ఒక్క అబద్ధమున్నా రాజీనామా.. అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌ సవాల్‌

13 Feb, 2023 02:29 IST|Sakshi

అన్నిట్లోనూ అత్యంత చెత్త పనితీరు.. వార్షిక వృద్ధి రేటు 6.8% నుంచి 5.5 శాతానికి పడిపోయింది 

తలసరి ఆదాయం, ఎగుమతులు, పారిశ్రామిక వృద్ధి రేట్లు పడిపోయాయి.. 

పెట్టుబడి వ్యయం తగ్గిపోయింది.. జీడీపీలో అప్పుల శాతం, ద్రవ్యలోటు మాత్రం పెరిగిపోయాయన్న సీఎం 

ఎన్డీయే అంటే ‘నో డేటా అవైలబుల్‌’ అని ఎద్దేవా  

సాక్షి, హైదరాబాద్‌: దేశం ప్రతి రంగంలో డౌన్‌ అయ్యిందని సీఎం కేసీఆర్‌ విమర్శించారు. ‘మోదీ గెలిచారు, బీజేపీ గెలిచింది. ప్రజలు మాత్రం ఓడిపోయారు..’ అని అన్నారు. రాష్ట్ర శాసనసభ వేదికగా ముఖ్యమంత్రి ఆదివారం మరోసారి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. మన్మోహన్‌ సింగ్‌ హయాంతో మోదీ హయాన్ని పోలుస్తూ.. దేశం ఘోరాతిఘోరంగా ఓడిపోయిందని మండిపడ్డారు. ద్రవ్య వినిమయ బిల్లుపై ఆదివారం శాసనసభలో జరిగిన చర్చకు ఆయన 2 గంటలకు పైగా బదులిచ్చారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. 

పెనం మీద నుంచి పొయ్యిలోకి.. 
‘దివాళ తీసుకుంటూ మేమే గొప్పోళ్లం అంటుంటారు. దేశంలో ఇదొక విచిత్రమైన పరిస్థితి. చిత్ర విచిత్రమైన పోకడలు, వింత వింత ధోరణలు, పక్షపాత వైఖరులు చూస్తున్నాం. ఎన్నికలు జరిగినప్పుడు పారీ్టలు, రాజకీయ నేతలు గెలుస్తున్నారు. ప్రజలు ఓడిపోతున్నారు. కాంగ్రెస్‌ పనికి రాకుండా పోయిందని 2014లో మోదీని ప్రజలు గెలిపించారు. కానీ మోదీ కన్నా మన్మోహన్‌ సింగ్‌ బెహతరీన్‌ పనిచేశారు. ఇప్పటికి 20 లక్షల మంది భారతీయులు దేశ పౌరసత్వాన్ని వదులుకున్నారు. పారిశ్రామికవేత్తలు పారిపోతున్నారు. పరిశ్రమలు మూతబడుతున్నాయి. ద్రవ్యోల్బణం పెరుగుతూ ఉంది. ప్రజల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్టు అయింది..’ అని కేసీఆర్‌ ధ్వజమెత్తారు.   

తెలంగాణకు రూ.3 లక్షల కోట్ల నష్టం 
‘భారతదేశ ప్రజల ఓటమిలో భాగంగా తెలంగాణ కూడా కొంత ఓడిపోయింది. మన జీఎస్డీపీ రూ.13.27 లక్షల కోట్లు. మోదీ స్థానంలో మన్మోహన్‌ సింగ్‌ ఉన్నా లేక భారత ప్రభుత్వం తెలంగాణ తరహాలో పని చేసినా మన జీఎస్డీపీ రూ.16 లక్షల కోట్లు ఉండాలి. ఒక్క తెలంగాణనే రూ.3 లక్షల కోట్లు నష్టపోయింది. కేంద్రం బడ్జెట్‌లో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసింది. దేశంలో 157 వైద్య కళాశాలలు, మరో 157 నర్సింగ్‌ కళాశాలలిస్తే రాష్ట్రానికి ఒక్కటంటే ఒక్కటి లేదు. గిరిజన యూనివర్సిటీ రాలేదు. మేము ఇవ్వం కాక ఇవ్వం. ఏం చేసుకుంటరో చేసుకోండి అన్నట్టు ఉంది కేంద్రం ధోరణి..’ అని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు.  

