Hyd Book Fair: పుస్తకాల పండుగకు అక్షరాల తోరణం..

19 Dec, 2021 20:17 IST|Sakshi

కొలువుదీరిన హైదరాబాద్‌ బుక్‌ఫెయిర్‌

ఈ నెల 28వ తేదీ వరకు ప్రదర్శన

జాతీయ, అంతర్జాతీయ ప్రచురణ సంస్థలతో 260 స్టాళ్లు..

2.5 లక్షల పుస్తకాలు

సాక్షి, సిటీబ్యూరో: పుస్తకాల పండుగ మళ్లీ వచ్చేసింది. ఏటేటా చదువరుల మనసు దోచుకుంటూ కొలువుదీరే  34వ  జాతీయ పుస్తకమహోత్సవం శనివారం ఎన్టీఆర్‌ స్టేడియంలో ప్రారంభమైంది. సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ముఖ్యఅతిథిగా  హాజరయ్యారు. తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మెన్‌ జూలూరు గౌరీశంకర్, సాంస్కృతిక శాఖ డైరెక్టర్‌ మామిడి  హరికృష్ణ, హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌ కమిటీ కార్యదర్శి కోయ చంద్రమోహన్, తదితరులు  ప్రారంభోత్సవ వేడుకలో  పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు  ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

వైవిధ్యభరితంగా..
విభిన్న సంస్కృతులు, బహుభాషలకు నిలయమైన భాగ్యనగరంలో పుస్తకం మరోసారి వేడుక చేసుకుంటోంది. వైవిధ్యభరితమైన అంశాలపైన రూపొందించిన పుస్తకాలతో పాఠక మహాశయులకు చేరువైంది. జాతీయ, అంతర్జాతీయ ప్రచురణ సంస్థలతో 260 స్టాళ్లను ఏర్పాటు చేశారు. రచయితలు స్వయంగా తమ  పుస్తకాలను విక్రయించేందుకు హైదరాబాద్‌ బుక్‌ ఎగ్జిబిషన్‌ సొసైటీ ప్రత్యేకంగా ఒక స్టాల్‌ను ఏర్పాటు చేసింది.

విభిన్న జీవన పార్శ్వాలను సమున్నతంగా ఆవిష్కరించే వివిధ భాషల పుస్తకాలు ప్రదర్శనలో పుస్తకప్రియులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.    సామాజిక మాద్యమాలు, ఇంటర్నెట్‌లు, స్మార్ట్‌ఫోన్‌లు రాజ్యమేలుతున్న ప్రస్తుత తరుణంలోనూ పుస్తకానికి ఏ మాత్రం ఆదరణ తగ్గలేదనేందుకు నిదర్శనంగా మొదటి రోజే సందర్శకులతో ఎన్టీఆర్‌ స్టేడియంలో సందడి నెలకొంది. బాలల సాహిత్యం, ఆధ్యాత్మికం, వ్యక్తిత్వ వికాసం, వైద్యం, ఆరోగ్యం వంటి అన్ని రంగాలకు చెందిన పుస్తకాలతో పాటు, చరిత్ర, సాహిత్యం, ప్రముఖుల జీవిత చరిత్ర గ్రంధాలు అందుబాటులో ఉన్నాయి.

మరోసారి ‘చందమామ కథలు’ 
అనేక దశాబ్దాల పాటు తెలుగు పాఠకలోకాన్ని  కట్టిపడేసిన చందమామ కథలు సంపుటాలుగా వెలువడ్డాయి. బాలల మనసు దోచుకొనే అద్భుతమైన కథలతో రూపొందించిన ఈ పుస్తకాలు మొత్తం 15 సంపుటాలుగా ముద్రించారు. 1950  నుంచి  2012  వరకు  వచ్చిన  కథలనన్నింటినీ ఈ సంపుటాల్లో నిక్షిప్తం చేశారు. విశాలాంధ్ర, నవతెలంగాణ, నవోదయ తదితర స్టాళ్లలో ఇవి అందుబాటులో ఉన్నాయి. విశాలాంధ్రకు చెందిన 10 నుంచి  13వ స్టాల్‌ వరకు ఈ సంపుటాలు  అందుబాటులో ఉన్నాయి.

