బ్యాంక్‌ ఖాతా నుంచి 1.2 కోట్లు మాయం.. కంప్లైంట్‌ ఇవ్వడంతో..

24 Aug, 2021 08:03 IST|Sakshi

సాక్షి, సిటీబ్యూరో: ఎర్రమంజిల్‌లోని బ్యాంక్‌ ఆఫ్‌ బహ్రేన్‌ అండ్‌ కువైట్‌లో ఉన్న ముగ్గురు మృతుల జాయింట్‌ అకౌంట్‌ నుంచి మాయమైన రూ.1.2 కోట్లు భద్రంగా ఉన్నాయి. ఈ మేరకు ఆ బ్యాంకు అధికారులు సోమవారం సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు సమాచారం ఇచ్చారు. సాంకేతిక తప్పిదం వల్లే ఆ డబ్బు వేరే ఖాతాలోకి వెళ్లిందని, తక్షణం అప్రమత్తమై వెనక్కు తెచ్చామని స్పష్టం చేశారు.

 డబ్బు ఇలా వెనక్కు వచ్చింది..
ఖైరతాబాద్‌కు చెందిన వైద్యులు డాక్టర్‌ శంషద్‌ హుస్సేన్‌తో పాటు ఆయన భార్య, కుమారుడు డాక్టర్‌ బెహజిత్‌ హుస్సేన్‌లకు బ్యాంక్‌ ఆఫ్‌ బహ్రేన్‌ అండ్‌ కువైట్‌లో జాయింట్‌ అకౌంట్‌ ఉంది. కొన్నాళ్ల క్రితం అనారోగ్య కారణాలతో ముగ్గురూ వేర్వేరు సమయాల్లో మరణించారు. అప్పటికే ఈ జాయింట్‌ ఖాతాలో రూ.2 కోట్లకు పైగా నిల్వ ఉంది. ఖాతాదారుల మృతి విషయం తెలుసుకున్న బ్యాంకు అధికారులు ఆ అకౌంట్‌ను డెబిట్‌ ఫ్రీజ్‌ చేశారు. దీని ప్రకారం తదుపరి ఉత్తర్వుల వరకు ఎవరూ ఆ నగదును డ్రా చేయడం, మళ్లించడం సాధ్యం కాదు. గతంలో బ్యాంక్‌ను సంప్రదించిన బెహజిత్‌ హుస్సేన్‌ భార్య మిర్హత్‌ హుస్సేన్‌ తన భర్త, అత్తమామలకు సంబంధించిన ఆదాయపు పన్ను బకాయిలు చెల్లించడానికి ఖాతాలోని నగదు ఇవ్వాల్సిందిగా కోరారు.

డెబిట్‌ ఫ్రీజ్‌ విషయాన్ని ఆమెకు చెప్పిన బ్యాంకు అధికారులు అది సాధ్యం కాదని చెప్పారు. బ్యాంకులో నామినిగానూ ఎవరి పేరూ పెట్టకపోవడంతో ఈ ప్రక్రియకు కొన్ని పత్రాలు కావాలని కోరారు. ఇదిలా ఉండగా... సదరు జాయింట్‌ అకౌంట్‌ నుంచి రూ.1.20 కోట్లు వేరే ఖాతాకు బదిలీ అయినట్లు మిర్హత్‌ వద్ద ఉన్న ఫోన్‌కు సందేశాలు వచ్చాయి. దీంతో ఆమె గత గురువారం సిటీ సైబర్‌ క్రైమ్‌ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌ను కలిసి ఫిర్యాదు చేశారు.

ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తులో భాగంగా ఆ ఖాతా నుంచి డబ్బు ఎక్కడకు వెళ్లాయి? ఎలా వెళ్లాయి? తదితర వివరాలు కోరుతూ బ్యాంక్‌ అధికారులకు లేఖ రాశారు. సర్వర్‌ ఇబ్బందుల నేపథ్యంలో బ్యాంక్‌ నుంచి సోమవారం జవాబు అందింది. సాంకేతిక కారణాలతోనే ఆ బదిలీలు జరిగాయని, తిరిగి మృతల ఖాతాలోకి డబ్బు మళ్లించామని స్పష్టం చేశారు. దీంతో మిర్హత్‌ ఫిర్యాదు మేరకు నమోదైన కేసును మూసేయాలని నిర్ణయించామని ఏసీపీ కేవీఎం ప్రసాద్‌ తెలిపారు.  

మరిన్ని వార్తలు