హైదరాబాద్‌లో మరికొందరు ‘పోలీస్‌ దొంగ’లు!.. విమానాల్లో తిరుగుతూ సెటిల్‌మెంట్లు

26 Nov, 2022 13:45 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నల్లగొండ టూ టౌన్‌ పోలీసులు అరెస్టు చేసిన టాస్క్‌ఫోర్స్‌ కానిస్టేబుల్‌ మేకల ఈశ్వర్‌ వ్యవహారంతో నగర ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. సిటీలో ఈ తరహా దందాలకు పాల్పడుతున్న ‘పోలీసు దొంగ’ల్లో మరో ముగ్గురిని గుర్తించారు. వీరిలో ఇద్దరు నగర కమిషనరేట్‌లో పని చేస్తుండగా... మరొకరు సైబరాబాద్‌లో ఉన్నట్లు తెలిసింది. వీరి వ్యవహారాలకు సంబంధించిన నివేదికలు అందిన తర్వాత చర్యలు తీసుకోవడానికి ఉన్నతాధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ అధికారులకు సహకరించిన, సహరిస్తున్న ముగ్గురు కానిస్టేబుళ్ల వ్యవహారాన్నీ సీరియస్‌గా తీసుకున్నారు.  

సమాచారంతో మొదలై సహవాసం వరకు... 
పోలీసులకు, దొంగలకు మధ్య పరిచయాలు ఉండటం కొత్త విషయం కాదు. వీరికి సమాచారం ఇచ్చే వారిలో పాత నేరగాళ్లే ఎక్కువగా ఉంటారు. ఎంత ఎక్కువ మంది నేరగాళ్లతో పరిచయాలు ఉంటే అంత ఎక్కువ సమాచారం అందుతుంది. ఈశ్వర్‌ సహా నగరంలో పని చేస్తున్న/చేసిన ముగ్గురు ఇన్‌స్పెక్టర్లు సమాచారం స్థాయిని దాటి సహవాసం వరకు వెళ్లారు. వీళ్లలో కొందరు పిక్‌ పాకెటింగ్, స్నాచింగ్స్‌ గ్యాంగ్స్‌తో సంబంధాలు ఏర్పాటు చేసుకున్నారు. మరికొందరు ఏకంగా వారికి సంబంధించిన సెటిల్‌మెంట్లు చేస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది.

జేబు దొంగలకు చెందిన ఓ బడా నాయకుడు ఇటీవల అస్వస్థతకు గురయ్యాడు. అతడు ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా.. ఓ అధికారి వెళ్లి పరామర్శించడంతో వారి మధ్య సంబంధం బయటపడింది. పిక్‌ పాకెటింగ్‌ గ్యాంగ్స్‌ను పట్టుకున్న ఠాణాలు, ప్రత్యేక విభాగాల వద్దకు వెళ్లే మరో అధికారి వాళ్లను అరెస్టు చూపకుండా వదిలేసేలా పైరవీలు చేయడంలో సిద్ధహస్తుడిగా మారాడు. 

విమానాల్లో తిరుగుతూ సెటిల్‌మెంట్లు... 
ప్రస్తుతం సైబరాబాద్‌ పరిధిలో విధులు నిర్వర్తిస్తున్న ఓ అధికారి ఈ వ్యవహారాల్లో సిద్ధహస్తుడు. తన మాట వినని, తన గ్యాంగ్‌కు వ్యతిరేకంగా పని చేస్తున్న ముఠాలను అరెస్టు చేయడంతోనే ఇతడి సక్సెస్‌ రేటు పెరిగిపోయింది. ఈ సక్సెస్‌ను మాత్రమే చూసిన ఉన్నతాధికారులకు ఇప్పుడిప్పుడే అతడి పూర్తి వ్యవహారాలు తెలుస్తున్నాయి. అంతర్రాష్ట్ర పిక్‌ పాకెటింగ్‌ ముఠాలో ఈ అధికారికి సంబంధాలు ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. ఏ నగరంలోని పోలీసులకు వీరు చిక్కితే ఈయనే వెళ్లి విషయం సెటిల్‌ చేసి వచ్చేవాడు. దీనికోసం లీవ్‌ కూడా పెట్టాల్సిన అవసరం లేకుండా విమానాల్లో వెళ్లి వస్తూ పని పూర్తి చేసేవాడు.

నగరంలో సుదీర్ఘకాలం పని చేసిన ఈయన ఎప్పుడూ ఫోకల్‌ పోస్టు కోసం ప్రయత్నించలేదు. కేవలం ఠాణాల్లోని డిటెక్టివ్, క్రైమ్‌ వింగ్స్‌లో పని చేయడానికే పైరవీలు చేసుకునేవాడు. ఈశ్వర్‌తో పాటు అలాంటి వ్యవహారాలు చక్కబెట్టిన కొందరు కానిస్టేబుళ్లకు అధికారులు సహకారాలు అందిస్తూ వారిని బందోబస్తు డ్యూటీలకు దూరంగా ఉంచేవారని తెలిసింది.  

అంతర్జాతీయ చోరీ ఫోన్ల నెట్‌వర్క్‌లో ఈశ్వర్‌..
అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న ప్రాంతాలు కూడా ఈశ్వర్‌కు ఆ పరిధిలోని ఠాణాలో పోస్టింగ్‌ వచ్చాక క్రైమ్‌ ప్రోన్‌ ఏరియాలుగా మారిపోయేవని తెలిసింది. ఆ పోలీస్‌ స్టేషన్‌లో ఉండే మార్కెట్‌లు, అనువైన ప్రాంతాలను గుర్తించే ఇతగాడు తన గ్యాంగ్స్‌ను దింపి నేరాలు చేయించేవాడు. ఇలా కొందరు దొంగలను తమ కంట్రోల్‌లో పెట్టుకోవడం, రికవరీల్లో సెటిల్‌మెంట్లు చేయడంలో ఈశ్వర్‌తో పాటు మరికొందరూ నిష్ణాతులని తెలుస్తోంది. చోరీ ఫోన్లు ట్రాక్‌ కాకుండా ఉండటానికి ఈశ్వర్‌ అంతర్జాతీయ నెట్‌వర్క్‌తో సంబంధాలు ఏర్పాటు చేసుకున్నట్లు సమాచారం.

తన గ్యాంగ్‌ ద్వారా తన వద్దకు చేరిన ఫోన్ల ఐఎంఈఐ నెంబర్లు క్లోనింగ్‌ చేసేవాడు. అలా కుదరని పక్షంలో బయటి దేశాలకు... ప్రధానంగా నేపాల్‌కు పంపేవాడని సమాచారం. గతంలో ఈశ్వర్‌తో పాటు ప్రస్తుతం ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ అధికారి ఒకే ఠాణాలో పని చేశారు. అçప్పట్లోనూ ఈ గ్యాంగ్స్‌ నిర్వహణ, సెటిల్‌మెంట్లకు సంబంధించి ఇద్దరి మధ్యా విభేదాలు వచ్చాయి.  
చదవండి: Viral: కుటుంబంతో సేదతీరేందుకు వ్యవసాయక్షేత్రంలో రెడీమేడ్‌ ఇల్లు
 

మరిన్ని వార్తలు