సాక్షి కథనానికి స్పందన.. 300 ఏళ్ల నాటి మెట్ల బావి.. మెరిసింది చూడు...

14 Apr, 2022 09:18 IST|Sakshi

సాక్షి, చౌటుప్పల్‌: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మున్సిపాలిటీ పరిధిలోని లింగోజిగూడెంలో గోసాయిమఠం వద్ద ఉన్న 300 ఏళ్లనాటి మెట్లబావి చిత్రాలివి. పిచ్చి మొక్కలు, చెట్లు, చెత్తా చెదారంతో నామరూపాల్లేకుండా పోయిన ఈ బావి (మొదటి చిత్రం) దుస్థితిపై ‘గతమెంతో ఘనచరిత్ర’ శీర్షికన ఫిబ్రవరి 14న ‘సాక్షి’ కథనాన్ని ప్రచురించింది. పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్‌కుమార్‌ దీనిపై స్పందించి బావి పునరుద్ధరణ పనులు చేయించడంతో ఎంతో సుందరంగా (రెండో చిత్రం) మారింది. మరమ్మతులకు ముందు, తర్వాత తీసిన ఈ బావి ఫొటోలను అరవింద్‌కుమార్‌ బుధవారం ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. దీనికి మంత్రి కేటీఆర్‌కు ట్యాగ్‌ చేశారు. 

ప్రత్యేకతలు ఎన్నో.. 
మూడు వందల ఏళ్ల కింద.. 30 అడుగుల వెడల్పు, 60 అడుగుల పొడవు, 80 అడుగుల లోతుతో పూర్తిగా రాళ్లతో నిర్మించిన ఈ దిగుడు బావి ఇప్పటికీ చెక్కుచెదరలేదు. దీనికి తూర్పున, ఉత్తరంలో మెట్లను ఏర్పాటు చేశారు. భూమి నుంచి 25 అడుగుల దిగువన ఆర్చీలతో మూడు గదులు నిర్మించారు. ఈ మెట్లబావిని పునరుద్ధరించడంపై మంత్రి కేటీఆర్, ముఖ్యకార్యదర్శి అరవింద్‌కుమార్‌లకు పురావస్తు పరిశోధకుడు ఈమని శివనాగిరెడ్డి ధన్యవాదాలు తెలిపారు. దీనిని పర్యాటక ప్రాంతంగా మార్చాలని కోరారు. 
చదవండి: రైళ్లో టికెట్‌ లేకుండా ప్రయాణిస్తున్నారా!.. ఇకపై ఇట్టే దొరికిపోతారు

మరిన్ని వార్తలు