రూ.397 కోట్లు సమర్పించుకున్నారు

11 Jan, 2021 09:57 IST|Sakshi

గ్రేటర్‌ వాసుల్లో పెరిగిపోయిన సి‘వీక్‌’సెన్స్‌

ఎడాపెడా ట్రాఫిక్‌ నిబంధనలు బేఖాతరు

2020లో విధించిన జరిమానాలు రూ.397 కోట్లు

ఈ సమయంలో నేరాల్లో కోల్పోయింది రూ.57 కోట్లే

సాక్షి, హైదరాబాద్‌ : ఎవరింట్లో అయినా దొంగలు పడి తులం బంగారం ఎత్తుకుపోతే నానా హైరానా పడిపోతాం. అదే రహదారిపై వాహనాన్ని డ్రైవ్‌ చేస్తున్నప్పుడు ట్రాఫిక్‌ చలాన్‌ పడుతుందని తెలిసీ ఉల్లంఘనలకు పాల్పడతాం. ట్రాఫిక్‌ ఉల్లంఘనులు ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోకపోవడంతో అప్పుడప్పుడు ప్రమాదాలు చోటు చేసుకోవడమే కాదు... అనునిత్యం నగరవాసి జేబుకు చిల్లుపడుతూనే ఉంది. వాహనచోదకుల అవగాహనా రాహిత్యం... మౌలిక వసతుల లేమి.. ఎడ్యుకేషన్‌ కోణంలో అధికారుల వైఫల్యం.. .కారణం ఏదైతేనేమి మూడు కమిషనరేట్లకు చెందిన వాహనచోదకులు గత ఏడాది అక్షరాలా రూ.397,89,42,640 జరిమానాల రూపంలో ఖజానాకు సమర్పించుకున్నారు. ఇదే కాలంలో చోరీలు, దోపిడీలు, బందిపోటు దొంగతనాలు వంటి వివిధ రకాలైన నేరాల్లో ప్రజలు కోల్పోయింది రూ.57,38,20,973 కావడం గమనార్హం. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లలో సరాసరిన రోజుకు 186 కేసులు నమోదు అవుతుండగా.... ట్రాఫిక్‌ ఉల్లంఘనల సంఖ్య మాత్రం 31,956గా ఉంది. ఈ పరిస్థితులకు బాధ్యులు ఎవరు? నిబంధనలు పట్టని వాహనచోదకులా..? మౌలిక వసతుల కల్పనలో ఘోరంగా విఫలమౌతున్న జీహెచ్‌ఎసీనా? ట్రాఫిక్‌ ఎడ్యుకేషన్‌లో విఫలమౌతున్న పోలీసులా? అనేది అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ మిలియన్‌ డాలర్ల ప్రశ్నే. చదవండి: ఆ జంటకు కాలనీవాసులే కళ్లయ్యారు

నగరంలో రోడ్డు నిబంధనల పాటించకుండా ట్రాఫిక్‌ అధికారుల ఆదేశాలను బేఖాతరు చేసే వారిలో పదే పదే ఈ ఉల్లంఘనలకు పాల్పడే వారే ఎక్కువగా ఉన్నారని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ట్రాఫిక్‌ విభాగం అధికారులు జారీ చేసిన చలాన్ల సంఖ్య... వాహనాల సంఖ్య కంటే కాస్త ఎక్కువగా ఉండటమే దీనికి నిదర్శనం. ఇందులో ప్రతి ఒక్క వాహనచోదకుడూ ఉల్లంఘనలకు పాల్పడటం అనేది జరుగదు. కనిష్టంగా తీసుకున్నా పది లక్షల మంది వాహనచోదకులు నిబంధనలు పాటిస్తూనో, సొంత వాహనాలు లేని కారణంగానో ట్రాఫిక్‌ ఉల్లంఘనలు, జరిమానాలకు పూర్తి దూరంగా ఉన్నారని లెక్కేయచ్చు. అయితే ట్రాఫిక్‌ విభాగం అధికారులు జారీ చేసిన చలాన్ల సంఖ్య మాత్రం ఏటా సరాసరిన 30 లక్షలకు పైగా ఉంది. అనేక మంది వాహనచోదకులు పదేపదే ఉల్లంఘనలకు పాల్పడుతూ రిపీటెడ్‌ వైలేటర్స్‌గా ఉండటమే దీనికి కారణమని అధికారులు విశ్లేషిస్తున్నారు.  

