Hyderabad: రెచ్చిపోతున్న బెగ్గర్‌ మాఫియా.. పిల్లలు నిద్రలోనే ఉండేందుకు నల్లమందు? ఉక్కుపాదానికి ప్లాన్‌?

6 Dec, 2022 19:18 IST|Sakshi

సాక్షి, సిటీబ్యూరో: విశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌లో చిన్నారుల యాచనపై ఉక్కుపాదం మోపేందుకు అధికార యంత్రాంగం చర్యలకు ఉపక్రమించింది. స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలతో కూడిన సంచార వాహనాన్ని రంగంలోకి దింపనుంది. ప్రధాన కూడళ్లలో భిక్షాటన చేసే చిన్నారులను గుర్తించి పునరావాస కేంద్రాలకు తరలించాలని నిర్ణయించింది. త్వరలో సంచార వాహనాన్ని లాంఛనంగా ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇప్పటికే ఏడాదికి రెండు పర్యాయాలు ఆపరేషన్‌ స్మైల్, ఆపరేషన్‌ ముస్కాన్‌ పేరిట స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్న అధికార యంత్రాంగం తాజాగా నిరంతర ప్రక్రియగా సంచార వాహనంతో ప్రత్యేక  కార్యాచరణకు దిగుతోంది. గత కొనేళ్లుగా హైదరాబాద్‌ను ‘బెగ్గర్‌ ఫ్రీ’గా మార్చేందుకు చేస్తున్న ప్రయత్నాలు మూణ్నాళ్ల ముచ్చటగా తయారయ్యాయి.

అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌ కుమార్తె ఇవాంకా భాగ్యనగరాన్ని సందర్శించినప్పుడు చేపట్టిన చర్యలతో కొన్నాళ్లపాటు  వీరి బెడద తగ్గినా.. మళ్లీ యాచకులకు.. ‘ఫ్రీ’ నగరంగా తయారైంది. దీంతో నగంరలోని ప్రధాన కూడళ్లలో చిన్నారులతో, పసి పిల్లలను చంకన పెట్టుకొని యాచకులు వాహనదారులను అవస్థలకు గురి చేయడం సర్వసాధారణంగా మారింది. 

విజృంభిస్తోన్న బెగ్గర్‌ మాఫియా 
నగరంలో బెగ్గింగ్‌ మాఫియా విజృంభిస్తోంది. అవసరాల్లో ఉన్నవారి, ఆపదల్లో ఉన్నవారి కుటుంబాల చిన్నారులను పట్టుకొచ్చి యాచన చేయిస్తోంది. కుటుంబాలకు కొంత సొమ్ము అప్పుగా ఇచ్చి.. తీర్చేందుకు వారి పిల్లలతో  భిక్షాటన చేయిస్తోంది. రోజూ ఇంత ‘వసూలు’ చేయాలంటూ టార్గెట్లు పెడుతూ వచ్చిన దాంట్లో ఎంతోకొంత చేతిలో పెట్టడం, టార్గెట్‌ మేరకు డబ్బులు తేకపోతే హింసించడం షరామామూలుగా మారింది.  

నరక ‘యాచన’ 
అభం శుభం తెలియని పసి పిల్లలను బెగ్గింగ్‌ మాఫియా నరక యాతనకు గురి చేస్తోంది. పసి పిల్లలు ఉంటే ఎక్కువగా భిక్షమేస్తారన్న ఉద్దేశంతో రెండేళ్లలోపు చిన్నారులను వినియోగిస్తోంది. ముఖ్యంగా నగరానికి వలస వచ్చే నిరుపేద కుటుంబాలకు వల వేసి వారి పిల్లలను భిక్షాటన కోసం వినియోగించడం నిత్యకృత్యమైంది. రోజుకు రూ.200 నుంచి రూ.300 వందలకు వరకు అందిస్తున్నట్లు తెలుస్తోంది. మహిళా యాచకులకు  చిన్నారులను ఉదయం ఏడు గంటలకు అందించి సాయంత్రం తీసుకెళ్లడం చేస్తున్నట్లు సమాచారం.  కొందరు  పసి పాపకు ఆకలి లేకుండా  నిద్రలోనే ఉండేలా రెండు, మూడు గంటలకోసారి ప్రమాదకరమైన నల్ల మందు ఇస్తున్నట్లు తెలుస్తోంది. 

ఐదు వందల మందికిపైగా 
నగరంలో సుమారు ఐదువందలకు పైగా చిన్నారులు భిక్షాటన చేస్తున్నట్లు తెలుస్తోంది. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, థియేటర్లు, దేవాలయాలు, ఫంక్షన్లు, పెళ్లిళ్లు వంటి శుభకార్యాలు జరిగే ప్రాంతాల్లో చిన్నారులు అధికంగా కనిపిస్తారు. గత ఐదేళ్లలో ఆపరేషన్‌ ముస్కాన్,ఆపరేషన్‌ స్మైల్‌ కింద సుమారు రెండు వేలకు పైగా చిన్నారులను గుర్తించి పునరావాస కేంద్రాలకు తరలించినట్లు అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.  

మరిన్ని వార్తలు