బీఆర్‌ఎస్‌ను దించే ప్లాన్‌ ఏంటి?

26 May, 2023 05:22 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బీజేపీలోకి ఇతర పార్టీల నేతలను చేర్పించే కసరత్తును ఆ పార్టీ చేరికల కమిటీ కన్వీనర్, జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటల రాజేందర్‌ వేగవంతం చేశారు. పార్టీ జాతీయ నాయకత్వం ఆదేశాల మేరకు నేతలతో మంతనాలు సాగిస్తున్నారు. ఈ క్రమంలో గురువారం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావులతో ఈటల భేటీ అయ్యారు. ఉదయమే జూబ్లీహిల్స్‌ ప్రాంతంలో తమ సొంత వాహనాలను విడిచిపెట్టి.. గన్‌మన్లు, వ్యక్తిగత సహాయకులు కూడా లేకుండానే వారితో నాలుగైదు గంటల పాటు చర్చించినట్టు తెలిసింది.

ఐదారు నెలల్లోనే అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో వెంటనే బీజేపీలో చేరికపై నిర్ణయం తీసుకోవాలని, చేరికపై జాతీయ నాయకత్వం నుంచి సానుకూలత వ్యక్తమైందని వారికి ఈటల చెప్పినట్టు తెలిసింది. ఇటీవల ఢిల్లీలో బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో భేటీ సందర్భంగా కూడా ఈ అంశం చర్చకు వచి్చందని తెలిపినట్టు సమాచారం. జాతీయ నాయకత్వం తరఫున పొంగులేటి, జూపల్లిలకు ఈటల హామీ ఇచ్చారని, పారీ్టలోకి వస్తే కలిగే ప్రయోజనాలను వివరించారని తెలిసింది. 

మీ దగ్గర ఉన్న ప్రణాళిక ఏమిటి? 
భేటీ సందర్భంగా బీఆర్‌ఎస్‌ను ఓడించేందుకు బీజేపీ వద్ద ఉన్న ప్రణాళిక ఏమిటని, ఇందుకోసం ఎలాంటి కార్యాచరణ ప్రణాళికను అమలు చేయబోతున్నారని ఈటలను పొంగులేటి, జూపల్లి ప్రశ్నించినట్టు తెలిసింది. బీఆర్‌ఎస్‌ను ఎదుర్కొనేందుకు జాతీయ, రాష్ట్ర నాయకత్వాల వద్ద స్పష్టమైన ప్రణాళికలు ఉన్నాయని, ఏ రకమైన వ్యూహాలను అనుసరిస్తారన్నది ఈటల వివరించినట్టు సమాచారం.

వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఓటమే తమ ప్రధాన లక్ష్యమని, దాన్ని సాధించగలిగే పార్టీ, నాయకత్వం వెంటే వెళ్లేందుకు తాము సిద్ధమని వారు ఈటలకు చెప్పినట్టు తెలిసింది. ఈ దిశగా బీజేపీ ఏమేరకు సంసిద్ధమై ఉంది? బీఆర్‌ఎస్‌ను గద్దె దించేందుకు ఎలాంటి కార్యాచరణ అమలు చేయబోతున్నదనే దానిపై మరింత స్పష్టత కావాలని వారు కోరినట్టు సమాచారం. ఈటల సమాధానాలతో సంతృప్తి చెందని పొంగులేటి, జూపల్లి.. బీజేపీలో చేరికపై నిర్ణయం తీసుకునేందుకు మరికొంత సమయం కావాలని కోరినట్టు తెలిసింది. శుక్రవారం కూడా వారితోపాటు మరికొందరితో ఈటల సమావేశమయ్యే అవకాశాలు ఉన్నాయని బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. 

ప్రత్యామ్నాయాలపై చర్చ? 
వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను ఓడించేందుకు అన్ని రాజకీయ ప్రత్యామ్నాయాలను పరిశీలించాలని ఈటలకు పొంగులేటి, జూపల్లి సూచించినట్టు సమాచారం. అంతా బలమైన పార్టీలోకి వెళ్లడం లేదా వివిధ పారీ్టల్లోంచి ముఖ్య నేతలంతా కలిసి ఓ ప్రాంతీయ పార్టీని స్థాపించి.. ఇతర భావ సారూప్యశక్తులతో పొత్తు కుదుర్చుకుంటే ఎలా ఉంటుందనే అంశాలపైనా వారి మధ్య చర్చ జరిగినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ఇద్దరు నేతలూ బీజేపీలో చేరే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. 

మరిన్ని వార్తలు