సభలో నవ్వులే నవ్వులు..ప్రధాని భజన బృందంపై పిట్ట కథను వినిపించిన సీఎం కేసీఆర్‌

13 Feb, 2023 05:13 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రధాని మోదీ చుట్టూ ఉన్న భజన బృందంపై శాసనసభలో ఆదివారం సీఎం కేసీఆర్‌ వినిపించిన ఓ పిట్ట కథ నవ్వులను పూయించింది. ‘‘తిరుమల రాయుడని ఒకటే కన్ను ఉన్న రాజుంటడు. ఓ కవికి ఆయన్ను పొగడక తప్పని పరిస్థితి ఏర్పడతది. ఆయన్ను పొగిడి సంతోషపెడితే నీకు మంచి లాభం జరుగతది అని అందరూ చెప్తరు. అప్పుడు ఆయన మనస్సులో ఇష్టం లేకపోయినా మజుబూరిలో ఇలా చెప్తడు... ‘అన్నాతి గూడి హరుడవు.. అన్నాతిని గూడకున్న అసుర గురుడౌ... అన్నా తిరుమల రాయా కన్నొక్కటి కలదుకాని కౌరవ పతివే’... అర్థం ఏమిటంటే... ఒక కన్ను ఉందని నువ్వు రంది పడకు.

నీ భార్యతో కూర్చున్నప్పుడు మూడు కళ్లు అయి నువ్వు శివుడికి సమానం. భార్యతో లేనప్పుడు ఒకే కన్ను గల రాక్షసుల గురువు శుక్రాచార్యుడు అంతటి వాడివి. అదీ లేనప్పుడూ నువ్వు కౌరవపతి అయిన ధృతరాష్రు్టడివి’’అని కేసీఆర్‌ పిట్ట కథను వివరించారు. ‘మోదీకి చెప్పేటోళ్లు కూడా.. సార్‌ కాస్త బాగా చేయాలె అని చెప్పకుండా, బాగుంది.. బాగుంది అని అంటున్నరు. ఆయన మాజీ ప్రధాని అయ్యే వరకు చెప్తరు. దిగిపోతే కూడా మాజీ ప్రధానిగా ఉంటవు.. మనకేం తక్కువ సార్‌ అన్నట్టు ఉంది పరిస్థితి’అని కేసీఆర్‌ చెబుతుండగా సభలో ఘొళ్లుమని నవ్వులు వినిపించాయి. ఈ కథ చెప్పి పెర్ఫార్మన్స్‌ లేనప్పుడు అనవసరంగా పొగడటం మంచిది కాదు అని కేంద్రానికి కేసీఆర్‌ చురకలంటించారు.  

>
మరిన్ని వార్తలు