‘వైట్‌’పై ఎల్లో జర్నీ.. ఏమిటీ వైట్‌ ప్లేట్‌..?

13 Jul, 2021 07:29 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

పన్ను ఎగవేతకు పలు మార్గాలు

వైట్‌ నెంబర్‌ ప్లేట్‌పై రవాణా వాహనాలు

నగరంలో యథేచ్ఛగా నిబంధనల ఉల్లంఘన

తనిఖీల్లో ఆర్టీఏ నిర్లక్ష్యం 

సాక్షి, హైదరాబాద్‌: గ్రేటర్‌లో కొన్ని ట్యాక్సీ వాహనాలు, క్యాబ్‌లు మోటారు వాహన నిబంధనలను ఉల్లంఘించి తిరుగుతున్నాయి. పన్నులు ఎగవేసేందుకు ఎల్లో నెంబర్‌ ప్లేట్‌ స్థానంలో వైట్‌ నెంబర్‌ ప్లేట్‌ ఉపయోగిస్తున్నాయి. ఆర్టీఏలో వ్యక్తిగత వాహనాలుగా నమోదు చేసుకొని..ప్రయాణికులకు రవాణా సదుపాయాన్ని అందజేస్తున్నాయి. దీంతో ప్రతి మూడు నెలలకు ఒకసారి క్రమం తప్పకుండా త్రైమాసిక పన్నులు, రాష్ట్రాల సరిహద్దులు దాటినప్పుడు అంతర్రాష్ట్ర పన్నులు చెల్లించి తిరిగే రవాణా వాహనాలు తీవ్రంగా నష్టపోతున్నాయి.

ఇప్పటికే కోవిడ్‌ కారణంగా ట్రావెల్స్‌ రంగం తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటుండగా ఈ తరహా ఉల్లంఘనల వల్ల మరింత నష్టపోవలసి వస్తోందని ట్రావెల్స్‌ నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో సుమారు 10 వేల వాహనాలు ఇలా వ్యక్తిగత వాహనాలుగా నమోదు చేసుకొని  తిరుగుతున్నట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కొన్ని వాహనాలు రవాణా రంగానికి చెందినవిగానే నమోదు చేసుకున్నప్పటికీ అంతర్రాష్ట్ర పన్నుల ఎగవేత కోసం వైట్‌ నెంబర్‌ ప్లేట్‌ను వినియోగిస్తున్నాయి.  

కోవిడ్‌తో సంక్షోభం... 
గత 16 నెలలుగా రవాణా రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. పర్యాటక, ఐటీ రంగాలు పూర్తిగా స్తంభించడం, ఇప్పటికీ పునరుద్ధరణకు నోచకపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఈ క్రమంలో ప్రయాణికుల రవాణా కోసం వినియోగించే అన్ని రకాల ట్యాక్సీలు, క్యాబ్‌లు, మ్యాక్సీ క్యాబ్‌లు, మినీబస్సులు, తదితర వాహనాల నిర్వాహకులు త్రైమాసిక పన్నుల నుంచి మినహాయింపు కోసం ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నారు. 

ఈఎంఐలు కూడా చెల్లించలేని స్థితిలో ఉన్న తాము పన్నులు కట్టలేమంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతేడాది రవాణాశాఖ త్రైమాసిక పన్ను చెల్లింపు నుంచి మినహాయింపునిచి్చనట్లుగానే ఈ ఏడాది కూడా ఇవ్వాలని కోరుతున్నారు. ఒకవైపు ట్రావెల్స్‌ సంస్థల ఆందోళన ఇలా కొనసాగుతుండగా కొంతమంది మాత్రం  మోటారు వాహన నిబంధనలను  ఉల్లంఘించి వైట్‌ నెంబర్‌ ప్లేట్‌పై  తిరగడం పట్ల  తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. 

ఆర్టీఏ నిర్లక్ష్యం... 
ఎల్లో నెంబర్‌ ప్లేట్‌పైన తిరగవలసిన వాహనాలు అందుకు విరుద్దంగా వైట్‌ ప్లేట్‌ను ఏర్పాటు చేసుకొని ప్రయాణికులను తరలిస్తున్నాయి.హైదరాబాద్‌ నుంచి ఏపీకి రాకపోకలు సాగించే వేలాది వాహనాలు  ఇలా తిరుగుతున్నప్పటికీ ఆర్టీఏ అధికారులు మాత్రం నిర్లక్ష్యాన్ని ప్రదర్శించడం గమనార్హం.    

ఏమిటీ వైట్‌ ప్లేట్‌... 
వ్యక్తిగత వాహనాల కోసం రవాణాశాఖ వైట్‌ నెంబర్‌ ప్లేట్‌ను కేటాయించింది. దీనిపైన నలుపు రంగులో వాహనం నెంబర్‌ నమోదై ఉంటుంది. ఈ వాహనాలపైన ఒకేసారి జీవితకాల పన్ను రూపంలో చెల్లిస్తారు. ప్రయాణికుల వాహనాలు, సరుకు రవాణా వాహనాలు మాత్రం వాణిజ్య వాహనాలుగా నమోదై ఉంటాయి. వీటికి పసుపు రంగు నెంబర్‌ప్లేట్‌ (ఎల్లో ప్లేట్‌)పైన నలుపు రంగంలో నెంబర్లు నమోదై ఉంటాయి. ఈ వాహనాలు ప్రతి 3 నెలలకు ఒకసారి పన్ను చెల్లించాలి. సీట్ల సామర్థ్యాన్ని బట్టి ఈ పన్ను మొత్తం ఉంటుంది.  

మరిన్ని వార్తలు