చలం సమగ్ర సాహిత్యం.. 
చలం రాసిన  పుస్తకాలన్నింటినీ 22 సంపుటాలుగా ముద్రించారు. ప్రియదర్శిని ప్రచురణ సంస్థకు చెందిన స్టాల్‌ నెంబర్‌ 112 లో ఈ సంపుటాలు అందుబాటులో ఉన్నాయి. మైదానం, దైవమిచి్చన భార్య, అమీనా, చలం మ్యూజింగ్స్, స్త్రీ వంటి అనేక గ్రంధాలతో ఆ నాటి నుంచి నేటి వరకు పాఠకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న చలం సాహిత్యం అంతా ఒక్క చోట లభించడం విశేషం.

చిందు ఎల్లమ్మ వేదిక.. 
పుస్తక ప్రదర్శన వద్ద ఏర్పాటు చేసిన  సాహిత్య వేదికకు ఈసారి యక్షగాన కళాకారిణి చిందు ఎల్లమ్మ  వేదికగా నామకరణం చేశారు. అలాగే  మొత్తం  ప్రాంగణానికి మిమిక్రీ కళాకారుడు నేరెళ్ల వేణు మాధవ్‌ పేరు పెట్టారు.

ప్రతి రోజు సాయంత్రం 5 గంటల నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. తెలంగాణ కళారూపాలు, నృత్యప్రదర్శనలు నిర్వహిస్తారు. u  యంగ్‌ రైటర్స్‌ను ప్రోత్సహించేందుకు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తారు. కోవిడ్‌ కారణంగా  పుస్తకాలను ఆవిష్కరించలేకపోయిన వారికి సముచిత ప్రోత్సాహం ఉంటుంది. 
పుస్తకం పఠనం పట్ల అభిరుచిని పెంచేందుకు సదస్సులు, చర్చలు ఉంటాయి.  
ఈ నెల 22వ తేదీన పర్యావరణంపైన  ప్రత్యేక సాహిత్య సదస్సును ఏర్పాటు చేయనున్నారు.

ఇదీ చారిత్రక నేపథ్యం...
హైదరాబాద్‌ లో 1980వ దశాబ్దంలో పుస్తక ప్రదర్శన మొదలైంది. కానీ   పుస్తకాలను ఒక దగ్గరకు చేర్చి ప్రదర్శించాలనే ఆలోచన కూడా లేని రోజుల్లో     అంటే  1948 నుంచి  వట్టికోట ఆళ్వారుస్వామి తన   ‘దేశోద్ధారక గ్రంథమాల’ సంస్థ  ప్రచురించిన పుస్తకాలను పాఠకుల వద్దకు  తీసుకెళ్లాడు. 1961వరకు ఆయన ఈ సంప్రదాయాన్ని కొనసాగించాడు. హైదరాబాద్‌ నగరంలో నిజాంల కాలం నుంచే పుస్తకాలకు ఆదరణ ఉంది. అధికార భాష ఉర్దూతో పాటు తెలుగు, మరాఠా, కన్నడ భాషలకు చెందిన పుస్తకాలు  వచ్చాయి. కోఠీలోని బడీచౌడీ ఒక పుస్తక బజార్‌గా వెలుగొందింది. ఈ బడిచౌడీ బుక్‌ సెల్లర్సే హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌కు శ్రీకారం చుట్టారు. విశాలాంధ్ర, ప్రజాశక్తి, మిళింద ప్రకాశన్, ఎమెస్కో, నవోదయ వంటి సంస్థలు అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రదర్శనలో తమ భాగస్వామ్యాన్ని కొనసాగిస్తున్నాయి.

