ఎమ్మెల్సీ ఎన్నికలు: బీఆర్‌ఎస్‌ దూరం

17 Feb, 2023 02:10 IST|Sakshi

హైదరాబాద్‌ స్థానిక సంస్థల కోటాలో మజ్లిస్‌కు మద్దతు 

మెజారిటీ ఉన్నా మిత్రపక్షానికే సీటు ‘టీచర్స్‌’ కోటా ఎన్నికలోనూ నేరుగా పోటీకి దూరం ఎవరికి మద్దతు ఇచ్చేదీ నామినేషన్ల తర్వాత స్పష్టత గతంలో పీఆరీ్టయూ టీఎస్‌కు మద్దతు      ఈసారి సంఘాలు, అభ్యర్థులు మారడంతో ఆసక్తి      స్థానిక, టీచర్స్‌ కోటా సీట్లకు నోటిఫికేషన్‌ విడుదల చేసిన ఈసీ     23 వరకు నామినేషన్ల స్వీకరణ      వచ్చే నెల 13న పోలింగ్‌.. 16న ఓట్ల లెక్కింపు  

సాక్షి, హైదరాబాద్‌:  కొన్నాళ్లుగా రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటూ వచ్చిన భారత్‌ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌).. త్వరలో జరగనున్న రెండు ఎమ్మెల్సీ సీట్ల ఎన్నికలకు మాత్రం దూరంగా ఉండాలని నిర్ణయించింది. ఇందులో ఒకటి హైదరాబాద్‌ స్థానిక సంస్థల కోటాకు చెందినదికాగా.. మరొకటి ‘మహబూబ్‌నగర్‌– రంగారెడ్డి– హైదరాబాద్‌’ ఉపాధ్యాయ (టీచర్స్‌) నియోజకవర్గానికి సంబంధించినది. ఇందులో స్థానిక కోటాలో బీఆర్‌ఎస్‌కు బలం ఎక్కువగా ఉన్నా.. ఈ ఎమ్మెల్సీ సీటును ఎంఐఎంకు ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఇక టీచర్‌ ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి ఎప్పటిలాగే నేరుగా పోటీ చేయకుండా.. కలిసివచ్చే ఉపాధ్యాయ సంఘం అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని భావిస్తున్నట్టు సమాచారం. అయితే ప్రస్తుతం మారుతున్న అభ్యర్థులు, రాజకీయ పరిణామాల నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ ఎవరికి మద్దతు ఇస్తుందనేది చర్చనీయాంశంగా మారింది. 

నామినేషన్ల స్వీకరణ షురూ.. 
ప్రస్తుతం ‘మహబూబ్‌నగర్‌– రంగారెడ్డి– హైదరాబాద్‌’ ఉపాధ్యాయ నియోజకవర్గం ఎమ్మెల్సీగా ఉన్న కాటేపల్లి జనార్దన్‌రెడ్డి పదవీకాలం ఈ ఏడాది మార్చి 29న ముగియనుంది. హైదరాబాద్‌ స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీగా ఉన్న అమీనుల్‌ హసన్‌ జాఫ్రీ (ఎంఐఎం) పదవీకాలం మే 1న పూర్తవుతోంది. త్వరలో ఈ రెండు సీట్లు ఖాళీ అవుతున్న నేపథ్యంలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. వీటికి గురువారం నోటిఫికేషన్‌ విడుదలైంది.

వెంటనే నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కూడా మొదలైంది. ఈ నెల 23 వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. వచ్చే నెల 13న పోలింగ్‌ నిర్వహించి.. 16న ఓట్ల లెక్కింపు జరుపుతారు. రాష్ట్ర శాసనమండలిలో మొత్తం 40 స్థానాలు ఉండగా.. అందులో బీఆర్‌ఎస్‌ వారే 36 మంది కావడం, మిత్రపక్షం ఎంఐఎంకు ఇద్దరు సభ్యులు ఉండటం గమనార్హం. ఇక కాంగ్రెస్‌ నుంచి ఒకరు, మరొకరు ఇండిపెండెంట్‌ ఎమ్మెల్సీ ఉన్నారు. 

బీఆర్‌ఎస్‌కే బలం.. అయినా దూరం.. 
హైదరాబాద్‌ స్థానిక సంస్థల కోటాలో మొత్తం 127 మంది ఓటర్లు ఉండగా.. ఇందులో సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ బోర్డు పరిధిలో 8 మంది సభ్యుల స్థానాలు ఖాళీగా ఉన్నాయి. గుడిమల్కాపూర్‌ బీజేపీ కార్పొరేటర్‌ దేవర కరుణాకర్‌ ఈ ఏడాది జనవరిలో మరణించారు. దీనితో ప్రస్తుతం ఓటర్ల సంఖ్యను 118గా ఎన్నికల సంఘం నిర్ధారించింది. ఇందులో 83 మంది జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్లుకాగా.. మిగతా 35 మంది ఎక్స్‌ అఫీషియో సభ్యులు. ఈ ఎక్స్‌ అఫీషియో సభ్యుల హోదాలో వివిధ పార్టీలకు చెందిన ఐదుగురు రాజ్యసభ, ఇద్దరు లోక్‌సభ సభ్యులు, 12 మంది ఎమ్మెల్సీలు, 16 మంది ఎమ్మెల్యేలకు (నామినేటెడ్‌ ఎమ్మెల్యేను కూడా కలుపుకొని).. హైదరాబాద్‌ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలో ఓటు హక్కు ఉంది.