అదానిపై ప్రధాని మౌనం ఎందుకు? 
‘మొన్న పార్లమెంట్‌లో ప్రధాని మోదీ ఘోరమైన, అసహ్యకరమైన ప్రసంగం చేశారు. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. కోట్ల మందికి సంబంధించిన విషయం. అసలు అదాని సంగతి ఏంటి? ఈ దేశం ఉంటదా? చస్తదా? దేశం ఉనికి ఏంటి? ఏం జరగబోతోంది? అని ఢిల్లీలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్, ఇతర పారీ్టలు ప్రధానిని అడుగుతున్నా ఆయన నోట ఒక్క మాట రాలేదు. ఒకటే దెబ్బలో రూ.10 లక్షల కోట్ల ఆస్తులు కరిగిపోయాయని పత్రికలు రోజూ రాస్తున్నాయి.   మన దగ్గర కూడా పెడ్తా అని వచ్చాడు. కానీ ఇక్కడ జాగ దొరకలేదు. మనం బతికిపోయాం. నా దోస్త్‌ది బయటపడిందని మోదీ మనస్సులో ఆక్రోశం ఉంది. ఈ విషయం చెప్పకుండా..ఏక్‌ ఆద్మీ భారీ పడ్‌గయా అంటూ అసలు సంగతి పక్కన పెట్టారు. ఇందిరాగాంధీ చనిపోయి 40 ఏళ్లు అయింది.. నెహ్రూ చనిపోయి 60 ఏళ్లు అయింది. ఇప్పుడు వాళ్ల పేర్లు తీసుకుని ఆమె ఇన్ని గవర్నమెంట్లు కూలగొట్టింది.. అన్ని కూలగొట్టింది అని మోదీ చెబుతారు. రాహుల్‌ లేచి నువ్వు తక్కువ కూలగొట్టావా? నువ్వు ఇన్ని కూలగొట్టావు అంటారు. ‘ఛోటా భాయ్‌ సుభానల్లా..బడా భాయ్‌ మాషాఅల్లా’ అన్నట్టు ఉంది. ఇదేనా జరగాల్సిన చర్చా?. అదాని అసలు సంగతి బయటపడితే షేర్లు ఇంకా పడిపోతాయని అశ్వత్థాదామోదర అనే ఎకనామిస్ట్‌ వ్యాసం రాశారు..’ అని తెలిపారు.   
5 ట్రిలియన్‌ ఎకానమీ ఓ జోక్‌.. 
    ‘ప్రధాని మోదీ దేశం 2024–25 నాటికి 5 ట్రిలియన్‌ ఎకానమీ అవుతుందనడం ఓ జోక్‌. 3.3 ట్రిల్లియన్‌ దగ్గరే ఇప్పుడు దేశం ఉంది. తలసరి ఆదాయంలో 139వ స్థానంలో ఉంది. మనకంటే బంగ్లాదేశ్, శ్రీలంక, భూటాన్‌ మెరుగైన స్థితిలో ఉన్నాయి. వీటిపై శాసనసభ, పార్లమెంట్‌లో చర్చ జరగాలి..’ అని కేసీఆర్‌ అన్నారు. 

ఈ జులుం 2024 దాటితే ఖతం 
‘గోధ్రాపై కొన్ని నిజాలతో డాక్యుమెంటరీ చూపించినందుకు బీబీసీని నిషేధించాలని అశ్వినీ ఉపాధ్యాయ్‌ అనే బీజేపీ వకీలు సుప్రీంకోర్టులో కేసు వేశాడు. ఇంత అహంకారమా? ఇంత అసహనమా? ఈడీకి బోడీకి భయపడడానికి బీబీసీ ఏమైనా జీ న్యూసా? మాకు ఎవరు ఖిలాఫ్‌ ఉంటే వారిని బ్యాన్‌ చేయి. కోసేయి. లేకుంటే జైల్లో వేయి. జైలులో రూం చూసి పెట్టినం అంటారు..ఇవేనా మాటలు? ఈ జులుం ఎన్ని రోజులు ఉంటది? 2024 దాటితే ఖతమే..’ అని చెప్పారు.   

