‘డెంగీ’ఉంది..‘జ్వర’భద్రం

3 Sep, 2021 04:38 IST|Sakshi

సీజనల్‌ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

డెంగీ, కోవిడ్‌ల లక్షణాలు ఒకేరకంగా ఉన్నందున నిర్ధారణ పరీక్షలు తప్పనిసరి

పెళ్లిళ్లు, గృహప్రవేశాలు, వేడుకలతో మళ్లీ కరోనా ఉధృతి పెరిగే అవకాశాలు

ప్రస్తుత వర్షాకాల సీజన్‌లో మరింత అప్రమత్తత అవసరమంటున్న వైద్య నిపుణులు

సాక్షి, హైదరాబాద్‌: ప్రస్తుతం సీజనల్‌ వ్యాధుల పెరుగుదలతో పాటు డెంగీ వ్యాప్తి అత్యధికంగా ఉన్నందున జ్వరం వస్తే వెంటనే పరీక్షలు చేయించుకుని అది డెంగీనా లేక కరోనా అన్నది నిర్ధారించుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఇప్పుడున్న వాతావరణ పరిస్థితులు అనుకూలించడంతో డెంగీ కేసులు పెరుగుతున్నాయని, అయితే ఇదే సమయంలోనూ కోవిడ్‌ పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందంటున్నారు. ప్రధానంగా డెంగీ, కరోనాలకు సంబంధించిన లక్షణాలు దాదాపుగా ఒకే విధంగా ఉన్నందున కచ్చితమైన నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు.

ప్రస్తుతం పెళ్లిళ్లు, గృహ ప్రవేశాలు, వేడుకలు అంటూ విపరీతంగా తిరిగేస్తున్నారని, ఇప్పుడు నమోదవుతున్న కేసుల్లోనూ ఇలా ఏదైనా సమూహంలో గడిపి వచ్చిన వారిలోనే ఎక్కువగా కరోనా పాజిటివ్‌ కేసులుంటున్నాయని స్పష్టం చేస్తున్నారు. కుటుంబంలోని ఒకరికి వస్తే సహజంగానే అందరూ దాని బారిన పడుతున్నట్టుగా చెబుతున్నారు. ప్రస్తుత వర్షాకాలంలో సీజనల్‌ వ్యాధులు, వైరల్‌ జ్వరాలు పెరుగుతున్నందున వాటి లక్షణాలు, కరోనా నేపథ్యంలో ఎలాంటి పరీక్షలు చేయించాలి, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ‘సాక్షి’తో పల్మనాలజిస్ట్‌ డా.వి.వి.రమణప్రసాద్, కన్సల్టెంట్‌ ఫిజీషియన్‌ డా.ప్రభుకుమార్‌ చల్లగాలి తమ అభిప్రాయాలు పంచుకున్నారు. ముఖ్యాంశాలు వారి మాటల్లోనే...

డెంగీ వచ్చిన వారిలో కూడా కరోనా పాజిటివ్‌ లక్షణాల మాదిరే దగ్గు, జ్వరం, గొంతునొప్పి ఉంటున్నాయి. వీరి పరీక్షల్లో తెల్ల రక్తకణాలు, ప్లేట్‌లెట్ల సంఖ్య తక్కువగా ఉండటంతో పాటు డెంగీ పాజిటివ్‌గా ఉంటోంది. సీజనల్‌ ఫ్లూ, వైరల్‌ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా పరీక్షలు నిర్వహించి డెంగీ ఇతర సీజనల్‌ వ్యాధులను నిర్ధారించుకోవాల్సి ఉంది. ముందుగా కరోనా ఉందా లేదా అన్నది తెలుసుకోవాలి. డెంగీ లక్షణాలు ఉండి, ఆర్టీపీసీఆర్‌లో కరోనా నెగెటివ్‌ వచ్చినా ఐదురోజుల తర్వాత దగ్గు, జ్వరం, గొంతునొప్పి వంటి లక్షణాలుంటే సీటీ స్కాన్‌తో నిర్ధారించాల్సి వస్తోంది.

