సైబర్‌ కేసుల ఇన్వెస్టిగేషన్‌ ఎలా చేస్తారో తెలుసా!

31 Aug, 2021 13:11 IST|Sakshi

‘ఇన్వెస్టిగేటర్స్‌ డైరెక్టరీ’ పుస్తకం రూపకల్పన

దర్యాప్తు విధానాలు, లేఖల నమూనాల ముద్రణ

అన్ని ఠాణాలకు అందిస్తున్న పోలీసు విభాగం

సాక్షి, హైదరాబాద్‌: నానాటికీ గణనీయంగా పెరిగిపోతూ ప్రజలను నిలువుగా ముంచుతున్న సైబర్‌ నేరాలపై పోలీసు విభాగం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఓ పక్క వీటిని నిరోధించడానికి అవగాహన కార్యక్రమాలు చేపడుతూనే... కేసులను కొలిక్కి తీసుకురావడానికి కీలక ప్రాధాన్యం ఇస్తోంది. ఇందులో భాగంగానే కేసుల నమోదు ప్రక్రియను వికేంద్రీకరించడంతో పాటు అన్ని స్థాయిల దర్యాప్తు అధికారులకూ ఉపయుక్తంగా ఉండేలా ‘ఇన్వెస్టిగేటర్స్‌ డైరెక్టరీ’పేరుతో ఓ ప్రత్యేక పుస్తకాన్ని ముద్రించి అన్ని ఠాణాలకు సరఫరా చేస్తోంది.

► ప్రస్తుతం రాజధానిలోని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లలో అధికారికంగా సైబర్‌ క్రైమ్‌ పోలీసుస్టేషన్లు ఉన్నాయి. మిగిలిన జిల్లాల్లో సైబర్‌ క్రైమ్‌ సెల్స్‌ ఏర్పాటు చేశారు. ఒకప్పుడు కేవలం వీళ్లే సైబర్‌ నేరాలను దర్యాప్తు చేసేవాళ్లు. 
►సైబర్‌ క్రైమ్‌ ఠాణాల్లో ఏటా వేల కేసులు నమోదు అవుతుండగా... వీటికి మూడునాలుగు రెట్ల వరకు పిటిషన్లు విచారించాల్సి వస్తోంది. దీంతో ఉన్నతాధికారులు స్థానిక పోలీసు స్టేషన్లలోనూ ఈ కేసుల నమోదుకు ఆదేశాలిచ్చారు.  
► ఇప్పటికే ఆయా ఠాణాల్లోని ఎంపిక చేసిన కానిస్టేబుళ్లు, ఎస్సైలకు సైబర్‌ నేరాల కేసుల దర్యాప్తుపై సైబర్‌ క్రైమ్‌ అధికారులు తర్ఫీదు ఇచ్చారు. అయితే కొన్ని సాంకేతిక అంశాలపై వీరికి పట్టు లభించడంలేదు.  
► ఈ కారణంగా కేసుల దర్యాప్తు ఆలస్యం కావడం దాంతో కేసులు మళ్లీ సైబర్‌ క్రైమ్‌ పోలీసుల వద్దకే చేరుతున్నాయి. ఫలితంగా ఎన్ని చర్యలు తీసుకున్నా పరిస్థితులు మొదటికే వస్తున్నాయి.  

►మరోపక్క ప్రతి సోషల్‌మీడియా ప్లాట్‌ఫాం ఓ ఫిర్యాదుల పరిష్కార విభాగం ఏర్పాటు చేయాలంటూ ఇటీవల కేంద్రం ఆదేశించింది. దీంతో ప్రతి సంస్థ తమకు సంబంధించిన నోడల్‌ లేదా గ్రీవెన్స్‌ అధికారులను నియమించుకుంది.  
►సైబర్‌ నేరాలకు సంబంధించిన కేసుల్లో అనుమానితులు, నిందితుల వివరాలు కోరుతూ దర్యాప్తు అధికారులు.. సోషల్‌మీడియా నోడల్‌/గ్రీవెన్స్‌ అధికారులకు ఈ–నోటీసులు జారీ చేసి వారి నుంచి వివరాలు పొందాల్సి ఉంటుంది.  
►దీనికోసం ఆయా కేసుల్ని ఎలా దర్యాప్తు చేయాలి? ఏ అంశంలో ఎవరికి నోటీసులు ఇవ్వాలి? వారి వివరాలు, చిరునామా, సంప్రదించాల్సిన నంబర్లు ఇప్పటి వరకు ఠాణాల స్థాయిలో అందుబాటులో లేవు. 

►ఈ అంశాలపై దృష్టి పెట్టిన రాష్ట్ర పోలీసు విభాగం ‘ఇన్వెస్టిగేటర్స్‌ డైరెక్టరీ’పేరుతో పుస్తకాన్ని తయారు చేసింది. డీజీపీ కార్యాలయంలోని ఐటీ సెల్‌ నేతృత్వంలో నిపుణుల సలహాలు, సూచనలు, వివరాలతో దీన్ని రూపొందించారు.  
►ఇందులో కేసుల దర్యాప్తు తీరుతెన్నులతో పాటు ఏ కేసుల్లో ఎలా స్పందించాలో వివరించారు. ఆయా నోడల్, గ్రీవెన్స్‌ అధికారుల వివరాలు, సంప్రదించడానికి ఉపకరించే ఈ–మెయిల్‌ ఐడీలు, ఫోన్‌ నెంబర్లు పొందుపరిచారు.  
► సమగ్రంగా రూపొందించిన ఈ పుస్తకంలో కేవలం వివరాలు ఇచ్చి వదిలిపెట్టలేదు. ఎవరికి, ఏ ఫార్మాట్‌లో లేఖ రాయాలన్న దానిపై కొన్ని లేఖల్నీ ముద్రించారు. సైబర్‌ నేరాల దర్యాప్తులో ఈ పుస్తకం కీలకంగా మారుతోంది.   

మరిన్ని వార్తలు