నా భార్య విడాకులిమ్మని వేధిస్తోంది

31 Oct, 2021 07:35 IST|Sakshi

సైబరాబాద్‌ భరోసా సెంటర్‌కు భర్త ఫిర్యాదు 

అయిదుకు చేరిన పురుష బాధితుల సంఖ్య 

గత ఏడాది 20 కేసులు నమోదు  

సాక్షి, హైదరాబాద్‌: మహిళలకు, పిల్లలకు భద్రత, రక్షణ కల్పించేందుకు ఏర్పాటు చేసిన షీ టీమ్స్‌కు.. అదే మహిళలపై ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ ఏడాది వివిధ ప్రాంతాల్లోని అయిదుగురు పురుష బాధితులు మహిళలపై సైబరాబాద్‌ భరోసా సెంటర్‌లో ఫిర్యాదు చేశారు. ఇలా మహిళలపై గతేడాది 20 కేసులు నమోదు కాగా..  2019లో 7 ఫిర్యాదులు అందాయి. తాజాగా మైలార్‌దేవ్‌పల్లికి చెందిన ఓ భర్త.. తన భార్య విడాకులు ఇవ్వమంటూ ఏడాది కాలంగా వేధిస్తోందని సైబరాబాద్‌ భరోసా కేంద్రాన్ని ఆశ్రయించాడు. సైబరాబాద్‌ పరిధిలోని ఓ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి అయిన బాధితుడు మద్యానికి బానిసగా మారి భార్యను మానసికంగా, శారీరకంగా వేధించేవాడు. దీంతో భార్య అతని నుంచి దూరంగా జీవనం గడుపుతోంది. తన తప్పు తెలుసుకున్నానని, భార్యతో కలిసి ప్రశాంతంగా జీవితాన్ని గడుపుతానని పోలీసులే న్యాయం చేయాలని కోరుతూ సైబరాబాద్‌ పోలీసులను ఆశ్రయించాడు. తన భర్త మీద నమ్మకం లేకపోవటంతో సదరు మహిళ.. తాను భర్తతో కలిసి ఉండలేనని, కౌన్సెలింగ్‌కు ఇకపై రానంటూ పోలీసులకు తేల్చి చెప్పింది. పెద్దల సమక్షంలోనే తాడోపేడో తేల్చుకుంటానని తెలిపింది. 

గత నెలలో 73 కేసులు.. 
సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్, సొసైటీ ఫర్‌ సైబరాబాద్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ (ఎస్‌సీఎస్‌సీ) సంయుక్తంగా కలిసి 2018 అక్టోబర్‌లో భరోసా సెంటర్‌ను ఏర్పాటు చేశాయి. సెప్టెంబర్‌ నెలలో సైబరాబాద్‌ భరోసా కేంద్రానికి 73 ఫిర్యాదులు అందాయి. ఇందులో 72 గృహ హింస, ఒకటి పోక్సో కేసు ఉంది. కాగా 35 జంటలను ఒక్కటి చేశారు. 13 ఫిర్యాదులను ఎఫ్‌ఐఆర్‌ నమోదు నిమిత్తం సంబంధిత పోలీస్‌ స్టేషన్లకు సూచించారు. అలాగే 12 మందికి టెలిఫోన్‌ ద్వారా కౌన్సెలింగ్‌ ఇచ్చారు. 10 ఫిర్యాదులను న్యాయపరమైన సూచన కోసం రిఫర్‌ చేశారు. 3 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.  

వాట్సాప్‌లో ఫిర్యాదు చేయండి 
ఫిర్యాదు అందిన తక్షణమే బాధితులు, ప్రతివాదులు ఇరువురికి కౌన్సెలింగ్‌ ఇస్తాం. వాట్సాప్‌ ద్వారా సైబరాబాద్‌ భరోసా కేంద్రం అందిస్తున్న సేవలపై బాధితుల నుంచి పెద్ద ఎత్తున ప్రశంసలు వస్తున్నాయి. 94906 17261 వాట్సాప్‌ నంబర్‌ ద్వారా గానీ 040–29882977, డయల్‌ 100 నంబర్ల ద్వారా ఫిర్యాదు చేయవచ్చు.  
– అనసూయ, డీసీసీ, సైబరాబాద్‌ షీ టీమ్స్‌

చదవండి: ఏమైందో.. ఏమో.. 

 

మరిన్ని వార్తలు