డెంగీకి ర్యాపిడ్‌టెస్ట్‌ మాదిరి ఎన్సెస్‌ వన్‌ యాంటీజెన్, డెంగీ సీరోలజీ టెస్ట్‌లు చేసి నిర్ధారిస్తున్నాము. ప్రస్తుతం డెంగీ సీజన్‌ కావడంతో ఈ కేసులు పెద్ద సంఖ్యలోనే వస్తున్నాయి. ఆస్తమా, దీర్ఘకాలిక బ్రాంకైటిస్, గొంతునొప్పి, ఇతర వైరల్‌ లక్షణాలున్న సీజనల్‌ వ్యాధుల కేసులు కూడా ఎక్కువగానే నమోదవుతున్నాయి. మళ్లీ టీబీ కేసులు పెరుగుతున్నాయి. అందువల్ల వీటన్నింటి పట్ల అప్రమత్తంగా ఉండాలి.


డా.వి.వి.రమణప్రసాద్, పల్మనాలజిస్ట్, స్లీప్‌ డిజార్డర్స్‌ స్పెషలిస్ట్, కిమ్స్‌ ఆస్పత్రి

ప్రతీరోజు వైరల్‌ జ్వరాలు, టైఫాయిడ్, మలేరియా, డెంగీకి సంబంధించి కేసులు నమోదవుతున్నాయి. వాటిలో కొన్ని కోవిడ్‌ కేసులుంటున్నాయి. గతానికి భిన్నంగా మలేరియా, టైఫాయిడ్, డెంగీ, కోవిడ్, ఊపిరితిత్తుల సమస్యలు, అన్నీ చలిజ్వరంతో వస్తున్నాయి. ఒళ్లు, కంటి నొప్పులు, ఎముకలు చిట్లేంత నొప్పులు, కీళ్లు, కండరాలు, కంటి వెనక నొప్పులు ఇలా రకరకాల నొప్పులతో జ్వరాలు వస్తుండటంతో వైద్యపరీక్షలతో నిర్ధారించుకోవాల్సి వస్తోంది. ఈ జ్వరాలతో రోగులకు విపరీతమైన బలహీనత, తట్టుకోలేని నొప్పులతోపాటు కడుపు ఉబ్బరం, అసౌకర్యంగా ఉండటం వంటి లక్షణాలు కన్పిస్తున్నాయి.

వర్షాకాలంలో నీటిలో కాలుష్యం పెరగడం, దోమలు, ఈగలు పెరిగిపోవడం, ప్రధానంగా ఆహారం, మంచినీరు వంటివి కలుషితం కావడంతో జ్వరాల కేసులు పెరుగుతున్నాయి. డెంగీలో ప్లేట్‌లెట్ల సంఖ్య తగ్గడంతోపాటు పొట్టలో రక్తస్రావం అయ్యి, కాళ్ల రక్తనాళాల రంగుమార్పు, నల్లటిరంగులో మలవిసర్జన వంటివి జరుగుతాయి. వీటిని బట్టి ఎక్కడో రక్తస్రావం అవుతుందని గ్రహించాలి. అవసరమైన డెంగీ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి. ప్లేట్‌లెట్ల సంఖ్యను జాగ్రత్తగా గమనిస్తూ, చికిత్స తీసుకోవాలి. ప్రభుత్వాలు కూడా ప్రతీ జిల్లాలో ప్లేట్‌లెట్ల యూనిట్లను ప్రజలకు అందుబాటులో ఉంచేలా చూడాలి.


– డా. ప్రభుకుమార్‌ చల్లగాలి, కన్సల్టెంట్‌ ఫిజిషియన్, వృందాశ్రీ జూబ్లీ క్లినిక్‌

సరైన సమయంలో చికిత్సతోనే...
ఒకరోజు అకస్మాత్తుగా గొంతునొప్పితో కూడిన చలిజ్వరం వచ్చింది. మూడు రోజుల తర్వాత మా కుటుంబవైద్యుడి దగ్గరకు వెళ్లాను. వైరల్‌ జ్వరం అనే అనుమానంతో అన్ని వైద్యపరీక్షలు చేయించారు. డెంగీ జ్వరం నిర్ధారణ అయింది. ఇంట్లోనే ఉంటూ తగిన చికిత్స తీసుకున్నాను. రెండు మూడు రోజుల్లో పూర్తిగా తగ్గిపోయింది. ఐతే ఇంట్లో నలుగురు కుటుంబసభ్యులకు కూడా ఇవే లక్షణాలతో జ్వరం వచ్చింది. వారుకూడా ఫోన్‌లోనే వైద్యుడిని సంప్రదించి మందులు వాడారు. ఇప్పుడు అందరూ కోలుకున్నారు. 
–అప్పరాజు అనిల్‌ కృష్ణ, మణికొండ  

మరిన్ని వార్తలు