అయితే ఖైరతాబాద్‌ కార్పొరేటర్‌ విజయారెడ్డి బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లోకి మారడం, జూబ్లీహిల్స్‌ కార్పొరేటర్‌ డి.వెంకటేశ్, అడిక్‌మెట్‌ కార్పొరేటర్‌ సునీత ప్రకాశ్‌గౌడ్‌ ఇద్దరూ బీజేపీ నుంచి బీఆర్‌ఎస్‌లో చేరడం నేపథ్యంలో ఆయా పారీ్టల వాస్తవ బలాబలాలపై లెక్కలు వేస్తున్నారు. ఓటర్ల జాబితా ప్రకారం కార్పొరేటర్లు, ఎక్స్‌అఫీíÙయో సభ్యులు కలిపి బీజేపీ 33 ఓట్ల బలం ఉంది. అదే బీఆర్‌ఎస్, ఎంఐఎం పారీ్టలకు కలిపి 83 మంది ఓటర్లు సమకూరనున్నారు. ఇందులో సంఖ్యాపరంగా బీఆర్‌ఎస్‌కు ఎక్కువ ఓట్లున్నా పోటీకి దూరంగా ఉండి.. గతంలో మాదిరిగా ఎంఐఎంకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించినట్టు సమాచారం. ఇటీవల బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీ రామారావు, ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్‌ ఒవైసీ మధ్య జరిగిన భేటీలో దీనిపై అంగీకారం కుదిరినట్టు తెలిసింది. ప్రస్తుతం హైదరాబాద్‌ స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీగా ఉన్న ఎంఐఎం నేత అమీనుల్‌ హసన్‌ జాఫ్రీ.. 2017లో జరిగిన ఎన్నికలో బీఆర్‌ఎస్‌ మద్దతుతోనే శాసనమండలిలో అడుగు పెట్టారు. 

‘టీచర్‌ ఎమ్మెల్సీ’పై సస్పెన్స్‌ 
‘మహబూబ్‌నగర్‌– రంగారెడ్డి– హైదరాబాద్‌’ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి సుమారు 30 వేల మంది ఓటర్లుగా నమోదయ్యారు. బీఆర్‌ఎస్‌ గతంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నేరుగా అభ్యర్థులను బరిలోకి దింపకపోయినా.. భావసారూప్య ఉపాధ్యాయ సంఘాల తరఫున పోటీ చేస్తున్న నేతలకు మద్దతు ప్రకటించింది. 2017లో జరిగిన ఎన్నికలో పీఆరీ్టయూ (టీఎస్‌) తరఫున పోటీచేసిన కాటేపల్లి జనార్దన్‌రెడ్డికి బీఆర్‌ఎస్‌ మద్దతు ఇచి్చంది. ఇప్పటికే వరుసగా రెండు పర్యాయాలు ఎమ్మెల్సీగా పనిచేసిన కాటేపల్లి జనార్దన్‌రెడ్డి ప్రస్తుతం పీఆరీ్టయూ (తెలంగాణ) తరఫున పోటీకి సన్నాహాలు చేసుకుంటున్నారు. గుర్రం చెన్నకేశవరెడ్డి పీఆర్టీయూ (టీఎస్‌) నుంచి పోటీ చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. ఇక గత ఎన్నికలో పీఆరీ్టయూ (తెలంగాణ) తరఫున పోటీ చేసిన హర్షవర్ధన్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరి ఆ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. బీజేపీ కూడా విద్యాసంస్థల అధినేత ఏవీఎన్‌ రెడ్డిని బరిలోకి దింపింది.

దీనితో ‘మహబూబ్‌నగర్‌– రంగారెడ్డి– హైదరాబాద్‌’ ఉపాధ్యాయ కోటా ఎమ్మెల్సీ ఎన్నిక ఉత్కంఠగా మారింది. సుమారు 18 మంది అభ్యర్థులు బరిలోకి ఉండనున్నట్టు అంచనా కాగా.. అధికార బీఆర్‌ఎస్‌ ఎవరికి మద్దతు ఇస్తుందనేది ఆసక్తికరంగా మారింది. బీజేపీ నేరుగా తమ అభ్యర్థిని ప్రకటించిన నేపథ్యంలో.. బీఆర్‌ఎస్‌ కూడా ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుందని ఉపాధ్యాయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. పీఆరీ్టయూ (టీఎస్‌), పీఆరీ్టయూ (తెలంగాణ) తరఫున పోటీచేసే అభ్యర్థుల్లో బీఆర్‌ఎస్‌ ఎవరివైపు మొగ్గుతుందనే అంశంపై చర్చ జరుగుతోంది. 9 కొత్త జిల్లాల పరిధిలో జరుగుతున్న ఈ ఎన్నికకు నామినేషన్ల పర్వం ముగిశాక.. బీఆర్‌ఎస్‌ మద్దతుపై స్పష్టత రానున్నట్టు చెప్తున్నారు.  

   

మరిన్ని వార్తలు