హైదరాబాద్‌: పబ్లిక్‌ వైఫై వాడాడు.. పైసలు పొగొట్టుకున్నాడు! తస్మాత్‌ జాగ్రత్త

9 Jan, 2023 08:56 IST|Sakshi

కుమార్‌.. (పేరు మార్చాం) చదువు పూర్తి చేసుకుని గ్రూప్స్‌ కోచింగ్‌ కోసం నగరానికి వచ్చాడు. కోచింగ్‌ కోసం ఓ ఇనిస్టిట్యూట్‌లో చేరేందుకు ఇంట్లోవాళ్లు డబ్బులు పంపించారు. బయటకు వెళ్లిన కుమార్‌.. ఓ షాపింగ్‌ మాల్‌ బయట ఫ్రీ వైఫైను ఉపయోగించుకునేందుకు యత్నించాడు. ఓటీపీతో లాగిన్‌ అయ్యి.. మెరుపు వేగంతో వస్తున్న ఇంటర్నెట్‌ నుంచి ఆశ్చర్యపోయాడు. అలా నెట్‌ను వాడుకున్న కాసేపటికే.. అతని మొబైల్‌కు మెసేజ్‌లు వస్తూనే ఉన్నాయి. బ్యాంక్‌ అకౌంట్‌లో ఉన్న 50 వేలు కొంచెం కొంచెంగా మాయం అయ్యాయి. భయాందోళనతో.. షాపింగ్‌ మాల్‌ వాళ్లను నిలదీశాడు. అసలు తమ మాల్‌కు ఫ్రీ వైఫై యాక్సెస్‌ లేదని చెప్పడంతో షాక్‌ తిన్నాడు. వెంటనే సైబర్‌ పోలీసులను ఆశ్రయించాడు.  

సాక్షి, హైదరాబాద్‌:  ఈరోజుల్లో స్మార్ట్‌ ఫోన్‌లు వాడుతున్న వాళ్లు.. మినిమమ్‌ 1 జీబీకి తక్కువ కాకుండా ఇంటర్నెట్‌ప్యాక్‌లు ఉపయోగిస్తున్నారు. అయితే అవసరానికి పబ్లిక్‌ వైఫైలు వాడుతున్న వాళ్లు కూడా ఉన్నారు. అలాంటి వాళ్లు జాగ్రత్తగా ఉండాలని సైబర్‌ సెక్యూరిటీ నిపుణులు సూచిస్తున్నారు.

ఇప్పుడంతా ఇంటర్నెట్‌ జమానా. నెట్‌తో కనెక్ట్‌ కాకుండా క్షణం ఉండలేని పరిస్థితి. ఆన్‌లైన్‌ చదువుల మొదలు.. ఆఫీస్‌కు ఇన్ఫర్మేషన్‌ పంపే వరకు ఎప్పుడైనా ఎక్కడైనా..ఇంటర్నెట్‌ సదుపాయం తప్పనిసరి. కొన్నిసార్లు ప్రయాణంలో ఉన్నప్పుడు, బయట అనుకోని పరిస్థితుల్లో ఫోన్‌లో నెట్‌ బ్యాలెన్స్‌ లేనప్పుడు ఫ్రీ వైఫైల వైపు చూడడం పరిపాటే.

పబ్లిక్‌ ప్రదేశాల్లో అందుబాటులో ఉండే వైఫై వినియోగించి ఈ–మెయిల్, ఇతర సోషల్‌ మీడియా ఖాతాలు ఓపెన్‌ చేయడం, ముఖ్యంగా ఆన్‌లైన్‌ బ్యాంక్‌ లావాదేవీలు చేస్తే.. మనం నమోదు చేసే యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌లను సైబర్‌ నేరగాళ్లు మాల్‌వేర్‌ ద్వారా హ్యాక్‌ చేసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఉచిత వైఫై వాడాల్సి వస్తే.. అది అధికారికమేనా? సురక్షితమేనా? అనేది క్రాస్‌ చెక్‌ చేస్కోవాలి. అలాగే నమ్మదగిన వీపీఎన్‌ను ముందే ఇన్‌స్టాల్‌ చేసుకోవాలని సూచిస్తున్నారు.

మరిన్ని వార్తలు