షార్ట్‌ సర్క్యూట్‌తో ట్రావెల్స్‌ బస్సు దగ్ధం 

19 Oct, 2021 03:47 IST|Sakshi

డ్రైవర్‌ అప్రమత్తతతో తప్పిన ముప్పు.. ప్రయాణికులు సురక్షితం 

లింగాలఘణపురం: వరంగల్‌ – హైదరాబాద్‌ జాతీయ రహదారిపై ఓ ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సులో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. సోమవారం తెల్లవారుజామున 5.30 గంటలకు జనగామ జిల్లా లింగాలఘణపురం మండలం నెల్లుట్ల బైపాస్‌ రోడ్డుపై బస్సులో షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఈ ఘటనలో బస్సులోని 26 మంది ప్రయాణికులు డ్రైవర్‌ అఫ్జల్‌ అహ్మద్‌ షేక్‌ అప్రమత్తతతో సురక్షితంగా బయటపడ్డారు.

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని జగ్‌దల్‌పూర్‌ నుంచి ఆదివారం రాత్రి ఏడు గంటలకు హైదరాబాద్‌ బయలుదేరిన ఏసీ కోచ్‌ బస్సు మర్నాడు తెల్లవారు జామున 5.30 గంటలకు నెల్లుట్ల బైపాస్‌ సమీపానికి చేరుకుంది. అదే సమయంలో ఇంజన్‌లోనుంచి పొగతోపాటు వాసన రావడంతో డ్రైవర్‌కు అనుమానం వచ్చి రోడ్డు పక్కన ఆపి దిగి చూశాడు. పొగలు ఎక్కువ కావడంతో నీళ్లు పోసినా ఫలితం లేకపోవడంతో ప్రయాణికులను వెంటనే అప్రమత్తం చేసి కిందికి దింపాడు.

కొద్ది నిమిషాల్లోనే బస్సు మొత్తానికి మంటలు వ్యాపించాయి. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. అప్పటికే బస్సు పూర్తిగా దగ్ధమైంది. కొంతమంది లగేజీ కూడా కాలిపోయింది. ప్రయాణికులు సురక్షితంగా బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. స్టేషన్‌ఘన్‌పూర్‌ ఏసీపీ రఘుచందర్, ఎస్సై దేవేందర్‌ ఆధ్వర్యంలో ప్రయాణికులను మరో బస్సులో హైదరాబాద్‌కు తరలించారు.

మరిన్ని వార్తలు