దేశంలోనే ఐటీలో మేటి హైదరాబాద్‌

21 Jul, 2023 01:24 IST|Sakshi

తమిళనాడు ఐటీ మంత్రి పలనివేల్‌ బృందంతో భేటీలో మంత్రి కేటీఆర్‌

తెలంగాణ ఐటీ విధానాలపై అధ్యయనానికి హైదరాబాద్‌ వచ్చిన బృందం

సాక్షి, హైదరాబాద్‌: దేశంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఐటీ నగరంగా హైదరాబాద్‌ ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారక రామారావు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక నెలకొన్న సందేహాలను పటాపంచలు చేస్తూ హైదరాబాద్‌ను ప్రపంచ ఐటీ పటంలో నిలబెట్టినట్లు చెప్పారు. ఐటీ రంగంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, ఐటీ పాలసీలపై 3 రోజులపాటు అధ్యయనం చేసేందుకు గురువారం హైదరాబాద్‌ విచ్చేసిన తమిళనాడు ఐటీ శాఖ మంత్రి పలనివేల్‌ త్యాగరాజన్‌ (పీటీఆర్‌) ఆధ్వర్యంలోని ప్రతినిధి బృందం మంత్రి కేటీఆర్‌తో సచివాలయంలో సమావేశమైంది.

ఐటీ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమాలు, ఐటీ పాలసీ, అనుబంధ పాలసీలు, పరిశ్రమ బలోపేతం కోసం తీసుకున్న నిర్ణయాలను ఈ సందర్భంగా కేటీఆర్‌ తమిళనాడు ప్రతినిధి బృందానికి పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ రూపంలో వివరించారు. ఐటీ శాఖ ద్వారా రాష్ట్రంలోని యువతకు అత్యధిక ఉపాధి అవకాశాలు కల్పించాలన్న లక్ష్యానికి అనుగుణంగా పనిచేస్తూనే మరోవైపు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని పౌరులకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేసినట్లు కేటీఆర్‌ తెలిపారు.

ఈ మేరకు ఆన్‌లైన్‌ , మొబైల్, డిజిటల్‌ తదితర సేవల్లో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉందన్నారు. హైదరాబాద్‌తోపాటు ద్వితీయశ్రేణి నగరాలకు కూడా ఐటీ పరిశ్రమను విస్తరించాలన్న లక్ష్యంతో కరీంనగర్, వరంగల్, మహబూబ్‌నగర్, ఖమ్మం, నిజామాబాద్, సిద్దిపేట లాంటి పట్టణాలలో ఐటీ టవర్లను ఏర్పాటు చేశామని, ఈ టవర్లలో టాస్క్, టీ–హబ్, వీ–హబ్‌ వంటి ఉప కార్యాలయాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.  

తమిళనాడు ఐటీ శాఖ ప్రశంసలు
తెలంగాణలో ఐటీ పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం చేసిన కృషిపట్ల తమిళనాడు మంత్రి పీటీఆర్‌ బృందం హర్షం వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, పాలసీలపట్ల ప్రశంసలు కురిపించింది. తమిళనాడు ఐటీ మంత్రిగా నూతన బాధ్యతలు చేపట్టిన తనకు ఈ పర్యటన ఉపయుక్తంగా ఉంటుందన్న నమ్మకాన్ని పీటీఆర్‌ వ్యక్తం చేశారు. ఇక్కడి ఆదర్శవంతమైన విధానాలను తమిళనాడులో అమలు చేసేందుకు ప్రయత్నిస్తామన్నారు. 

మరిన్ని వార్తలు