20 రోజులు.. 22 లక్షలు వృధా.. ఇలా కూడా పని చేస్తారా!

30 Mar, 2022 11:16 IST|Sakshi

వరద నీటితో ఇబ్బంది పడ్డ దాదాపు 350 కుటుంబాలు 

రూ.22 లక్షలతో చేపట్టిన డ్రైనేజీ పనులు 20 రోజులకే పరిమితం

కొత్తగా రూ.7.40 కోట్లతో బాక్స్‌ టైప్‌ డ్రైనేజీ నిర్మాణం

గత ఆరేళ్లుగా వరద నీటితో తీవ్ర ఇబ్బందులు పడి చివరకు వారి సమస్యలను హైదరాబాద్‌ ఎంపీకి విన్నవించగా ఆయన చొరవతో  డ్రైనేజీ పైప్‌లైన్‌ను నిర్మించారు. కానీ పూర్తయిన 20 రోజులకే దాన్ని తొలగించి నూతనంగా బాక్స్‌ టైప్‌ డ్రైనేజీ కాలువను నిర్మిస్తున్నారు. అధికారుల సమన్వయ లోపంతో 20 రోజుల కోసం లక్షలాది రూపాయల ప్రజాధనం వృధా అవుతోందని స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

సాక్షి,రాజేంద్రనగర్‌(హైదరాబాద్‌): ఫోర్ట్‌వ్యూ కాలనీ గూండా ఎగువ ప్రాంతం నుంచి వచ్చే వరద నీరు, డ్రైనేజీ నీటి కోసం జీహెచ్‌ఎంసీ ప్రాజెక్టు అధికారులు రూ.7.40కోట్లతో బాక్స్‌ టైప్‌ డ్రైనేజీ కాలువను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ పనులు జరుగుతున్నాయి. గత కొన్నేళ్లుగా వరద, డ్రైనేజీ నీటి కారణంగా కాలనీలోని దాదాపు 350 కుటుంబాలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.  

హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ చొరవతో.. 
►   గత ఆరేళ్లుగా సమస్యను పరిష్కరించాలంటూ ఆందోళనలు, ప్రజాప్రతినిధులు, అధికారుల చూట్టూ తిరిగారు. వర్షం కురిసిన ప్రతి సారి ఈ కాలనీలో డ్రైనేజీ, వరద నీరు చొచ్చుకు రావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గత మూడు నెలల క్రితం ఈ సమస్యపై హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీని కలిసిన ఫోర్ట్‌వ్యూ కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు తమ సమస్యను వివరించారు. స్పందించిన ఆయన రూ. 22 లక్షలతో డ్రైనేజీ పైపులైన్‌ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించగా  20 రోజుల క్రితం పనులు పూర్తయ్యాయి. 

ఎగువ నీటితోనే ఇబ్బంది.. 
►  కాలనీకి సంబంధించిన నీరు కాకుండా ఎగువ ప్రాంతం నుంచి వచ్చే మురుగు నీరే ఈ బస్తీకి ప్రధాన సమస్యగా మారింది. ఈ పైపులైన్‌ నిర్మించి 20 రోజులు పూర్తి కావస్తున్న సమయంలో ప్రాజెక్టు అధికారులు పైపులైన్‌ను తొలగించి డ్రైయిన్‌ బాక్స్‌ కాలువను నిర్మించేందుకు పనులను ప్రారంభించారు. దీంతో స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  

అనాలోచిత నిర్ణయంతో.. 
►   ఫోర్ట్‌వ్యూ కాలనీ రహదారులు 40 అడుగుల విస్తీర్ణంలో ఉండగా ప్రస్తుతం ఓ పక్క నుంచి డ్రైనేజీ పైపులైన్‌ను కొత్తగా ఏర్పాటు చేశారు. ఈ డ్రైనేజీ పైపులైన్‌ ఓ వైపు నుంచే బాక్స్‌ టైప్‌ డ్రైనేజీ బాక్స్‌ను నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు. 5 అడుగుల డ్రైయిన్‌ బాక్స్‌ కోసం స్థలం ఉందని అధికారుల అనాలోచిత నిర్ణయంతో ప్రజాధనం వృధా అవుతోందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డ్రైనేజీ పైపులైన్‌ పక్కనుంచే బాక్స్‌ టైప్‌ డ్రైనేజీని నిర్మించాలని వారు కోరుతున్నారు. 

సమస్య తిరిగి పునరావృతం.. 
జీహెచ్‌ఎంసీ ప్రాజెక్టు ఎస్‌ఈ పంత్‌తో పాటు అధికారులందరిని కలిసి సమస్యను వివరిస్తున్నాం. ప్రస్తుతం నిర్మించిన డ్రైనేజీ పైపులై¯Œ ను తొలగించకుండా బాక్స్‌ టైప్‌ నాలాను ఏర్పాటు చేయాలని కోరుతున్నాం. మా వినతిని ఏ ఒక్కరూ పట్టించుకోవడం లేదు. డ్రైనేజీ పైపులైన్‌ను తొలగిస్తే సమస్య తిరిగి పునరావృతం అవుతుంది.
 – ఫోర్ట్‌వ్యూ కాలనీ అధ్యక్షుడు షాహేద్‌ పీర్‌ 

రూ.22 లక్షల ప్రజాధనం వృధా.. 
కాలనీలను ఇబ్బందులకు గురి చేసే విధంగా జీహెచ్‌ఎంసీ ప్రాజెక్టు అధికారులు వ్యవహరిస్తున్నారు. దక్షిణ మండల జోనల్‌ కమిషనర్‌తో పాటు స్థానిక జీహెచ్‌ఎంసీ అధికారులను సంప్రదించకుండానే పనులు చేపడుతున్నారు. దీంతో రూ. 22 లక్షల ప్రజాధనం వృధా అవుతుంది. ఉన్నతాధి కారులు ఈ విషయంలో వెంటనే స్పందించాలి.
  – సుజాత్‌ఖాన్, ఫోర్ట్‌వ్యూ కాలనీ 


   

మరిన్ని వార్తలు