సమాజం విస్మరించిన అసలైన కోవిడ్‌ వారియర్స్‌ వాళ్లే: సజ్జనార్‌

27 Oct, 2022 15:02 IST|Sakshi

శ్మశాన కార్మికుల చేయూత కోసం ‘బెస్ట్‌ సిగ్నేచర్‌’ కాంటెస్ట్‌.. 

సంతకం చేసి ప్రారంభించిన వీసీ సజ్జనార్‌.. 

సాక్షి, హైదరాబాద్‌: శ్మశానాల్లో అంత్యక్రియలు నిర్వర్తించే కార్మికులే సమాజం విస్మరించిన అసలైన కోవిడ్‌ యోధులని టీఎస్‌ఆర్‌టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ అన్నారు. కోవిడ్‌ సమయంలో మరణించిన వారికి కుటుంబ సభ్యులే అంతిమ సంస్కారాలను చేయలేకపోయారని, అలాంటి సమయంలో శ్మశాన వాటిక కార్మికులు చేసిన వృత్తి ధర్మం మాటల్లో వర్ణించలేనిదని ఆయన కొనియాడారు. జేసీఐ బుద్ధ పూర్ణిమ సంస్థ ఆధ్వర్యంలో శ్మశాన కార్మికులకు చేయూతనందించేందుకు బుధవారం మాదాపూర్‌లోని ఈ–గెలేరియా మాల్‌ వేదికగా ‘బెస్ట్‌ సిగ్నేచర్‌’ అనే ఫండ్‌ రైసింగ్‌ కాంటెస్ట్‌ ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వీసీ సజ్జనార్‌ తన సిగ్నేచర్‌తో కాంటెస్ట్‌లో పాల్గొని ఫండ్‌రైసింగ్‌ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విపత్కర పరిస్థితుల్లో గౌరవప్రదంగా అంతిమ క్రియలను నిర్వర్తించిన నిజమైన హీరోల సంక్షేమానికి తోడ్పాటు అందించాలనే లక్ష్యంతో ఈ కాంటెస్ట్‌ ప్రారంభించడం అభినందనీయమన్నారు. ఇలాంటి కార్యక్రమాల వల్ల కోవిడ్‌ వారియర్స్‌కు కృతజ్ఞతలు తెలిపే అవకాశం లభిస్తుందని పేర్కొన్నారు. నగరంలోని దాదాపు ఐదు వందల శ్మశానాల్లో నాలుగు వేల మంది కార్మికులు తమ ప్రాణాలను ఫణంగా పెట్టి సేవలందించారని జేసీఐ బుద్ధ పూర్ణిమ సంస్థ అధ్యక్షులు ధన్నారపు రాకేష్‌ తెలిపారు. ఈ కాంటెస్ట్‌లో భాగంగా వచ్చిన డబ్బులతో కార్మికుల పిల్లల పాఠశాల విద్య, ఆరోగ్య బీమా, వారి వృత్తిపరమైన భద్రత, అభివృద్ధి కోసం ఖర్చు చేస్తామని తెలిపారు. 


ఈ కాంటెస్ట్‌లో భాగంగా పాల్గొనే వారు కనీసం రూ.500 కన్నా ఎక్కువ చెల్లించి తమ సంతకాన్ని నమోదు చేసుకోవాలన్నారు. ఈ కాంటెస్ట్‌లో ఆకట్టుకునే సంతకం ఉన్న మొదటి విజేతకు రూ.25 వేలు, ఆ తరువాతి స్థానాల్లో రూ.15 వేలు, రూ. 10 వేల బహుమతులతో పాటు రూ. వెయ్యితో ఐదు కన్సోలేషన్‌ బహుమతులు అందిస్తున్నట్లు తెలిపారు. ఔత్సాహికులు jcibph.in లేదా 903120 01980, 9951143775లో సంప్రదించవచ్చన్నారు. కార్యక్రమంలో మెట్రో రైల్‌ అడ్వర్టైజ్‌ లీజింగ్‌ హెడ్‌ కెవి నాగేంద్ర ప్రసాద్, ఎల్‌ అండ్‌ టీ మెట్రో రైల్‌ కార్పొరేట్‌ కమ్యూనికేషన్స్‌ హెడ్‌ ఆనందిత సిన్హా, గిరీష్‌ భట్, మనోహర్‌ భట్, సీఎస్‌ చలం, అనిల్‌ కుమార్‌ సిద్దూ, పీ వీరభద్రుడు, కేసీజీఎఫ్‌ బుధపూర్ణిమ అధ్యక్షుడు అనిల్‌ దండూ, రమేష్‌ దాడిగల, రఘురాజ్‌ తదితరులు పాల్గొన్నారు. (క్లిక్: బస్సులన్నీ మునుగోడు వైపు.. శివారు వాసుల అవస్థలు)

>
మరిన్ని వార్తలు