Hyderabad: గుడ్‌న్యూస్‌.. సిటీబస్సు @ 24/7

14 May, 2022 07:13 IST|Sakshi

ప్రయాణికుల రద్దీ మార్గాల్లో సిటీ సర్వీసులు

ప్రధాన రైల్వేస్టేషన్లు, బస్‌స్టేషన్లకు సదుపాయం  

పలురూట్లలో ప్రయోగాత్మకంగా అమలు 

అర్ధరాత్రి 12 గంటల నుంచి తెల్లవారు జామున 4 గంటల వరకు

సాక్షి, హైదరాబాద్: సిటీబస్సు ఇక 24 గంటలు పరుగులు తీయనుంది. ప్రయాణికుల డిమాండ్, రద్దీ ఉన్న రూట్లలో అర్ధరాత్రి 12 నుంచి తెల్లవారు జామున 4 గంటల వరకు ఈ బస్సులు అందుబాటులో ఉంటాయి. ఈ బస్సులు డిపోలకు చేరుకొనే సమయానికి రెగ్యులర్‌ బస్సులు తిరిగి  రోడ్డెక్కుతాయి. దీంతో 24 నాలుగు గంటల పాటు ప్రయాణికులు ఆర్టీసీ సేవలను వినియోగించుకోవచ్చు. ఇప్పటికే పలు మార్గాల్లో నైట్‌బస్సులు ప్రయోగాత్మకంగా నడుపుతున్నారు. ప్రయాణికుల నుంచి కూడా మంచి స్పందన లభిస్తోంది.

ముఖ్యంగా రాత్రి వేళల్లో ఆలస్యంగా నగరానికి చేరుకొనే ప్రయాణికులు, తెల్లవారు జామునే దూరప్రాంతాలకు బయలుదేరేవారికి ఈ  బస్సులు అనుకూలంగా ఉన్నాయి. అర్ధరాత్రి నగరానికి చేరుకొనే  ప్రయాణికులు ఆటోలు, క్యాబ్‌లలో  వెళ్లేందుకు పెద్ద మొత్తంలో చెల్లించవలసి వస్తోంది. మరోవైపు ప్రయాణికుల భద్రతకూడా ప్రశ్నార్ధకమే. ఈ నేపథ్యంలో తాము  ప్రవేశపెట్టిన  సిటీ బస్సులకు ప్రయాణికుల ఆదరణ లభిస్తోందని, డిమాండ్‌ మేరకు నగరంలోని మరిన్ని మార్గాల్లో బస్సులను ప్రవేశపెడుతామని ఆర్టీసీ సికింద్రాబాద్‌ రీజనల్‌మేనేజర్‌ వెంకన్న తెలిపారు.  

ఈ రూట్లలో నైట్‌ బస్సులు... 
సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ నుంచి వివిధ మార్గాల్లో నైట్‌ బస్సులు నడుస్తున్నాయి. ప్రతిరోజు సుమారు 200 రైళ్లు సికింద్రాబాద్‌ నుంచి రాకపోకలు సాగిస్తాయి. 80 ప్రధాన ఎక్స్‌ప్రెస్‌లు దూరప్రాంతాల నుంచి నగరానికి చేరుకొంటాయి. వీటిలో కొన్ని అర్ధరాత్రి నగరానికి వస్తే మరి కొన్ని తెల్లవారు జామున సికింద్రాబాద్‌ స్టేషన్‌కు చేరుతాయి. అదే సమయంలో కొన్ని రైళ్లు ఉదయం 3.30 గంటల నుంచే బయలుదేరుతాయి. దీంతో నగరంలోని పలు ప్రాంతాల నుంచి సికింద్రాబాద్‌ స్టేషన్‌కు చేరుకోవడం కష్టంగా ఉన్నట్లు ఆర్టీసీ  అధ్యయనంలో వెల్లడైంది. ఈ మేరకు ప్రస్తుతం ప్రయాణికుల డిమాండ్‌ ఉన్న రూట్లలో బస్సులను నడుపుతున్నారు.  
సికింద్రాబాద్‌ స్టేషన్‌ నుంచి పటాన్‌చెరు వరకు అర్ధరాత్రి 12 నుంచి  తెల్లవారు జాము వరకు  2 బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి.  ఆ తరువాత రెగ్యులర్‌ బస్సులు అందుబాటులోకి వస్తాయి.  
సికింద్రాబాద్‌ స్టేషన్‌ నుంచి ఆఫ్జల్‌గంజ్, మెహదీపట్నం, బోరబండ, తదితర ప్రాంతాలకు కూడా నైట్‌ బస్సులను నడుపుతున్నారు. ఈ మార్గాల్లో ప్రతి  అరగంట నుంచి 45 నిమిషాలకు ఒక బస్సు అందుబాటులో ఉంటుంది.  
సికింద్రాబాద్‌ చిలకలగూడ క్రాస్‌రోడ్డు నుంచి హయత్‌నగర్‌ వరకు మరో  రెండు బస్సులు నడుస్తున్నాయి. అలాగే చిలకలగూడ నుంచి 
ఇబ్రహీంపట్నం వరకు నైట్‌ బస్సులను నడుపుతున్నారు.  
మహాత్మాగాంధీ బస్‌స్టేషన్‌ నుంచి లింగంపల్లి నైట్‌ బస్సులు అందుబాటులో ఉన్నాయి.  

అన్ని పాస్‌లకు అనుమతి... 
ఈ నైట్‌ బస్సుల్లో అన్ని రకాల పాస్‌లను అనుమతిస్తారు.  
24 గంటల పాటు చెల్లుబాటయ్యే ట్రావెల్‌ యాజ్‌ యు లైక్‌ (టీఏవైఎల్‌) టిక్కెట్‌లపైనా ప్రయాణికులు నైట్‌ బస్సుల్లో ప్రయాణం చేయవచ్చు.    

మరిన్ని వార్తలు