హై వ్యాల్యూమ్‌తో డీజే.. బంజారాహిల్స్‌లో రెండు పబ్‌లపై కేసు నమోదు

6 Dec, 2022 20:19 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ట్రాఫిక్‌కు అడ్డంకులు కలిగించడమే కాకుండా హై వ్యాల్యూమ్‌తో డీజే ఏర్పాటు చేసి శబ్ధ కాలుష్యానికి పాల్పడిన రెండు పబ్‌లపై బంజారాహిల్స్‌ పోలీసులు కేసులు నమోదు చేశారు. వివరాలివీ... బంజారాహిల్స్‌ రోడ్‌ నెం. 14లో కేబీఆర్‌ పార్కు ముందు రియోట్‌ పబ్, చీర్స్‌ పబ్‌ ఒకే భవనంలో కొనసాగుతున్నాయి. ఆదివారం రాత్రి 1.10 గంటల సమయంలో స్థానిక పోలీసులు పెట్రోలింగ్‌ చేస్తుండగా ఈ రెండు పబ్‌ల నుంచి నిబంధనలకు విరుద్ధంగా డీజే సౌండ్‌  వినిపిస్తుండటంతో తనిఖీలు చేపట్టారు.

గడువు ముగిసిన తర్వాత కూడా డీజే ఏర్పాటు చేయడమే కాకుండా ప్రధాన రోడ్డుపై పెద్ద ఎత్తున వాహనాలు పార్కింగ్‌ చేసి రోడ్డుపై కస్టమర్లు న్యూసెన్స్‌ చేస్తుండటంతో పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇందులో భాగంగానే రియోట్‌ పబ్‌ యజమాని కన్హయ్య కుమార్‌సింగ్, చీర్స్‌ పబ్‌ యజమాని తానిశెట్టి రాములపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.   

మరిన్ని వార్తలు