Hyderabad Bonalu: నగరమంతటా సందడిగా బోనాల జాతర

2 Aug, 2021 07:50 IST|Sakshi

అలరించిన పోతురాజుల విన్యాసాలు

ఆకట్టుకున్న తొట్టెల ప్రదర్శనలు

లాల్‌దర్వాజ, పాతబస్తీలో ఘనంగా ఉత్సవాలు

అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రులు

సాక్షి, హైదరాబాద్‌/చాంద్రాయణగుట్ట /చార్మినార్‌ : మహానగరం బోనమెత్తింది.  ఆదివారం బోనాల జాతర ఉత్సాహంగా సాగింది. పాతబస్తీ లాల్‌దర్వాజ సింహవాహిని, చార్మినార్‌ భాగ్యలక్ష్మి, మీరాలం మహంకాళి, హరిబౌలి బంగారు మైసమ్మ, శాలిబండ అక్కన్న మాదన్న ఆలయం, ఉప్పుగూడ మహంకాళి, కార్వాన్‌ దర్బార్‌ మైసమ్మ, ట్యాంక్‌బండ్‌ కట్ట మైసమ్మ సహా నగరంలోని పలు ప్రాంతాల్లో కన్నులపండువగా వేడుకలు జరిగాయి. పోతురాజుల విన్యాసాలు, తొట్టెల ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. లాల్‌దర్వాజ సింహవాహిని అమ్మవారికి మంత్రులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్, ఇంద్రకరణ్‌రెడ్డి, మహ్మద్‌ మహమూద్‌ అలీలు పట్టువస్త్రాలు సమర్పించారు.

అమ్మవారిని దర్శించుకున్న ప్రముఖులు..  
లాల్‌దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారిని మాజీ మంత్రి టి.దేవేందర్‌ గౌడ్, హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ, సినీ నటి, మాజీ ఎంపీ విజయశాంతి, వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి, ఎమ్మెల్యే దానం నాగేందర్, మాజీ మంత్రి డి.కె.అరుణ, మాజీ ఎంపీ అంజన్‌ కుమార్‌ యాదవ్‌ తదితరులు దర్శించుకున్నారు.

వెల్లివిరిసిన ఆధ్యాత్మికత.. 
సాధారణంగా గోల్కొండ, సికింద్రాబాద్‌ మహంకాళి బోనాల తర్వాత పాతబస్తీలో ఆషాఢ మాసం బోనాల పండగ జరుగుతుంది. నగర శివార్లలో మాత్రం శ్రావణ మాసంలోనే వేడుకలు నిర్వహిస్తారు. కానీ ఈసారి చాలాచోట్ల ఒకేసారి వేడుకలు జరగడంతో నగరమంతా ఆధ్యాత్మికత వెల్లివిరిసింది. అమ్మవారిని కీర్తిస్తూ సాగిన భక్తి గీతాలతో మైకులు హోరెత్తాయి. అందంగా అలంకరించిన ఆలయాల వద్ద గుగ్గిలం పరిమళాలు గుబాళించాయి. గతేడాది కోవిడ్‌ కారణంగా బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకోలేకపోయిన నగరవాసులు ఈసారి అన్ని చోట్లా పెద్ద సంఖ్యలో తరలి వచ్చి అమ్మవార్లకు బోనాలు సమర్పించారు. కరోనా మహమ్మారి నుంచి కాపాడాలని, అందరినీ చల్లగా చూడాలని వేడుకున్నారు.

మరిన్ని వార్తలు