ఆకాశ మార్గాన వ్యాక్సిన్‌ రాబోతోంది

1 May, 2021 08:48 IST|Sakshi

తెలంగాణ విజ్ఞప్తి పట్ల సానుకూల స్పందన

వికారాబాద్‌ జిల్లాలో ప్రయోగాత్మకంగా అమలు

ఏరియా ఆస్పత్రి నుంచి మారుమూల పీహెచ్‌సీలకు వ్యాక్సిన్లు

24 రోజుల పాటు జరగనున్న డ్రోన్లతో ట్రయల్స్‌

సాక్షి, హైదరాబాద్‌: ప్రయోగాత్మకంగా ఆకాశ మార్గంలో మానవ రహిత విమానాలు(డ్రోన్ల) ద్వారా కోవిడ్‌–19 వ్యాక్సిన్ల పంపిణీకి కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. వ్యాక్సిన్ల పంపిణీ కోసం డ్రోన్లు వినియోగించడానికి వీలుగా.. మానవ రహిత విమాన వ్యవస్థ(యూఏఎస్‌) నిబంధనలు–2021కు సడలింపులు ఇవ్వాలని మార్చి 9న రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తి పట్ల తాజాగా కేంద్ర పౌర విమానయాన శాఖ సానుకూలంగా స్పందించింది.

కంటి చూపు మేర(విజువల్‌ లైన్‌ ఆఫ్‌ సైట్‌/వీఎల్‌ఓఎస్‌)లో ఎగిరే డ్రోన్ల ద్వారా ప్రయోగాత్మకంగా వ్యాక్సిన్ల పంపిణీకి షరతులతో కూడిన సడలింపులు ఇస్తూ ఆ శాఖ జాయింట్‌ సెక్రటరీ అంబర్‌ దూబె గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఏడాది కాలం లేదా తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు ఈ సడలింపులు అమల్లో ఉంటాయని తెలిపారు. వ్యాక్సిన్ల పంపిణీకి డ్రోన్ల వినియోగంలో పాటించాల్సిన ప్రామాణిక పద్ధతి(స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసిజర్‌/ఎస్‌ఓపీ)ను సివిల్‌ ఏవియేషన్‌ డైరెక్టర్‌ జనరల్‌(డీజీసీఏ) ఏప్రిల్‌ 26న ఆమోదించినట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కంటి చూపు పరిధి రేఖకు దాటి(బియాండ్‌ ది విజువల్‌ లైన్‌ ఆఫ్‌ సైట్‌/బీవీఎల్‌ఓఎస్‌) డ్రోన్లను ఎగురవేయడానికి సడలింపుల కోసం రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ ప్రయత్నాలు చేస్తోంది. మారుమూల గ్రామాలకు వ్యాక్సిన్లను చేర్చడానికి డ్రోన్లను వినియోగంలోకి తెస్తే సమయంతో పాటు రవాణా ఖర్చులు సైతం ఆదా కానున్నాయి. 

తొలుత వికారాబాద్‌లో ట్రయల్స్‌...
ఔషధాలు, ఇతర వైద్యారోగ్య సంబంధిత వస్తువులను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి సురక్షితంగా చేర్చడంలో డ్రోన్‌ సర్వీస్‌ ప్రొవైడర్ల సామర్థ్యాన్ని అంచనా వేయడానికి ఐటీ శాఖ ఇప్పటికే ఆసక్తి వ్యక్తీకరణ(ఈఓఐ)ను ఆహ్వానించగా, 16 సంస్థలు ముందుకు వచ్చాయి. ఇందులో 8 మందిని ఐటీ శాఖ షార్ట్‌లిస్ట్‌ చేసింది. తొలుత వికారాబాద్‌ జిల్లాలో ప్రయోగాత్మకంగా డ్రోన్ల ద్వారా వ్యాక్సిన్లను మారుమూల గ్రామాల పీహెచ్‌సీలకు తరలించే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలన జరుపుతోంది. వ్యాక్సిన్లతో డ్రోన్లు వికారాబాద్‌ ఏరియా ఆస్పత్రిలో టేకాఫ్‌ చేసి జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్‌సీలు), ఉపకేంద్రాల్లో ల్యాండింగ్‌ చేసే విధంగా ప్రణాళికలను రూపొందిస్తోంది. జిల్లా యంత్రాంగం సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఇందుకు సంబంధించిన సన్నాహాలను చేపట్టింది.

ఈ వ్యవహారాలను పర్యవేక్షించడానికి నోడల్‌ అధికారిని సైతం నియమించింది. తొలుత ప్రతి డ్రోన్‌ ద్వారా డమ్మీ వైల్స్‌తో పాటు అసలు టీకాలను కలిపి పంపించి వీటి పనితీరును పరీక్షించి చూడనున్నారు. ట్రయల్స్‌లో వచ్చిన ఫలితాల ఆధారంగా పూర్తి స్థాయిలో డ్రోన్ల ద్వారా టీకాల పంపిణీ కోసం విధివిధానాలను రూపొందించనున్నారు. ఇప్పటికే ఎంపిక చేసిన 8 సంస్థలను 4 బ్యాచ్‌లుగా విభజించి ట్రయల్స్‌ నిర్వహించనున్నారు. ఒక్కో బ్యాచ్‌లో రెండు సంస్థలు ఉండనున్నాయి. ఒక్కో బ్యాచ్‌ 6 రోజుల పాటు డ్రోన్లను ఎగిరించి తమ సామర్థ్యాన్ని నిరూపించుకోనున్నాయి. 24 రోజుల పాటు డ్రోన్లతో వ్యాక్సిన్‌ పంపిణీకి ట్రయల్స్‌ నిర్వహించడానికి ఐటీ శాఖ ప్రణాళికలు రూపొందించింది. వికారాబాద్‌ గగన తలంలో డ్రోన్ల వినియోగంపై ఏయిర్‌ ఫోర్స్‌ ఆథారిటీ ఆఫ్‌ ఇండియా(ఏఏఐ) సైతం అనుమతి ఇచ్చింది. 
డ్రోన్లపై ముందు చూపు...
రాష్ట్ర ఐటీ శాఖలోని ఎమర్జింగ్‌ టెక్నాలజీస్‌ వింగ్‌ 2019లో రాష్ట్ర డ్రోన్ల విధానాన్ని ప్రకటించింది. దీని అమలులో భాగంగా ‘వింగ్స్‌ 2020’ పేరుతో హైదరాబాద్‌లో ప్రత్యేక ఈవెంట్‌ నిర్వహించింది. ఆకాశ మార్గంలో మందుల సరఫరా (మెడిసిన్‌ ఫ్రమ్‌ ది స్కై/ఎంఎఫ్‌టీఎస్‌) వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. డ్రోన్ల వాడకంపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు కోవిడ్‌ –19 వ్యాక్సినేషన్‌కు ఉపయోగపడబోతున్నాయి. వ్యాక్సిన్ల పంపిణీకి డ్రోన్ల వినియోగానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడం పట్ల రాష్ట్ర ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేష్‌ రంజన్‌ హర్షం వ్యక్తం చేశారు.

( చదవండి: DCGI Approval: కోవిడ్‌కు సరికొత్త చికిత్స! )

మరిన్ని వార్తలు