అంత్యక్రియల్లో జాప్యం.. నిలిచిన ప్రాణం

6 May, 2022 14:28 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, హైదరాబాద్‌: ‘ఆలస్యం.. అమృతం విషం’ అంటారు. కానీ ఇక్కడ ఆలస్యమే అమృతమై పసికందుకు ప్రాణాలు పోసింది. వివరాల్లోకి వెళితే.. పోచారం మున్సిపాలిటీ పరిధిలోని ఇస్మాయిల్‌ఖాన్‌గూడకు చెందిన అన్నం శ్రీకాంత్‌ భార్య ఘట్‌కేసర్‌ హాస్పిటల్‌లో మగ శిశువుకు ఇటీవల జన్మనిచ్చింది. బాబు ఆరోగ్యం సరిగా లేకపోవడంతో ఉప్పల్‌లోని ఓ ప్రైవేట్‌ హాస్పిటల్‌లో 10 రోజులపాటు వెంటిలేటర్‌పై చికిత్స అందించారు. వెంటిలేటర్‌ తీసేస్తే బాబు బతకడని చెప్పిన వైద్యులు, రూ.4 లక్షలు బిల్లు కట్టించుకుని బుధవారం రాత్రి డిశ్చార్జి చేశారు.

ఇంటికి తీసుకొచ్చాక సమాధి చేసేందుకు ‘వసంత వ్యాలీ’ కాలనీలోని ప్రభుత్వ స్థలంలో గుంత తవ్వించారు. ఇంతలో కాలనీవాసులు ఇది శ్మశానవాటిక కాదని, ఇందులో సమాధి చేయొద్దని అడ్డుకున్నారు. పోలీసులు వచ్చి సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తుండగానే.. అకస్మాత్తుగా పసికందులో కదలికలు ప్రారంభమయ్యాయి. గమనించిన తల్లిదండ్రులు రాత్రి 11 గంటల సమయంలో నీలోఫర్‌ ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయిస్తున్నారు.  
చదవండి: ఐఆర్‌సీటీసీ స్వదేశ్‌ దర్శన్‌ పర్యాటక రైళ్లు

మరిన్ని వార్తలు