ఈ పిల్లిని ఎలా రక్షిస్తారు? పోలీసు ఫేస్‌బుక్‌లో  పోస్టు చేస్తూ..

17 May, 2022 07:59 IST|Sakshi

 కుబ్తిగూడలో గ్రిల్‌ మధ్య ఇరుక్కున్న మార్జాలం

రెస్క్యూ చేసిన సుల్తాన్‌బజార్‌ పోలీసులు

తమదైన శైలిలో సూచనలిచ్చిన నెటిజనులు  

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ పోలీసులు ఆపదలో ఉన్న బాధితులనే కాదు... మూగజీవులనూ రెస్క్యూ చేస్తున్నారు. ఇందులో భాగంగా సుల్తాన్‌బజార్‌ గస్తీ సిబ్బంది సోమవారం ఉదయం గేట్‌ గ్రిల్‌లో చిక్కుకున్న ఓ పిల్లికి ప్రాణం పోశారు. ఈ విషయాన్ని సిటీ పోలీసు అధికారిక ఫేస్‌బుక్‌లో పోస్టు చేసిన అధికారులు దాంతో పాటు ఓ ప్రశ్నను సంధించారు. దీనికి అనేకమంది నెటిజనుల తమదైన శైలిలో స్పందిస్తూ సలహాలు, సూచలు ఇచ్చారు. ఇది సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

సుల్తాన్‌బజార్‌ ఠాణాకు చెందిన పెట్రో కార్‌–1 సిబ్బంది సోమవారం ఉదయం తమ విధుల్లో భాగంగా గస్తీ నిర్వహిస్తున్నారు. వీరి వాహనం కుబ్తిగూడలోని థామస్‌ చర్చి వద్దకు చేరుకునే సరికి ఓ ఇంటి వద్ద హడావుడి కనిపించింది. అక్కడకు వెళ్లిన గస్తీ పోలీసులు ఆరా తీయగా.. ఆ ఇంటి గేటు గ్రిల్‌లో పిల్లి తల ఇరుక్కుందని, బయటకు తీసుకోవడానికి అది నానా తంటాలు పడుతోందని గుర్తించారు. వెంటనే స్పందించిన పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి మార్జాలానికి గ్రిల్‌ నుంచి విముక్తి కల్పించారు.

పిల్లి గ్రిల్‌లో చిక్కుకున్న ఫొటోను పోస్టు చేసిన సిటీ పోలీసు ఫేస్‌బుక్‌ పేజ్‌ దాంతో పాటు ‘పిల్లిని విడుదల చేయడానికి సులభమైన మార్గాన్ని వ్యాఖ్యానించండి’ అంటూ పేర్కొన్నారు. దీనికి నెటిజనుల నుంచి భారీ స్పందన వచ్చింది. తమకు తోచిన సూచనలు చేశారు. కొందరైతే అలా చిక్కుకున్న పిల్లులను బయటకు తీయడానికి అనుసరించాల్సిన విధానాలతో కూడిన యూట్యూబ్‌ వీడియోల లింకుల్నీ షేర్‌ చేశారు. పిల్లి తలకు, గ్రిల్‌కు నూనె పూసి తీయాలని, వెల్డింగ్‌తో కట్‌ చేయాలని ఇలా సలహాలు ఇచ్చారు.  

మరిన్ని వార్తలు