8,289 ఎకరాలు.. 789 కేసులు 

11 Jan, 2021 08:00 IST|Sakshi
మేడ్చల్‌ –మల్కాజిగిరి జిల్లాలో  వివాదస్పద భూములివే

 కోర్టుల్లో మగ్గుతున్న ప్రభుత్వ భూ వివాదాలు

సాక్షి, మేడ్చల్‌ జిల్లా: హైదరాబాద్‌ సహా శివారు (మేడ్చల్‌ జిల్లా)లో సుమారు 8,289.62 ఎకరాల ప్రభుత్వ భూములు వివిధ కోర్టు వివాదాల్లో మగ్గుతున్నాయి. వీటి విలువ రూ.35 వేల కోట్లకుపైగానే ఉంటుందని అంచనా. ఆయా కోర్టుల్లో భూ వివాదాలకు సంబంధించిన కేసుల సంఖ్య 789 ఉండగా.. అత్యధికంగా హైకోర్టులో 545 కేసులు ఉన్నాయి. వివిధ కోర్టుల్లో మొత్తం భూముల్లో హైదరాబాద్‌ జిల్లాకు సంబంధించి 831.62 ఎకరాలు. వీటిలో వివిధ కోర్టుల్లో 83 కేసులు నడుస్తున్నాయి. నగర శివారులోని మేడ్చల్‌ జిల్లాలో వివాదాలకు సంబంధించిన భూములు 7,458 ఎకరాలు ఉన్నాయి. వీటిలో వివిధ కోర్టుల్లో 706 కేసులు కొనసాగుతున్నాయి. వివాదాల్లో ఉన్న హైదరాబాద్‌ జిల్లా పరిధిలోని భూముల విలువ రూ. 9489.16 కోట్లకుపైనే ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అలాగే శివారు (మేడ్చల్‌ జిల్లా)లో వివాదాస్పద భూములు 7,458 ఎకరాలకు సంబంధించి రూ.26 వేల కోట్లకుపైగా ఉంటుందని పేర్కొంటున్నారు.

వివాదాస్పద భూములన్నీ అధికంగా పలువురు రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులకు సంబంధించినవి ఉన్నట్లుగా భావిస్తున్నారు. భూవివాదాల సమాచారాన్ని రెవెన్యూ అధికారులు ప్రభుత్వానికి ఇటీవల నివేదిక సమర్పించారు. దీంతో భూవివాదాలకు సంబంధించిన కోర్టు కేసుల స్టేటస్‌పై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన ప్రభుత్వం సత్వర పరిష్కరానికి చొరవ చూపాలని ఆదేశించినట్లు సమాచారం. కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూములకు సంబంధించిన కేసులు పలు కోర్టుల్లో ఏళ్ల తరబడి నడుస్తుండటంతో ప్రజోపయోగ కార్యక్రమాలకు వినియోగించలేకపోతున్నామన్న అభిప్రాయాలు కూడా లేకపోలేదు. ఈ పరిస్థితుల్లో అధికారులు, ప్రభుత్వ న్యాయవాదులు సమన్వయంతో పని చేసి భూ వివాదాల పరిష్కారానికి అవసరమైన కార్యాచరణ రూపొందించుకోవాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో కోర్టు వివాదాల్లో ఉన్న ప్రభుత్వ భూముల జాబితా సిద్ధం చేసి కేసుల పరిష్కారానికి అధికార యంత్రాంగం సమాయత్తమవుతోంది.

మరిన్ని వార్తలు