Black Fungus: బ్లాక్‌ ఫంగస్‌ పంజా.. ఒక్క రోజే 302 మంది..

23 May, 2021 02:08 IST|Sakshi

ఒక్కరోజే కోఠి ఈఎన్‌టీకి 252, గాంధీకి 50 మంది బాధితులు  

వికారాబాద్‌ జిల్లాకు చెందిన  ఓ వ్యక్తి మృతి 

బాధితులంతా కరోనా నుంచి కోలుకున్నవారే.. 

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలో బ్లాక్‌ఫంగస్‌ పంజా విసురుతోంది. రోజురోజుకు బాధితుల సంఖ్య పెరుగుతుండటంతో ఆందోళన వ్యక్తమవుతోంది. శనివారం వికారాబాద్‌ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి మృతి చెందారు. హైదరాబాద్‌ కోఠి ఈఎన్‌టీ ఆస్పత్రికి ఒక్కరోజే 252, సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో 50 మంది  బాధితులు రావడం చూస్తుంటే.. ఈ వ్యాధి తీవ్రత ఏ మేరకు ఉందో ఇట్టే తెలుస్తోంది. ముఖ్యంగా కరోనా వైరస్‌ బారి నుంచి కోలుకున్న వారికి బ్లాక్‌ఫంగస్‌ సోకుతోంది. వైరస్‌ తగ్గాలని అధికశాతం స్టెరాయిడ్స్‌ ఇస్తుండటంతో ఈ ఫంగస్‌ దాడి చేస్తుందని చెబుతున్నారు. వికారాబాద్‌ జిల్లా తాండూరు మండలం ఎల్మకన్నె గ్రామానికి చెందిన జంగం వెంకట్‌రెడ్డి (50) ఇరవై రోజుల క్రితం కరోనా బారినపడ్డాడు.

ఆస్పత్రిలో చికిత్స పొందాక.. తర్వాత హోం ఐసోలేషన్‌లో ఉంటూ మందులు వాడుతున్నాడు. మూడు రోజుల క్రితం ఎడమ కన్నుకు ఇన్‌ఫెక్షన్‌ సోకింది. దీంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రి, అక్కడి నుంచి గాంధీ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ వెంకట్‌రెడ్డి శనివారం ఉదయం మరణించాడు. అలాగే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలం రాజాపురం గ్రామానికి చెందిన తూలగుంట్ల సులోచన (57) కంటికి దురద, వాపు రావడం, కంటిచూపు మందగించడంతో 17న పెనుబల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించగా.. బ్లాక్‌ ఫంగస్‌ లక్షణాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. వెంటనే భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి ఆందోళనకరంగానే ఉన్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.

మహబూబాబాద్‌ జిల్లా బయ్యారం మండలం బాల్యాతండాకు చెందిన గుగులోత్‌ చిరంజీవి (36)కి కంటి కింద వాపు వచ్చింది. కుటుంబసభ్యులు మహబూబాబాద్‌ ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లగా.. పరీక్షించిన వైద్యులు బ్లాక్‌ ఫంగస్‌గా అనుమానించి హైదరాబాద్‌ ఈఎన్‌టీ ఆస్పత్రికి రిఫర్‌ చేశారు. జగిత్యాల రూరల్‌ మండలం హబ్సీపూర్‌ గ్రామానికి చెందిన వృద్ధుడికి బ్లాక్‌ ఫంగస్‌ లక్షణాలు కనిపించడంతో శుక్రవారం రాత్రి గాంధీ ఆస్పత్రిలో చేర్పించారు. అధికశాతం బాధితులంతా ఇటీవల కరోనా నుంచి కోలుకున్నవారు కావడం గమనార్హం.   

మరిన్ని వార్తలు