Hyderabad: నెహ్రూ జూపార్కులోనే ఓ చీతా ఉంది.. కావాలనుకుంటే వెళ్లి చూడొచ్చు!

21 Sep, 2022 14:26 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా చీతాల విషయంగా చర్చ జరుగుతోంది. అవి ఎలా ఉంటాయి, వాటి ప్రత్యేకతలేమిటన్న దానిపై అందరిలో ఆసక్తి మొదలైంది. అయితే మన హైదరాబాద్‌లోని నెహ్రూ జూపార్కులోనే ఓ చీతా ఉంది. కావాలనుకుంటే వెళ్లి చూడొచ్చు కూడా. 2012లో సౌదీ అరేబియా యువరాజు మహ్మద్‌ బిన్‌ సౌద్‌ నెహ్రూ జూపార్కులో జరిగిన ఓ సదస్సుకు హాజరయ్యారు. జూలో ఏర్పాట్లను చూసి ముచ్చటపడిన ఆయన జత చీతాలు, జత సింహాలను బహుమతిగా ఇస్తున్నట్టు ప్రకటించారు. 2013లో అవి నెహ్రూ జూపార్కుకు చేరుకున్నాయి.

2016లో ఆడ చీతా ఈబా అనారోగ్యంతో చనిపోయింది. అబ్దుల్లాగా పిలిచే మగ చీతా ప్రస్తుతం జూలో ఉంది. ప్రధాని మోదీ ఈ నెల 17న మధ్యప్రదేశ్‌లో చీతాలను విడుదల చేసిన సందర్భంగా.. నెహ్రూ జూపార్కులోని చీతా ఎన్‌క్లోజర్‌ వద్ద ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థులకు డ్రాయింగ్‌ పోటీలను నిర్వహించారు.

కాగా సౌదీ యువరాజు బహుమతిగా ఇచ్చిన రెండు చీతాలు పెంపుడు జంతువులేనని.. సౌతాఫ్రికా నుంచి చిన్న పిల్లలను తెచ్చి పెంచుకున్న ఆయన తర్వాత నెహ్రూ జూపార్కుకు బహుమతిగా ఇచ్చారని జూపార్కు వెటర్నరీ డిప్యూటీ డైరెక్టర్‌ మహమ్మద్‌ అబ్దుల్‌ హకీం తెలిపారు. 

ఆరు పిల్లలు పెట్టిన సింహాలు 
సౌదీ యువరాజు బహుమతిగా ఇచ్చిన ఆఫ్రికన్‌ సింహాలు మదన్, అభిషలకు నెహ్రూ జూపార్కులోనే ఆరు పిల్లలు పుట్టాయి. జూపార్క్‌లో ఆసియా సింహాల ఎన్‌క్లోజర్‌ పక్కనే ఈ ఆఫ్రికన్‌ సింహాల ఎన్‌క్లోజర్‌ ఉంది.
చదవండి: చీతాల మేత కోసం చీతల్! తీవ్రదుమారం 

మరిన్ని వార్తలు