నష్టాలు ప్రజలకు..లాభాలు ప్రైవేటుకు 
 ‘నష్టాలను ప్రజలపై వేసి లాభాలను ప్రైవేటీకరిస్తున్నారు. ప్రభుత్వం వ్యాపారం చేయాల్సిన అవసరం లేదని ప్రధాని అంటుంటారు. అవసరమైన చోట వ్యాపారం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని మేమంటున్నాము. దేశ ఆర్థిక మంత్రి బాన్సువాడలోని ఓ రేషన్‌ షాపు వద్ద నిలబడి ప్రధానమంత్రి ఫోటో లేదని డీలర్‌తో కొట్లాడితే ఆ డీలర్‌ చావాలా? ఏం గొప్పతనం చేశారని మోదీ ఫోటో పెట్టుకోవాలి? నోట్ల రద్దు చేసినప్పుడు నేను ప్రధానిని కలిశా. ఆయన చెప్పింది వేరు. చేసింది వేరు. ఆయన చెప్పింది నమ్మి నేను సమరి్థంచా. నోట్ల రద్దుకు ముందు రూ.15–16 లక్షల కోట్ల కరెన్సీ చెలామణిలో ఉంటే ఇప్పుడు రూ.33.42 లక్షల కోట్లు చెలామణిలో ఉన్నట్టు వాళ్లే చెప్పారు. ఏ పాలసీ అయినా సక్సెస్‌ అయిందా? అన్ని రంగాల్లో దేశం కుప్పకూలినా డప్పు కొట్టుకోవడం మానడం లేదు..’ అని సీఎం విమర్శించారు. 

తూత్‌ పాలిష్‌ పనులకు ప్రధాని వస్టారట! 
     ‘వందే భారత్‌ రైలును ప్రధాని 14 సార్లు ప్రారంభించారు. ఇంత ఘోరమా? ఇప్పుడు సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ తూత్‌ పాలిష్‌ చేసే పనులు ప్రారంభించేందుకు వస్తారట. కేంద్ర మంత్రి వచ్చి లిఫ్టును జాతికి అంకితం చేశారట? ఇదా పద్ధతి?’ అని నిలదీశారు. 

జనాభా గణన ఎందుకు చేపట్టడం లేదు? 
  ‘జనాభా లెక్కలను కేంద్రం ఎందుకు చేపట్టడం లేదు? తమ బండారం బయటపడ్తదని వీరి బాధ. కుల గణన చేయాలన బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అడుగుతున్నారు. జనాభా గణన లేకుండా ఏ దేశమైనా పరిపాలన చేస్తుందా? మేము మునిగిందే గంగ.. చెప్పిందే లెక్క. వింటే విన్నవు.. లేకుంటే చంపేస్తా. ఇది భారత దేశాన్ని నడిపే పద్ధతా?’ అని కేసీఆర్‌ ప్రశ్నించారు.    

మన్మోహన్‌సింగ్‌ హయాంతో పోల్చితే ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో వార్షిక వృద్ధిరేటు 6.8 శాతం నుంచి 5.5 శాతానికి పడిపోయింది. తలసరి ఆదాయం వృద్ధి రేటు 12.73 శాతం నుంచి 7.01 శాతానికి, ఎగుమతుల వృద్ధి రేటు 19.5 శాతం నుంచి 4.9 శాతానికి, పారిశ్రామిక వృద్ధి రేటు 5.87 శాతం నుంచి 3.2 శాతానికి పడిపోయింది. పెట్టుబడి వ్యయం 37.5% నుంచి 31 శాతానికి తగ్గింది. రూపాయి విలువ రూ.58.6 నుంచి రూ.82.6 శాతానికి దిగజారింది. మోదీ పాలనను మన్మోహన్‌ పాలనతో పోల్చుతూ ‘ది లాస్డ్‌ డికేడ్‌’ అనే పుస్తకాన్ని పూజా మెహ్రా రాశారు.  మోదీ హయాంలో ఏ ఒక్క రంగంలోనైనా వృద్ధి ఉందా? అంటే లేదు. జీడీపీలో అప్పుల శాతం 52 శాతం నుంచి 56.2 శాతానికి, ద్రవ్యలోటు 4.77 శాతం నుంచి 5.1 శాతానికి పెరిగాయి. నేను చెప్పిన వాటిల్లో ఒక్కమాట అబద్ధమున్నా రాజీనామా చేస్తా. అన్ని రంగాల్లో అత్యంత చెత్తగా పనితీరు చూపిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది మోదీ ప్రభుత్వమే. ఎన్పీఏల పేరుతో రూ.14 లక్షల కోట్ల రుణాలు మాఫీ చేశారు. రూ.20 లక్షల కోట్లు ఏ ఎంఎస్‌ఎంఈలకు ఇచ్చారో భగవంతుడికే తెలుసు. పార్లమెంటులో అడిగితే నో డేటా అవైలబుల్‌ అన్నారు. ఎన్డీయే అంటే నో డేటా అవైలబుల్‌ (ఎన్డీఏ).

మరిన్ని వార్తలు