ఓ చిన్న ‘స్క్రూ ఓ వాహనం అడ్రస్‌నే’ మార్చేసింది

8 Jul, 2021 07:49 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

గందరగోళం సృష్టించిన ‘5570’ వాహనం

నిత్యం ‘6570’గా పొరపడిన సిబ్బంది

సమస్యను పరిష్కరించిన ట్రాఫిక్‌ పోలీసులు

సాక్షి, హైదరాబాద్‌: ఓ చిన్న ‘స్క్రూ ఓ వాహనం అడ్రస్‌నే’ మార్చేసింది. ట్రాఫిక్‌ నిబంధనలను ఉల్లంఘించిన వాహనంపై కాకుండా మరో వాహనంపై ఈ–చలాన్‌ జారీ అయ్యేలా చేసింది. దీంతో బాధితుడు సిటీ ట్రాఫిక్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వివరాలు.. టీఎస్‌––5570 రిజిస్ట్రేషన్‌ నెంబర్‌ కలిగిన వాహనం నెంబర్‌ ప్లేట్‌పై మొదటి అంకె  ‘5’ ముగింపులో స్క్రూను బిగించారు. దీంతో దూరం నుంచి చూసే వాళ్లకు ఇది ‘6’గా కనిపిస్తోంది.  ఫలితంగా ఆ వాహనం నెంబర్‌ ‘6570’గా కనిపిస్తోంది. నిబంధనలు ఉల్లంఘించినపుడు ట్రాఫిక్‌ పోలీసులు తీసిన స్టిల్‌ కెమెరాల్లో ఈ నెంబర్‌ క్యాప్చర్‌ అయింది.

ఆనెంబరు ‘6570’గా భావించి ఈ–చలాన్లు పంపుతూ వచ్చారు. దీంతో ఆ నెంబరుగల వాహన యజమాని.. గుర్తుతెలియని వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా తన వాహన నెంబర్‌ వినియోగిస్తున్నారని భావించారు. ఈ విషయాన్ని నగర ట్రాఫిక్‌ విభాగం అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. అధికారులు ఆరా తీయగా ‘5570’ నెంబర్‌ గల వాహనం ఉల్లంఘనలకు పాల్పడిందని, అయితే నెంబర్‌ ప్లేట్‌ బిగించడానికి వాడిన స్క్రూ కారణంగా అది ‘6570’గా మారిందని గుర్తించారు. దీంతో పెండింగ్‌ చలాన్లను నిజంగా నిబంధనలు ఉల్లంఘించిన వాహనానికి విధించారు. 

మరిన్ని వార్తలు