ఆర్టీసీ దిద్దు‘బాట'.. మారనున్న సిటీ బస్సుల రూటు

25 Sep, 2021 20:28 IST|Sakshi

నగరానికి 50 కిలోమీటర్ల పరిధిలో సిటీ బస్సులు

శివారు ప్రాంతాలకే ఎక్కువ ప్రాధాన్యం

నష్ట నివారణ దిశగా ప్రణాళికలు

ప్రయాణికుల ఫిర్యాదుల కోసం వాట్సప్‌ నెంబర్లు

సీఎం కేసీఆర్‌ సమీక్ష నేపథ్యంలో కార్యాచరణ

సాక్షి, హైదరాబాద్‌: సిటీ బస్సు రూటు మారనుంది. నగరంలో భారీగా పెరిగిన సొంత వాహనాల వినియోగం, మెట్రో రైళ్లు, ప్రైవేట్‌ వాహనాల పోటీ వంటి పరిణామాలతో తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్న గ్రేటర్‌ ఆర్టీసీ నష్ట నివారణ చర్యలకు ఉపక్రమించింది. ఈ మేరకు హైదరాబాద్‌ చుట్టూ 50 కిలోమీటర్ల పరిధిలో బస్సుల విస్తరణకు చర్యలు చేపట్టింది. శివార్లకు ఎక్కువ సంఖ్యలో బస్సులు నడపడం ద్వారా ఆక్యుపెన్సీ రేటు పెరుగుతుందని భావిస్తోంది.  

మెట్రో రైళ్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత సమాంతర రూట్లలో సిటీ బస్సుల్లో ఆక్యుపెన్సీ పడిపోయింది. ఓలా, ఉబెర్, ర్యాపిడో వంటి క్యాబ్‌ సర్వీసులు మరింత దెబ్బతీశాయి. దీంతో ప్రధాన నగరంలో సిటీ బస్సులను తగ్గించి శివార్లలో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ట్రిప్పులను పెంచనున్నట్లు ఆర్టీసీ  ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఈ మేరకు నగరం చుట్టూ 50 కిలోమీటర్ల పరిధిలో ప్రయాణ అవసరాలపైన అధ్యయనం చేపట్టినట్లు పేర్కొన్నారు. ఇటీవల సీఎం కేసీఆర్‌ సైతం సిటీ బస్సుల నష్టాలను ప్రత్యేకంగా ప్రస్తావించిన సంగతి  తెలిసిందే. దీంతో గ్రేటర్‌లో దిద్దుబాటు మొదలైంది.
చదవండి: తెలంగాణ: నష్టాల ఆర్టీసీలో దుబారా..! 

ప్రయాణికులకు చేరువగా... 
► ప్రస్తుతం సిటీ బస్సులు గంటకు 15 కిలోమీటర్ల చొప్పున ప్రతి రోజు 250 కిలోమీటర్ల మాత్రమే తిరుగుతున్నాయి. ట్రాఫిక్‌ రద్దీ, ట్రిప్పుల రద్దు, పరిమిత రూట్లు ఇందుకు కారణం. స్కూళ్లు, కాలేజీలు తదితర విద్యాసంస్థలు  పూర్తిస్థాయిలో పునరుద్ధరించకపోవడం వల్ల కూడా బస్సులు ఎక్కువ దూరం  తిరగడం లేదు. 
► గతంలో హయత్‌నగర్‌ నుంచి పటాన్‌చెరు వరకు తిరిగిన బస్సులు ఇప్పుడు హయత్‌నగర్‌ నుంచి ఎల్‌బీనగర్‌కు పరిమితమయ్యాయి. ఎల్‌బీనగర్‌ నుంచి మియాపూర్‌ వరకు మెట్రో రైలు రావడం  ఇందుకు కారణం. 
► ఇదే సమయంలో  జిల్లా బస్సులు మాత్రం గంటకు  25 నుంచి 30  కిలోమీటర్ల చొప్పున రోజుకు 400 నుంచి 500 కిలోమీటర్ల వరకు తిరుగుతున్నాయి. 
► గతంలో నగరంలో 3850 బస్సులు ప్రతిరోజు 9 లక్షల కిలోమీటర్లు తిరిగాయి. 800కు పైగా సిటీ బస్సులను తొలగించారు. దీంతో ప్రస్తుతం 7 లక్షల కిలోమీటర్లే తిరుగుతున్నాయి. 
► వివిధ కారణాల వల్ల నగరంలో తగ్గిన ప్రయాణికుల ఆక్యుపెన్సీని పెంచుకొనేందుకు సిటీ బస్సు స్టీరింగ్‌ను శివార్ల వైపు తిప్పేందుకు అధికారులు కార్యాచరణ చేపట్టారు.  
చదవండి: ఆర్టీసీ నష్టాలకు వాస్తు దోషమా? బస్‌భవన్‌కు వాస్తు మార్పులు

