పంచతత్వ పార్కు.. ఆకర్షణ, ఆరోగ్యం దీని ప్రత్యేకత

6 Jun, 2022 10:11 IST|Sakshi

కంప్యూటర్‌ యుగంలో కాలంతో పాటే మనిషి పరుగెత్తుతూ యాంత్రిక జీవన విధానానికి అలవాటు పడిపోతున్నాడు. పని ఒత్తిడితో సతమతమవుతున్నాడు. ఈ పరిస్థితుల్లో ప్రజలు ప్రశాంతంగా కొంత సమయాన్ని గడిపేందుకు వీలుగా పోచారం మున్సిపాలిటీ పరిధిలోని ఎల్‌ఐజీ కాలనీలో పంచతత్వ పార్కు అందుబాటులోకి వచ్చింది. ఈ పార్కులో నడకతో పాటు చిన్న చిన్న వ్యాయామాలు చేస్తే మానసిక ప్రశాంతతో పాటు మంచి ఆరోగ్యం లభిస్తుందని నిర్వాహకులు పేర్కొంటున్నారు.

సాక్షి, హైదరాబాద్‌:  పోచారం మున్సిపాలిటీలోని 3వ వార్డు ఎల్‌ఐజీ కాలనీలో ప్రభుత్వ ఆదేశానుసారం పోచారం పురపాలక సంఘం ఏర్పాటు చేసిన పంచతత్వ పార్కు చూపరులను విశేషంగా ఆకర్షిస్తోంది. పార్కు కేంద్ర బిందువు వద్ద బుద్ధ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దాని చుట్టూ సెక్టార్ల ఆకృతిలో పలు రకాల ఔషధ మొక్కలను పెంచుతున్నారు. తదుపరి వలయంలో 20 ఎంఎం, 10 ఎంఎం కంకర రాళ్లు, రివర్‌ స్టోన్స్, 6 ఎంఎం చిప్స్, ఇసుక, నల్ల రేగడి మట్టి, చెట్ల బెరడు, నీటి బ్లాకుల అనుసంధానంతో ఆక్యుప్రెజర్‌ వాకింగ్‌ ట్రాక్‌ను నిర్మించారు. ఈ ట్రాక్‌పై నడుస్తున్నప్పుడు పాదాల అడుగు భాగంలోని నరాలపై పలు స్థాయిల్లో ఒత్తిడి కలుగుతుంది. తద్వారా శరీరంలో సరైన రక్తప్రసరణ జరిగి అనారోగ్యాలు దూరమవుతాయని 
నిర్వాహకులు చెబుతున్నారు. 

రూ.15 లక్షల నిధులతో.. 
స్వచ్ఛమైన గాలితో పాటు ఆహ్లాదాన్ని పంచే పంచతత్వ పార్కు కోసం రూ.15లక్షల నిధులు వెచ్చించారు. పలు ప్రత్యేకతలతో నిర్మించిన ఈ పంచతత్వ పార్కు సందర్శకులను ఆకట్టుకుంటోంది. 
పార్కులోని మొక్కల పేర్లు.. 
పార్కులో ఫైకస్‌ పాండా, అలోవిరా, కృష్ణ తులసి, రణపాల, రియో, మినీ దురంతో ఎల్లో, ఇప్రోబియా మిల్లి, మినీ దురంతో పింక్, పాండనస్, మినీ ఎక్సోరా వైట్, వాము, లెమన్‌ గ్రాస్, ధవనమ్, పొడపత్రి తదితర మొక్కలున్నాయి.

పంచతత్వ పార్కులో వాకింగ్‌ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు 
► నిద్రలేమిని నివారిస్తోంది 
► కంటి చూపు మెరుగవుతుంది 
► నాడీ వ్యవస్థ బలోపేతమవుతుంది 
► రోగనిరోధక శక్తి పెరుగుతుంది 
►శక్తి వృద్ధి చెందుతుంది 
►రుతుచక్రం సజావుగా సాగుతుంది 
► వేడిని తగ్గిస్తుంది 
► బీపీ తగ్గుతుంది 
► గుండె పనితీరు మెరుగవుతుంది 
► ఒత్తిడి తగ్గి, ప్రశాంతత కులుగుతుంది 
► ఆలోచనా సామర్థ్యం పెరుగుతుంది 

పార్కులో ఇవి పాటించాలి.. 
►పాదరక్షలు లేకుండా నడవాలి. 
► సమయం తీసుకుని నెమ్మదిగా నడవాలి. 
► క్రమం తప్పకుండా నడుస్తూ  పురోగతిలో ఉండాలి.
►గాలిని పీల్చుతూ వదులుతూ ఉండాలి.
►ఎక్కడైనా నడవలేకపోతే, అక్కడ మరో రోజు ప్రయత్నించాలి 
►నడక విషయంలో పట్టుదల ఉండాలి 
►శరీరంలోని వ్యర్థాలు పోవాలంటే నీరు తాగాలి 

రీయో  
►రీయో ఆకులతో డికాషన్‌ తయారు చేసుకుని తాగుతారు. దీని వల్ల దగ్గు, జలుబు, ఆస్తమా, ముక్కు నుంచి రక్తం కారడం వంటివి తగ్గుతాయి. అంతేకాకుండా ఒంట్లో చల్లదనం కోసం కూడా తీసుకుంటారు. 

వాము  
►వాము మొక్క ఆకుల వాసన ఎంతో ప్రశాంతతను కలిగిస్తుంది. మానసికి ఒత్తిడిని తగ్గిస్తుంది. జీర్ణక్రియ మెరుగవుతుంది. గ్యాస్‌ సమస్యలు రాకుండా నివారిస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. 

లెమన్‌ గ్రాస్‌  
►లెమన్‌ గ్రాస్‌ మొక్కలున్న చోటకు దోమలు రావు. దీనిలో ఏ, బీ1, బీ2, బీ3, బీ5, బీ6, కాల్షియం, పొటాషియం, ఐరన్‌ వంటి ఎన్నో పోషకాలు ఉన్నాయి. యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఫంగల్‌ శాతం చాలా ఎక్కువ. లెమన్‌ గ్రాస్‌తో చేసిన టీ(చాయ్‌) నిద్రలేమిని తగ్గిస్తుంది. మస్తిష్కంతో పాటు కండరాలను రిలాక్స్‌ అయ్యేట్లు చేస్తుంది. అల్జీమర్స్‌ చికిత్సలో దీనిని వాడతారు. 

పొడపత్రి 
►పొడపత్రి ఆకుల రసాన్ని పరగడుపున 7 రోజులు తీసుకుంటే చక్కెర వ్యాధి నయమవుతుంది. 

ధవనం 
►దీనినే మాచిపత్రి అని కూడా అంటారు. ఈ మొక్క మంచి సువాసను వెదజల్లుతుంది. దీని వాసన పీల్చుకోవడం ద్వా రా ఒత్తిడి దూరమవుతుంది. దీని ఆకుల నుంచి తీసిన నూనెను చర్మవ్యాధులు, పంటి నొప్పి, చెవి నొప్పి తగ్గడానికి వినియోగిస్తారు. 

పాండనస్‌
ఆకర్షణీయమైన ఆకులతో మనసుకు ఉల్లాసాన్నిస్తుంది. వేడి నీళ్లలో దీని ఆకు వేస్తే మంచి సువాసన వస్తుంది. 

ఎల్‌ఐజీ కాలనీలో ఏర్పాటు చేసిన పంచతత్వ పార్కు  

మరిన్ని వార్తలు