అవగాహనే కీలక ప్రాధాన్యం
‘ఉల్లంఘనులకు చెక్‌ చెప్పడానికి జరిమానాలు విధిస్తున్నాం. వారీలో రహదారి నిబంధనలు, రోడ్డు భద్రతపై అవగాహన కల్పించడానికీ పెద్దపీట వేస్తున్నాం. క్రమం తప్పకుండా ట్రాఫిక్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్స్‌లో కౌన్సెలింగ్‌ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. విద్యార్థి దశ నుంచే మార్పులు తీసుకురావడానికి కళాశాలలు, పాఠశాలలకూ వెళ్ళి అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. కొందరు సెలబ్రెటీలను భద్రతాంశాలపై ప్రచారం కోసం తీసుకురావడంతో పాటు మీడియా ద్వారానూ ప్రచారం చేస్తున్నాం. ట్రాఫిక్‌ పోలీసులకు సంబంధించిన సోషల్‌మీడియా ద్వారా నెట్‌జనులకు దగ్గరవుతున్నాం. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ కంటే ఎడ్యుకేషన్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాం.’
– నగర ట్రాఫిక్‌ అధికారులు 

ఎవరికి వారే మారాలి
‘నగరంలో ఈ పరిస్థితుల నెలకొనడానికి ఏ ఒక్కరో కారణం కాదు. ప్రభుత్వ యంత్రాగాల అలసత్వం, వాహనచోదకుల నిర్లక్ష్యం వెరసి నగరవాసి జేబుకు మాత్రం చిల్లుపడుతోంది. కేవలం చలాన్ల రూపంలోనే కాకుండా విలువైన పనిగంటలు, ఇంధనం రూపంలోనూ నష్టపోతున్నారు. అన్ని ఉల్లంఘనల్లోనూ అత్యంత కీలకమైంది పార్కింగ్‌. ఏ ప్రదేశంలోనూ కూడా నిబంధనల ప్రకారం పార్కింగ్‌ ఉండట్లేదు. అయినప్పటికీ యథేచ్ఛగా కార్యకలాపాలు జరిగిపోతున్నాయి. నిబంధనలను ఇబ్బందిగా ఫీల్‌ అవుతున్న నగరవాసి, మౌలిక వసతుల కల్పనను ఓ భారంగా భావిస్తున్నా జీహెచ్‌ఎంసీ, ట్రాఫిక్‌ ఎడ్యుకేషన్‌కు సరైన ప్రాధాన్యం ఇవ్వని ట్రాఫిక్‌ కాప్స్‌ సమూలంగా మారితేనే పరిస్థితుల్లో మార్పు వచ్చేది’.
– రోమల్, జగదీష్‌ మార్కెట్‌ 

ట్రాఫిక్‌ కేసులు ఇలా... 
కమిషనరేట్‌  చలాన్లు విధించిన జరిమానా 
హైదరాబాద్‌  54,74,479 రూ.173,84,01,535 
సైబరాబాద్  47,71,328 రూ.178,39,40,605 
రాచకొండ 14,18,355 రూ.45,66,00,500 
మొత్తం 1,16,64,162 రూ.397,89,42,640 
(నవంబర్‌ వరకు)

నేరాల కేసులు ఇలా... 
కమిషనరేట్‌ కేసులు దుండుగల పాలైంది 
హైదరాబాద్‌ 22,641 రూ.26,15,21,679 
సైబరాబాద్‌ 24,868 రూ.15,31,78,771    
రాచకొండ 20,641 రూ.15,91,20,523 
మొత్తం  68,150 రూ.57,38,20,973 
(డిసెంబర్‌ 20 వరకు) 

మరిన్ని వార్తలు