మారనున్న రూటు... 
► సికింద్రాబాద్‌–కోఠి, నాంపల్లి–మెహిదీపట్నం వంటి తక్కువ దూరం ఉన్న రూట్లలో ఒక బస్సు రోజుకు 6 ట్రిప్పులు నడిచినా 250 కిలోమీటర్ల లక్ష్యాన్ని చేరుకోవడం కష్టంగా ఉంది. అదే సమయంలో ఆక్యుపెన్సీ కూడా 60 శాతం లోపే ఉంటుంది. 
► ప్రత్యామ్నాయంగా తక్కువ దూరం ఉన్న రూట్లలో ట్రిప్పులను తగ్గించి  చౌటుప్పల్‌–ఎంజీబీఎస్, మాల్‌–కోఠి, భువనగిరి–సికింద్రాబాద్, చేవెళ్ల– మెహిదీపట్నం వంటి దూరప్రాంతాలకు ట్రిప్పులను పెంచనున్నారు. 
► ఈ మార్పులతో గంటకు 15 కిలోమీటర్ల నుంచి 25 కిలోమీటర్ల వరకు, రోజుకు 250 కిలోమీటర్ల నుంచి 400 కిలోమీటర్ల వరకు బస్సు వినియోగం పెరిగే అవకాశం ఉంటుందని అధికారుల అంచనా. 

భారీగా నష్టాలు
► ప్రస్తుతం నగరంలో సిటీ బస్సులు రోజుకు రూ.కోటి నష్టంతో నడుస్తున్నాయి.  
► కిలోమీటర్‌కు రూ.36 ఆదాయం లభిస్తుండగా ఖర్చు మాత్రం రూ.85 వరకు నమోదవుతోంది. ఒక్క డీజిల్‌ కోసమే కిలోమీటర్‌కు రూ.20 చొప్పున వెచ్చించవలసి వస్తోందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  
► ప్రస్తుతం రోజు రూ.2.5 కోట్ల ఆదాయం ఉన్నా నిర్వహణ వ్యయం రూ.3.5 కోట్లు. 
► సిటీ నుంచి చేవెళ్ల, శంకర్‌పల్లి, మాల్, రాయగిరి, భువనగిరి వంటి  దూరప్రాంతాలకు బస్సులను పెంచుకోవడం వల్ల కిలోమీటర్‌పైన వచ్చే ఆదాయం రూ.36 నుంచి కనీసం రూ.50 వరకు పెరుగుతుందని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.  

ఫిర్యాదులకు వాట్సప్‌ పరిష్కారం 
► ప్రయాణికులకు  చేరువయ్యేందుకు ఆర్టీసీ  మరో  కార్యక్రమాన్ని  చేపట్టింది.  
► సిటీ బస్సుల సమస్యలపైన  ప్రయాణికులు కింది నెంబర్లకు వాట్సప్‌ ద్వారా ఫిర్యాదులు చేసి పరిష్కారం పొందవచ్చు. 
కోఠి సహాయ కేంద్రం: 99592 26160 
రెతిఫైల్‌ కేంద్రం: 83339 04531

మరిన్ని వార్తలు