‘మహబూబ్‌నగర్‌– హైదరాబాద్‌– రంగారెడ్డి’ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ.. మీకెందుకు ఓటెయ్యాలి?

20 Feb, 2023 03:06 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘మహబూబ్‌నగర్‌– హైదరాబాద్‌– రంగారెడ్డి’ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గం ఎన్నిక దగ్గరపడుతున్న కొద్దీ అభ్యర్థుల్లో ఆందోళన పెరుగుతోంది. విద్యాశాఖలో నెలకొన్న పరిణామాల నేపథ్యంలో.. ఓటర్లను ఆకట్టుకోవడం తలనొప్పిగా మారుతోంది. బదిలీలు, పదోన్నతులు పూర్తవకపోవడం, 317 జీవో ద్వారా టీచర్లు ఇష్టంలేని ప్రాంతాల్లో పనిచేయాల్సి రావడం, భాషా పండితుల వివాదం వంటివి ఎమ్మెల్సీ ఎన్నికపై ప్రభావం చూపుతున్నాయి. ఉపాధ్యాయులకు ఫలానా మేలు చేశామని నేతలు బలంగా చెప్పుకొని ఓట్లు అడిగే పరిస్థితి కనిపించడం లేదని అంటున్నారు.

అభ్యర్థులు ఎక్కడికెళ్లినా.. ఓటెందుకు వేయాలని, సమస్యలు ఏం పరిష్కరించారని నిలదీస్తున్న పరిస్థితి ఎదురవుతోందని ఉపాధ్యాయ సంఘాల నేతలు చెప్తున్నారు. దీనికి తగిన సమాధానం చెప్పలేని పరిస్థితి ఉందని అంటున్నారు. అంతేకాదు టీచర్ల అసంతృప్తికి ప్రభుత్వ నిర్ణయాలే కారణమని వివరించేందుకు అనుకూల సంఘాలు ముందుకురాని పరిస్థితి.

సంఘాల నేతలతో కలసి వెళ్తే..
ఎమ్మెల్సీ ఎన్నికల బరిలోకి దిగిన అభ్యర్థులను ఏదో ఒక సంఘం బలపరుస్తోంది. వారి మద్దతుతో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు వెళ్లాల్సి వస్తోంది. ఇది కూడా తమకు సమస్యగా మారిందని అభ్యర్థులు చెప్తున్నారు. ఏళ్ల తరబడి బదిలీలు, పదోన్నతులు జరగలేదు. ఎన్నికల ముందు షెడ్యూల్‌ ఇచ్చినా రోజుకో వివాదం వెంటాడుతోంది. వేసవి సెలవుల వరకు ఈ ప్రక్రియ ముందుకు సాగేట్టు కన్పించడం లేదు.

కొంతమందిని మాత్రం రాజకీయ పైరవీలతో బదిలీలు చేశారు. ఏ ఉపాధ్యాయ సంఘం కూడా ఈ పైరవీ బదిలీలను గట్టిగా వ్యతిరేకించిన దాఖలాల్లేవు. ఈ నేపథ్యంలో సంఘాల నేతలపై టీచర్లు ఆగ్రహంతో ఉన్నారు. మరోవైపు కోర్టు వివాదాల నేపథ్యంలో బదిలీలు, పదోన్నతులకు నోచుకోని భాషా పండితుల్లో సంఘాల పట్ల తీవ్ర అసంతృప్తి ఉంది. స్పౌజ్‌లు, నాన్‌–స్పౌజ్, 317 జీవో ద్వారా బదిలీ అయిన టీచర్లు సంఘాల నేతలను నిలదీసేందుకు ఇదే అవకాశంగా భావిస్తున్నారు. ఈ క్రమంలో సంఘాల నేతలను ప్రచారానికి తీసుకెళ్తే ప్రతికూలత తప్పడం లేదని అభ్యర్థులు చెప్తున్నారు.

రకరకాల హామీలు ఇస్తున్నా..
పోటీ తీవ్రత ఎక్కువగా ఉండటంతో టీచర్‌ ఓటర్లను ఆకట్టుకోవడానికి అభ్యర్థులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్నికల నాటికే బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్‌ తెప్పించిన ఘనత తమదేనని ప్రభుత్వ సానుకూల టీచర్‌ సంఘాలు చెప్తున్నాయి. తాము మద్దతిస్తున్న అభ్యర్థులను గెలిపిస్తే ఈ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లే బాధ్యత తమదని అంటున్నాయి. మరోవైపు ప్రమోషన్లు, బదిలీల షెడ్యూల్‌ రావడానికి తమ పోరాటాలే కారణమని, ప్రతీ సమస్య పరిష్కారంలో తామే ముందుంటున్నామని మరికొన్ని సంఘాలు ఓటర్లకు వివరిస్తున్నాయి. ఇక స్వతంత్రంగా పోటీ చేస్తున్న అభ్యర్థులు మాత్రం.. ప్రభుత్వంపై, సంఘాలపై టీచర్లలో నెలకొన్న అసంతృప్తి తమకు కలసివస్తుందని భావిస్తున్నారు.

పోటీ ఎక్కువగానే..
‘మహబూబ్‌నగర్‌– హైదరాబాద్‌– రంగారెడ్డి’టీచర్‌ ఎమ్మెల్సీ నియోజకవర్గం పరిధిలో 29,501 ఓట్లు ఉన్నాయి. ఇందులో 15,425 పురుష, 14074 మహిళా టీచర్లు ఉన్నారు. ఎన్నికకు నామినేషన్ల స్వీకరణ మొదలైంది. సోమవారం నుంచి పెద్ద ఎత్తున అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే పలువురి పేర్లను ఉపాధ్యాయ సంఘాలు ప్రకటించాయి.

టీఎస్‌ యూటీఎఫ్‌ అభ్యర్థిగా పాపన్నగారి మాణిక్‌ డ్డి, పీఆర్టీయూ టీఎస్‌ నుంచి గుర్రం చెన్నకేశవరెడ్డి, ఎస్టీయూటీఎస్‌ నుంచి బి.భుజంగరావు, పీఆర్టీయూ తెలంగాణ నుంచి కాటేపల్లి జనార్దన్‌రెడ్డి, టీపీటీఎఫ్‌ నుంచి వినయబాబు, బీజేపీ మద్దతులో ఎవీఎన్‌ రెడ్డి, జీటీఏ నుంచి కాసం ప్రభాకర్, ఎల్సీ జీటీఏ నుంచి ఎస్‌.రవీందర్, బీసీటీఏ నుంచి విజయకుమార్, టీయూటీఎఫ్‌ నుంచి మల్లారెడ్డి పోటీ చేస్తున్నారు. సాంకేతిక విద్యాసంస్థల్లోని అధ్యాపక ఓట్లనే నమ్ముకుని బరిలోకి దిగిన స్వతంత్ర అభ్యర్థిగా అయినేని సంతోష్‌ కుమార్‌ బరిలో ఉన్నారు. కాంగ్రెస్‌ మద్దతుతో గాల్‌రెడ్డి హర్షవర్ధన్‌రెడ్డి బరిలోకి దిగుతున్నా.. సమర్థించే సంఘాలు కన్పించడం లేదు. 

మరిన్ని వార్తలు