KA Paul: ‘కేఏపాల్‌తో మా కుటుంబానికి ప్రాణహాని.. నా భర్తను విడిపించండి’

7 Jun, 2022 10:06 IST|Sakshi
కేఏ పాల్‌ చిత్రపటాన్ని దహనం చేస్తున్న శంకరమ్మ, తదితరులు 

 శ్రీకాంతాచారి తల్లి కాసోజు శంకరమ్మ డిమాండ్‌

ఎల్‌బీ నగర్‌లో కేఏ పాల్‌ చిత్రపటం దహనం

కేఏ పాల్‌తో మా కుటుంబానికి ప్రాణహాని

సాక్షి, హైదరాబాద్‌: ప్రజాశాంతి పార్టీ అధినేత కేఎపాల్‌ తన భర్త  కాసోజు వెంకటాచారిని మభ్యపెట్టి బంధించాడని, వెంటనే అతడిని విడుదల చేయాలని తెలంగాణ మలిదశ ఉద్యమ తొలి అమరుడు కాసోజు శ్రీకాంత్‌చారి తల్లి కాసోజు శంకరమ్మ డిమాండ్‌ చేశారు. సోమవారం ఎల్‌బీనగర్‌లోని శ్రీకాంత్‌చారి విగ్రహం వద్ద బంధువులతో కలిసి కేఏ పాల్‌ చిత్రపటాన్ని దహనం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తన భర్తను కేఎపాల్‌ తన ఇంటిలో బంధించాడని, తాము కేఎపాల్‌ ఇంటికి వెళ్లి వెంకటాచారిని విడిచిపెట్టాలని కోరగా బౌన్సర్లతో గెంటి వేయించాడని ఆరోపించారు.

గేటుకు తాళాలు వేసి లోపలికి రానివ్వడం లేదన్నారు. వెంకటాచారి విడాకుల నోటీసును మీ ఇంటికి పంపించాడు అందలేదా.. అని కేఏ పాల్‌ తన అనుచరులతో చెప్పిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. కేఏ పాల్‌తో తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని ఆరోపించారు. శ్రీకాంత్‌చారి పేరు చెప్పుకుని, ఉద్యమకారుల పేరుతో రాజకీయాలు చేస్తే కేఏపాల్‌కు బుద్ధి చెబుతామన్నారు.

కేఏపాల్‌ చేపట్టే బస్సు యాత్రలో తన భర్త వెంకటాచారిని వెంట తీసుకెళుతూ,  తన కుమారుడు శ్రీకాంత్‌చారి ఫొటోను వాడుకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎల్‌బీనగర్‌లోని శ్రీకాంత్‌చారి విగ్రహం వద్ద కేఎపాల్‌ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని, లేని పక్షంలో తెలంగాణ నుంచి అతడిని తరిమి కొడతామన్నారు. కార్యక్రమంలో బంధువులు సునంద, లలిత, నర్సింహాచారి, వీరాచారి, వాసుదేవాచారి, సంపతాచారి,  రఘు తదితరులు పాల్గొన్నారు. 
చదవండి: Amnesia Pub Case: ఎమ్మెల్యే రఘునందర్‌రావుపై కేసు నమోదు

మరిన్ని వార్తలు