ట్రైనింగ్‌ అంతంతే.. లైసెన్స్‌ వచ్చేస్తుందంతే..! 

5 Jul, 2021 08:37 IST|Sakshi

అరకొర శిక్షణ ఇస్తున్న డ్రైవింగ్‌ స్కూళ్లు

ఆర్టీఏ అండతో లైసెన్సులు జారీ

అడుగడుగునా నిబంధనలకు నీళ్లు  

సాక్షి,హైదరాబాద్‌: బండి ఎక్కాల్సిన పనిలేదు. గేర్లు వేయాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఎక్కడో ఒకచోట డ్రైవింగ్‌ స్కల్లో చేరితే చాలు నెల రోజుల్లో లైసెన్సు చేతికొచ్చేస్తుంది. ఇందుకోసం సదరు డ్రైవింగ్‌ స్కూల్‌ డివండ్‌ మేరకు ఫీజు చెల్లిస్తే సరి. కోవిడ్‌ సాకుతో అన్ని వ్యవస్థలూ నిబంధనలకు తిలోదకాలిచ్చేశాయి. ఏడాది కాలంగా అన్ని  చోట్లా అక్రమాల దందా యథేచ్ఛగా సాగుతోంది. ఈ క్రమంలోనే నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఎలాంటి గుర్తింపు లేని కొన్ని డ్రైవింగ్‌ స్కళ్లు సైతం దళారులకు అడ్డాలుగా వరాయి. ఎలాంటి శిక్షణ, నైపుణ్యం లేకుండానే ఎడాపెడా లైసెన్సులు  ఇప్పించేస్తున్నాయి. కొంతమంది ఆర్టీఏ అధికారులు, సిబ్బంది సైతం వీటికి అండగా నిలుస్తున్నారు. దీంతో  రవాణా శాఖ  పౌరసేవల్లోని  పాదర్శకత హాస్యాస్పదంగా మారింది.  

కొరవడిన శిక్షణ.. 
కారు డ్రైవింగ్‌లో శిక్షణ పొందేందుకు కనీసం 30 రోజుల పాటు శిక్షణ అవసరం. అప్పటికి డ్రైవింగ్‌లో ప్రాథమిక అనుభవం మాత్రమే వస్తుంది. నైపుణ్యం పెంచుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం రవాణాశాఖ  డ్రైవింగ్‌ నేర్చుకొనేవాళ్లకు లెర్నింగ్‌ లైసెన్సు ఇస్తుంది. ఈ లైసెన్సు తీసుకున్నవాళ్లు 30 రోజుల తర్వాత 6 నెలల్లోపు ఎప్పుడైనా డ్రైవింగ్‌ లైసెన్సు తీసుకోవచ్చు.  డ్రైవింగ్‌లో శిక్షణ, నైపుణ్యం, మెలకువలు నేర్చుకొనేందుకే ఈ ఆరు నెలల వెసులుబాటు కల్పించారు.

కానీ చాలా స్కూళ్లు 30 రోజుల శిక్షణలోనే అన్ని పనులు పూర్తి చేస్తున్నాయి. ఈ  వ్యవధిలో  పట్టుమని 10 క్లాసులు కూడా ఇవ్వడం లేదు. డ్రైవింగ్‌లో ప్రాథమికమైన అవగాహన కూడా కల్పించడం లేదు. ఆర్టీఏ అధికారులు, సిబ్బందితో ఉన్న అవగాహన మేరకు మొక్కుబడి డ్రైవింగ్‌ పరీక్షలతో లైసెన్సులు ఇప్పించేస్తున్నారు. కొన్ని చోట్ల కనీసం పరీక్షలు లేకుండానే డ్రైవింగ్‌ లైసెన్సులు ఇచ్చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. 

కోవిడ్‌ ముసుగులో ఉల్లంఘన..
సాధారణంగా  డ్రైవింగ్‌లో  శిక్షణ రెండు విధాలుగా ఉంటుంది. మొదట సాంకేతిక అంశాలపైన తరగతిగది శిక్షణనిస్తారు.  ఆ తర్వాత స్టిమ్యులేటర్‌పై  స్టీరింగ్‌ శిక్షణ ఉంటుంది. ఈ రెండు కార్యక్రమాలతో పాటు రోడ్డుపై శిక్షణనిస్తారు. కనీసం 3 నెలల వ్యవధిలో అభ్యర్థి అన్ని అంశాలపై అవగాహన, శిక్షణ పెంచుకొనేలా ఈ  కార్యక్రమం ఉండాలి. అనేక దశాబ్దాలుగా శిక్షణనిస్తున్న కొన్ని ప్రముఖ డ్రైవింగ్‌ స్కూళ్లు మినహాయించి చాలా వరకు ఎలాంటి శిక్షణను ఇవ్వడం లేదు. కరోనా ముసుగులో ఏడాది కాలంగా ఈ దందా సాగుతోంది.  గ్రేటర్‌లో  రవాణా శాఖ గుర్తింపు ఉన్న స్కళ్లు 150 వరకు ఉంటే  ఎలాంటి గుర్తింపు, ఆమోదం, కనీస నిబంధనలు పాటించనివి 500  పైగానే ఉంటాయి. ఇలాంటి వాటిని నియంత్రించాల్సిన అధికార యంత్రాంగమే నేరుగా ప్రోత్సహించడం గమనార్హం.    

మరిన్ని వార్తలు