ప్రతీ 600 మందికి ఒక వైద్యుడు 

28 Dec, 2022 01:34 IST|Sakshi
సమావేశంలో మాట్లాడుతున్న వినోద్‌కుమార్‌ 

ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య సమావేశంలో బి.వినోద్‌కుమార్‌

సాక్షి, హైదరాబాద్‌: ప్రతీ జిల్లాకు వైద్య కళాశాల ఏర్పాటు చేయడం వల్ల రాబోయే రోజుల్లో తెలంగాణలో ప్రతీ 600 మందికి ఒక డాక్టర్‌ ఉంటారని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ పేర్కొన్నారు. హైదరాబాద్‌లో మంగళవారం జరిగిన అఖిల భారత ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఏఐఎఫ్‌టీవో) జాతీయ కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు.

విద్యా రంగానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యమిస్తోందని, వెయ్యికి పైగా రెసిడెన్షియల్‌ కాలేజీలు ఏర్పాటు చేసిందని, ప్రతీ విద్యార్థిపై ఏడాదికి రూ.1.20 లక్షలు ఖర్చు చేస్తోందని తెలిపారు. విదేశాల్లో చదివే పేద విద్యార్థులకు రూ.20 లక్షలు అందిస్తోందన్నారు. సమావేశానికి అధ్యక్షత వహించిన ఏఐఎఫ్‌టీవో జాతీయ అధ్యక్షుడు అశ్వినికుమార్‌ మాట్లాడుతూ.. ఉద్యోగులకు నష్టం కలిగిస్తున్న కాంట్రి బ్యూటరీ పెన్షన్‌ విధానానికి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో ఉద్యమ ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో సంఘం సెక్రటరీ జనరల్‌ చగన్‌లాల్‌ రోజ్, జాతీయ ఉపాధ్యక్షుడు పి. శ్రీపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీ కూర రఘోత్తమరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, పీఆర్‌టీయూటీఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీరెల్లి కమలాకర్‌రావు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు