అమితా ‘బుద్ధుడి’పై  పరిశోధన

23 Mar, 2022 00:44 IST|Sakshi
ఆగ్నేయాసియాలో ఆరాధించే తరహా అమితాభ బుద్ధుడి శిల్పం  

పులికాట్‌ సరస్సు దీవిలోకి ఆ రూపం ఎలా వచ్చింది?  

అరుదైన శిల్పంపై హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ పరిశోధన 

ప్రొఫెసర్‌ కేపీరావు ఆధ్వర్యంలో ఈ నెల 24 నుంచి తవ్వకాలు  

సాక్షి, హైదరాబాద్‌: పులికాట్‌ సరస్సులోని ఓ దీవిలో ఉన్న అమితాభ బుద్ధుడి రహస్యాన్ని ఛేదించేందుకు హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ ఆచార్యులు పరిశోధన ప్రారంభిస్తున్నారు. ఏపీలోని నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట మండలం కుంతూరు పల్లె శివారులో నాలుగడుగుల బుద్ధుడి విగ్రహం చాలాకాలంగా ప్రశ్నార్థకంగా ఎదురుచూస్తోంది. తధాగతుడి రూపాల్లో అమితాభుడి అవతారం ఒకటి. ఆగ్నేయాసియా దేశాల్లో అమితాభ బుద్ధుడి ఆరాధన ఎక్కువ. పులికాట్‌ దీవిలో అమితాభ బుద్ధుడి విగ్రహం పరిశోధకులను ఆకట్టుకుంటోంది.

మన దేశంలో ఈ తరహా శిల్పాలు  అరుదు. ఈ ప్రాంతం ఇసుక దిబ్బలతో  ఆర డుగుల ఎత్తుతో ఉంటుంది. దీంతో ఆ ప్రాంతంలో బౌద్ధ స్థూపం ఉండి ఉంటుందని భావిస్తున్నారు. గతంలో ఇక్కడ శాతవాహనుల కాలానికి చెందిన పెద్దపెద్ద ఇటుకలు వెలుగుచూశాయి. ‘1991 ప్రాంతంలో నేను శ్రీవెంకటేశ్వర వర్సిటీలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ గా ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో పరిశోధించి బుద్ధుడి విగ్రహాన్ని గుర్తించా. ఆ సమయంలో కొన్ని ఇటుకలూ వెలుగుచూశాయి. అవి క్రీ.శ. 1–2 శతాబ్దాల కాలానికి చెందినవిగా అనిపించాయి’అని హెచ్‌సీయూ ప్రొఫెసర్‌ డాక్టర్‌ కేపీరావు ‘సాక్షి’తో చెప్పారు. ‘ఏడాది క్రితం మళ్లీ కుంటూరుకు వెళ్లాం. బుద్ధుడి విగ్రహం అలాగే ఉంది. అక్కడి దిబ్బ ప్రాంతంలో ఈనెల 24 నుంచి దాదాపు నెలన్నరపాటు తవ్వకాలు జరపాలని నిర్ణయించాం’అని తెలిపారు. 

ఇటుక గోడ నిర్మాణ జాడలు
‘బుద్ధుడి విగ్రహమున్న ప్రాంతంలో గతంలో భారీ ఇటుకలతో గోడ ఉండేదని, కొందరు  త వ్వి ఇటుకలు తీసుకెళ్లారని స్థానికులు చెప్పా రు. అమితాభ బుద్ధుడి శిల్పం ఇక్కడ ఎందుకుందో తవ్వకాల్లో తెలుస్తుంది. ఆగ్నేయాసియాతో ఈ ప్రాంతానికి సంబంధముందా కూడా తెలుస్తుంది’ అని కేపీరావు చెప్పారు. 

మరిన్ని వార్తలు