ఇది బుడ్డోడి బాహుబలి ‘సొర’

2 Sep, 2021 19:07 IST|Sakshi
తాను పెంచిన సోరకాయతో పూండ్ల అధ్విక్‌రెడ్డి

సాక్షి, బంజారాహిల్స్‌(హైదరాబాద్‌): ప్రకృతిపై ప్రేమ.. పర్యావరణంపై మక్కువ.. ఈ రెండూ కలిపి ఎనిమిదేళ్ల పూండ్ల అధ్విక్‌రెడ్డిని పెరటి తోటలో కూరగాయల పెంపకంపై ఆసక్తిని పెంచింది. ప్రముఖ నిర్మాణ రంగ సంస్థ పీవీఆర్‌ ప్రాజెక్టస్‌ సీఎండి పూండ్ల వెంకురెడ్డి మనవడు అధ్విక్‌రెడ్డి ఓక్రిడ్జ్‌ పబ్లిక్‌ స్కూల్‌లో మూడో తరగతి చదువుతున్నాడు. తండ్రి పి.సతీష్‌కుమార్‌రెడ్డి అదే సంస్థలో ఎగ్జిక్యూటీవ్‌ డైరెక్టర్‌. కాగా తల్లి పి.దీప్తిరెడ్డి యంగ్‌ ఫిక్కి లేడీస్‌ అసోసియేషన్‌ చైర్‌పర్సన్‌.  

తాతకు కూరగాయలు, పండ్ల పెంపకంపై ఉన్న ఆసక్తి మనవడిపై ప్రభావం చూపింది. కరోనా సమయంలో ఇంట్లోనే ఉండాల్సి రావడంతో ఈ బాలుడు పెరటి తోటలో కూరగాయల పెంపకంపై దృష్టిసారించాడు. ఇంట్లో పెట్టిన సోరకాయ ఏకంగా వంద సెంటీమీటర్ల ఎత్తుతో ఆకర్షణగా ఉంది. దీని బరువు 10 కిలోలు. ఈ నాటు సోరకాయను పెంచడానికి అధ్విక్‌ ప్రతిరోజూ వేపపొడితో పాటు సేంద్రీయ ఎరువులను వేస్తుండేవాడు. ఇంటి వెనుక కిచెన్‌ గార్డెన్‌లో కూడా రకరకాల కూరగాయలు పెంచుతున్నాడు. మన కూరగాయలు మనమే పండించుకోవాలన్న ఉద్దేశంతో దీనిపై ఆసక్తి పెరిగిందని ఇందుకోసం పార, గంప తదితర పెరటి తోట సామగ్రిని కూడా కొనుగోలు చేసుకున్నారు. మొక్కలు నాటడం, పెంచడం అది కూడా సేంద్రీయ పద్ధతిలో పండించడం ఈ బాలుడు చేస్తున్న విశేషం.

మా తాత వెంట చేవెళ్లలోని తోటకు వెళ్తుంట.. అక్కడ చాలా కూరగాయల మొక్కలున్నాయి. అలాంటివి ఇంటిదగ్గర పెంచితే రోజూ నీళ్లు పోయొచ్చుకదా అని పెరట్లో నాటాను. రోజూ నాకు మొక్కలతో టైమ్‌పాస్‌ బాగుంది. నేను నాటిన మొక్కకు ఇంత పెద్ద కాయ కాసిందని చాలా హ్యపీగా ఉంది. సోరకాయ తీగ స్విమ్మింగ్‌ పూల్‌లోకి వెళ్లింది. దాంతో స్విమ్మింగ్‌ పూల్‌లో నీటిని తీసేయించా. -అద్విక్‌రెడ్డి

చదవండి: పబ్‌లో చిన్నారి డాన్స్‌ వైరల్‌.. పోలీసుల సీరియస్‌

మరిన్ని వార్తలు