ప్రదర్శన ఆరంభం ఇలా..
దేశవ్యాప్తంగా  పుస్తక పఠనాన్ని పెంచే  లక్ష్యంతో  ఆవిర్భవించిన నేషనల్‌ బుక్‌ ట్రస్టు ఆధ్వర్యంలో  1986లో ‘హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌’ కేశవ మొమోరియల్‌ స్కూల్‌లో ప్రారంభించారు.  
ఆ తరువాత నిజాం కళాశాల మైదానం, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, చిక్కడపల్లి నగర కేంద్ర గ్రంథాలయం, నెక్లెస్‌రోడ్డు తదితర ప్రాంతాల్లో పుస్తక ప్రదర్శనలు జరిగాయి. 
ఆ నాటి నుంచి నేటి వరకు కథలు, నవలలు, గల్ఫికలు, చరిత్ర గ్రంథాలదే అగ్రస్థానం. శ్రీశ్రీ, చలం, బుచ్చిబాబు, కొడవటిగంటి కుటుంబరావు, త్రిపురనేని  గోపీచంద్, వట్టికోట, విశ్వనాథ సత్యనారాయణ, షేక్‌స్పియర్, సోమర్‌సెట్‌ మామ్, యద్దనపూడి, మాదిరెడ్డి, కొమ్మూరి వేణుగోపాల్‌రావు వంటి ప్రముఖుల రచనలు ఇప్పటికీ హాట్‌కేకుల్లా అమ్ముడవుతూనే ఉన్నాయి.  
‘మహాత్మాగాంధీ ఆత్మకథ’ వంటి గ్రంథాలు అప్పటి నుంచి ఇప్పటి వరకు లక్షలాది మంది పాఠకులను ప్రభావి తం చేస్తూనే ఉన్నాయి. శ్రీశ్రీ ‘మహాప్రస్థానం’ ఖడ్గసృష్టి వంటి గ్రంథాలకు  ఇప్పుడూ అదే ఆదరణ ఉంది.

ప్రదర్శన చాలా అద్భుతంగా ఉంది  
హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌ చాలా అద్భుతంగా ఉంది. చాలా పుస్తకాలు కొనుక్కోవాలని ఉంది. కానీ న్యూజిలాండ్‌కు తీసుకెళ్లడం కష్టంకదా. చందమామ కథల సంపుటాలు తీసుకున్నాం. ఇప్పటి పిల్లలకు ఆ పుస్తకాలు చాలా అవసరం. 
– శ్రీలత మగతల, అధ్యక్షురాలు న్యూజిలాండ్‌ తెలుగు అసోసియేషన్‌

పాఠకులకు నచ్చిన పుస్తకాలున్నాయి  
ఈసారి 260కి పైగా స్టాళ్లు ఏర్పాటు చేశాం. సుమారు 2.5 లక్షల పుస్తకాలు అన్ని ప్రముఖ భాషలలో ఉన్నాయి. పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే వారికి  కావలసిన అద్భుతమైన మెటీరియల్‌ ఉంది. అలాగే ఎవరి అభిరుచికి తగిన పుస్తకాలను వారు కొనుక్కోవచ్చు. కవులు, రచయితల కోసం ఒక ప్రత్యేక స్టాల్‌ను కూడా ఏర్పాటు చేశాం. వారు అక్కడ స్వయంగా తమ పుస్తకాలను విక్రయించవచ్చు.
– కోయ చంద్రమోహన్, బుక్‌ ఫెయిర్‌ కమిటీ కార్యదర్శి 

తెలుగు నవలల కోసం వచ్చాను  
తెలుగు నవలలపైన ఆసక్తితో వచ్చాను. తెలుగు భాషపైన పట్టు రావాలంటే సాహిత్యం చదవాలి కదా. ఈసారి చాలా మంచి పుస్తకాలు వచ్చాయి. బుక్‌ఫెయిర్‌ వారికి కృతజ్ఞతలు.
– లహరి, దిల్‌సుఖ్‌నగర్‌  

బైక్‌రైడింగ్‌..బుక్‌ రీడింగ్‌  
బైక్‌ రైడింగ్‌ నా హాబీ. బైక్‌ పై చాలా దూరం వెళ్లి ప్రశాంతమైన వాతావరణంలో రోజంతా ఒక పుస్తకం చదువుకొని వస్తాను. చాలా  హాయిగా ఉంటుంది. అందుకే నచ్చిన పుస్తకాలు కొనుగోలు చేద్దామని వచ్చాను.
– విశ్వేశ్వర్, ఓల్డ్‌సిటీ   

మరిన్ని వార్తలు