస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులూ రంగం లోకి దిగారు. మొత్తం 18 వాట్సాప్‌ గ్రూపులకు చెందిన 29 మంది అడ్మిన్‌లను ప్రశ్నించారు. ఈ జీవో షేర్‌ అయిన దాదాపు 1,800 సెల్‌ఫోన్లను పరిశీలించారు. ఎట్టకేలకు సంజీవ్‌కుమార్‌ను గుర్తించి అరెస్టు చేసి ల్యాప్‌టాప్, ఫోను స్వాధీనం చేసుకున్నారు. ఏదైనా అంశాన్ని సోషల్‌ మీడియాలో పోస్టు చేసే ముందు సరిచూసుకోవాలని కొత్వాల్‌ ప్రజలను కోరారు. అలా కాకుండా చేస్తే ఆయా గ్రూప్‌ అడ్మిన్లు నిందితులుగా మారతారని, వారిపైనా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు