చార్మినార్‌లో కరెన్సీ నోట్ల వర్షం.. సీసీ కెమెరాల్లో దృశ్యాలు

12 Jun, 2022 09:40 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: చార్మినార్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని గుల్జార్‌హౌజ్‌ ఫౌంటెన్‌ వద్ద గుర్తు తెలియని యువకులు రోడ్లపై వెదజల్లిన నోట్ల కరెన్సీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 10న (శుక్రవారం తెల్లవారుజామున 4 గంటలకు) మదీనా వైపు నుంచి గుల్జార్‌హౌజ్‌ వైపు వచ్చిన నాలుగైదు కార్లలో యువకులు కార్లను రోడ్డుపై నిలిపి ఫౌంటెయిన్‌ వద్దకు వచ్చి రూ.20 నోట్లను వెదజల్లారు. అక్కడే విధి నిర్వహణలో పారిశుద్ధ్య కార్మికులు రోడ్డుపై పడిన కరెన్సీ నోట్లను ఎగబడి అందుకున్నారు.

కొద్దిసేపు గుల్జార్‌హౌజ్‌ ఫౌంటెయిన్‌ వద్ద హంగామా సృష్టించి యువకులు అనంతరం కాలికమాన్‌ వైపు వెళ్లిపోయినట్లు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. పెళ్లి బరాత్‌ ముగించుకొని వస్తుండగా.. దారి మధ్యలో ఈ సంఘటనకు పాల్పడినట్లు చార్మినార్‌ ఇన్‌స్పెక్టర్‌ గురు నాయుడు తెలిపారు. తమకు అందించిన సమాచారం మేరకు ఆయా పరిసరాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నామన్నారు. యువకులు ఎగరవేసిన నోట్లు నకిలీవా...? ఆసలైనా నోట్లా...? అని పోలీసులు విచారణ చేపడుతున్నారు.

మరిన్ని వార్తలు