నేడు కేసీ తండాకు గవర్నర్‌.. గిరిజనులతో కలిసి రెండో డోస్‌

12 Jul, 2021 09:59 IST|Sakshi

ఏర్పాట్లను పరిశీలించిన అదనపు కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌

సాక్షి, మహేశ్వరం: మండల పరిధిలోని కేసీ తండా అంగన్‌వాడీ కేంద్రంలో సోమవారం రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ గిరిజనులతో కలిసి కోవిడ్‌ వ్యాక్సిన్‌ రెండో డోస్‌ తీసుకోనున్నారు. వ్యాక్సిన్‌ పట్ల గిరిజనుల్లో ఉన్న అపోహాలు తొలగించేందుకే గిరిజనులతో కలిసి గవర్నర్‌ టీకా తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. కాగా ఆమె తన మొదటి డోస్‌ను పుదుచ్చేరి ప్రభుత్వాస్పత్రిలో తీసుకున్నారు. ఉదయం 10 గంటలకు మహేశ్వరం శివగంగ రాజరాజేశ్వర ఆలయంలో గవర్నర్‌ ప్రత్యేక పూజలు చేసిన అనంతరం కేసీ తండాకు చేరుకోనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి సబితారెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్‌ తీగల అనితారెడ్డి పాల్గొంటారని ఎంపీపీ కొరుపోలు రఘుమారెడ్డి, టీఆర్‌ఎస్‌ పార్టీ మండల అధ్యక్షుడు హన్మగళ్ల చంద్రయ్య ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 

ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు.. 
గవర్నర్‌ పర్యటనకు సంబంధించి కేసీ తండా, శివగంగ రాజరాజేశ్వర ఆలయంలో ఏర్పాట్లను ఆదివారం అదనపు కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌ పర్యవేక్షించారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఆయన వెంట జెడ్పీ సీఈఓ దిలీప్‌కుమార్, జిల్లా వైద్యాధికారి స్వరాజ్యలక్షి్మ, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్‌రెడ్డి, డీఆర్‌డీఏ అడిషనల్‌ పీడీ నీరజ, తహసీల్దార్‌ ఆర్‌పి. జ్యోతి తదితరులు ఉన్నారు.


కేసీ తండాలో ఏర్పాట్లను పరిశీలిస్తున్న అదనపు కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌   

మరిన్ని వార్తలు