Balkampet Yellamma Kalyanam 2022: అశేష భక్తజనంతో కిటకిటలాడిన ఆలయం

6 Jul, 2022 11:01 IST|Sakshi
ఎల్లమ్మ తల్లి కల్యాణం జరిపిస్తున్న వేద పండితులు,

పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, తలసాని

తరలివచ్చిన వీఐపీలు

క్యూలైన్ల గజిబిజితో కొంత గందరగోళం 

సాక్షి, హైదరాబాద్‌: ఎటుచూసినా అశేష భక్తజనం.. అమ్మవారి నామస్మరణలతో.. బల్కంపేట రేణుకా ఎల్లమ్మ దేవాలయ పరిసరాలు మార్మోగాయి. ఎల్లమ్మ కల్యాణ మహోత్సవం మంగళవారం వైభవోపేతంగా జరిగింది. ప్రత్యేక పూజల అనంతరం బాజా భజంత్రీల నడుమ తమిళనాడులోని మధురైలో ప్రత్యేకంగా తయారు చేసి తీసుకువచ్చిన ఉత్సవ మూర్తులను కలాణ వేదికపైకి తరలించి వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ ఉదయం 11.45 గంటలకు కల్యాణం నిర్వహించారు.

మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ దంపతులు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. శివసత్తుల పూనకాలు.. పోతరాజుల విన్యాసాలు.. అశేష భక్తజనంతో ఆలయ పరిసరాలు పసుపుపచ్చ మయంగా మారాయి. బల్కంపేట ఎల్లమ్మ కల్యాణానికి ముందు ఊహించిన దానికంటే ఎక్కువ మంది భక్తులు వచ్చినట్లు అధికారులు భావిస్తున్నారు. దాదాపు మూడు లక్షల మందికిపైగా భక్తులు వచ్చి ఉంటారని పోలీసు అధికారులు తెలిపారు.  

మొక్కులు చెల్లించుకున్న ప్రముఖులు..
అమ్మవారికి పలువురు ప్రముఖులు మొక్కులు తీర్చుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ కుమార్‌ దంపతులు, టీఎస్‌ఎంఐడీసి ఛైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్, నగర మేయర్‌ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్‌ శ్రీలత, ఎంపీ మాలోతు కవిత, దేవాదాయశాఖ కమిషనర్‌ అనీల్‌ కుమార్, దైవజ్ఞశర్మ, ఆలయ ఈఓ ఎస్‌.అన్నపూర్ణ, ట్రస్టీ చైర్మన్‌ సాయిబాబా గౌడ్, కార్పొరేటర్లు కేతినేని సరళ, మహేశ్వరి, మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్‌రెడ్డి, మాజీ కార్పొరేటర్లు నామన శేషుకుమారి, అత్తిలి అరుణగౌడ్, పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సతీమణి కావ్యారెడ్డి అమ్మవారికి ఒడి బియ్యం, చీర సమర్పించారు. జీటీఆర్‌ బంగారు నగల షాపు నిర్వాహకులు ముత్యాల తలంబ్రాలను అందజేశారు. ఈసారి ఏర్పాట్లలో కొంత గందరగోళ పరిస్థితులు ఏర్పడటంతో భక్తులు ఇబ్బందుల పాలయ్యారు. గజిబిజి క్యూలైన్లతో అయోమయానికి గురయ్యారు.  

నేడు రథోత్సవం 
కల్యాణ మహోత్సవాల్లో భాగంలో చివరి ఘట్టమైన రథోత్సవం బుధవారం జరగనుంది. రథోత్సవం ఊరేగింపు పరిధిని ఈసారి పెంచారు. ఎల్లమ్మ దేవాలయం నుంచి ప్రారంభమై ఎస్‌ఎస్‌ బేకరీ వద్ద మళ్లించి బీకేగూడ, శ్రీరాంనగర్‌ కాలనీ మీదుగా తిరిగి ఆలయానికి చేరుకునేది. ఈసారి ఎస్‌ఆర్‌నగర్‌ పాత పోలీస్‌స్టేషన్‌ మీదుగా ఎస్‌ఆర్‌నగర్‌ కమ్యూనిటీ హాల్‌ వద్ద మళ్లించేలా ఏర్పాట్లు చేశారు.   

భక్తి శ్రద్ధలతో బంగారు బోనం
చార్మినార్‌: భాగ్యనగర్‌ శ్రీ మహంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ చైర్మన్‌ రాకేశ్‌ తివారీ ఆధ్వర్యంలో మూడో బంగారు బోనాన్ని మంగళవారం బల్కంపేట ఎల్లమ్మ తల్లికి సమర్పించారు. అంతకుముందు సుల్తాన్‌షాహీ జగదాంబ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం జోగిని నిషా క్రాంతి నైవేద్యంతో కూడిన బంగారు పాత్రను తలపై పెట్టుకుని ముందుకు కదిలారు. ఊరేగింపులో ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ ఉపాధ్యక్షుడు మామిడి కృష్ణ, ప్రధాన కార్యదర్శి క్రాంతికుమార్, కార్యదర్శి గాజుల రాహుల్, మీడియా కార్యదర్శి జ్యోతికుమార్, మాజీ చైర్మన్‌ గాజుల అంజయ్య, మాజీ ఉపాధ్యక్షుడు ఆనంద్‌రావు, ఆదర్ల మహేష్‌ పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు