Hyderabad: కలెక్టరేట్‌కు వీడని గ్రహణం.. శిథిలావస్ధలో పాత భవన సముదాయం

24 Aug, 2022 19:40 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ కలెక్టరేట్‌కు గ్రహణం వీడటంలేదు. కొత్త భవన నిర్మాణానికే కాదు.. కనీసం తరలింపునకు కూడా అడ్డగింపులు తప్పడం లేదు. తాజాగా కొంగరకలాన్‌లో నిర్మించిన రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌ భవనం పూర్తయ్యింది. కొత్త భవన సముదాయంలోకి మారనుంది. ఇంతకుముందు రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌ ఉన్న లక్డీకాపూల్‌లోని కాంప్లెక్స్‌లోకి హైదరాబాద్‌ కలెక్టరేట్‌ తరలించాలనే పాత ప్రతిపాదనపై సందిగ్ధత నెలకొంది. మరోవైపు కొత్తగా నిర్మిస్తున్న సచివాలయంలో అన్ని విభాగాల హెచ్‌ఓడీ ఉండాలన్న సీఎం కేసీఆర్‌ ఆదేశాల నేపథ్యంలో ప్రస్తుత కలెక్టరేట్‌ పక్కనే ఉన్న భూ పరిపాలనా ప్రధాన కమిషనర్‌ (సీసీఎల్‌ఏ) కార్యాలయంలోకి కలెక్టరేట్‌ను షిఫ్ట్‌ చేసే ఆలోచనను కూడా ప్రభుత్వం చేస్తోంది. 

తరలించాలని ఉన్నా.. 
హైదరాబాద్‌ కలెక్టరేట్‌ను లక్డీకాపూల్‌కు తరలించాలనే ప్రతిపాదన 2016లోనే వచ్చింది. కొంగరకలాన్‌కు రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌ తరలింపుతో ఖాళీ అయ్యే భవనాన్ని హైదరాబాద్‌ కలెక్టరేట్‌కు ఉయోగించాలని నిర్ణయించింది. ఈ మేరకు కొత్త కాంప్లెక్స్‌లోకి షిఫ్ట్‌ అయ్యేందుకు రంగారెడ్డి జిల్లా యంత్రాంగం రంగం సిద్ధం చేసింది. లక్డీకాపూల్‌ మార్గం నిత్యం వాహనాలతో కిక్కిరిసి ఉండడం.. ధర్నాలు, ఆందోళనలతో ట్రాఫిక్‌ జామ్‌ అవుతుండడంతో ఇక్కడికి హైదరాబాద్‌ కలెక్టరేట్‌ను తరలించేందుకు పోలీసుశాఖ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది.  
చదవండి: బండి సంజయ్‌ పాదయాత్రపై సస్పెన్స్‌.. హైకోర్టు నిర్ణయంపై ఉత్కంఠ..

పదహారేళ్ల క్రితం.. 
పదహారేళ్ల క్రితం నగరంలోని మాసాబ్‌ ట్యాంక్‌ వద్ద ఎకరం ప్రభుత్వ స్థలంలో నూతన కలెక్టరేట్‌ కాంప్లెక్స్‌ నిర్మాణానికి ప్రతిపాదించారు. నాంపల్లి– అబిడ్స్‌ రోడ్డులోని కలెక్టరేట్‌లో పాత భవన సముదాయం పూర్తిగా శిథిలావస్థకు చేరుకోవడంతో 1990లో నిర్మించిన నాలుగు అంతస్తులతో ఒకే ఒక కొత్త భవనంలో కలెక్టరేట్‌ విభాగాలు కొనసాగుతున్నాయి. వివిథ శాఖల ఆఫీసులు వేర్వేరుగా దూరంగా ఉండటం.. మొత్తం 32 విభాగాలను నిర్వహించడానికి స్థలం లేకపోవడంతో  ఇతర ప్రాంతంలో నిర్మాణం చేపట్టాలని అప్పట్లో భావించారు.   
చదవండి: కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్యే పోటీ.. ఇక్కడి నుంచే కవిత పోటీ చేసే ఛాన్స్‌?

కొత్త కాంప్లెక్స్‌ కోసం ఏప్రిల్‌ 2007 లో రూ.10 కోట్లు మంజూరు చేసింది. సుమారు 10 అంతస్తులతో కాంప్లెక్స్‌కు ఆర్‌అండ్‌బీ శాఖ,  ప్రైవేట్‌ కన్సల్టెంట్‌తో కలిసి డిజైన్లు సిద్ధం చేసింది. కాంప్లెక్స్‌ అంచనా వ్యయం రూ.46 కోట్లు కాగా, రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన నిధులు ఏ మూలకు సరిపోని పరిస్థితి నెలకొంది. అంతలోనే 2008 మార్చిలో బడ్జెట్‌ గడువు ముగియడంతో ప్రతిపాదన పెండింగ్‌లో పడింది.  

 ఆ తర్వాత కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన నవీన్‌ మిట్టల్‌ మరో ఆర్కిటెక్ట్‌ ద్వారా ఆరు అంతస్తులకు తగ్గించి రూ.22 కోట్ల అంచనా వ్యయంతో 1.80.000 చదరపు అడుగుల బిల్టప్‌ ఏరియాతో సవరించి డిజైన్‌ చేశారు. సవరించిన ప్రణాళికలు, అంచనాలను తిరిగి ప్రభుత్వానికి ఆమోదం కోసం పంపించారు. కలెక్టరేట్‌ కాంప్లెక్స్‌ భూవేలంతో వచ్చిన మొత్తాన్ని కొత్త కాంప్లెక్స్‌కు ఉపయోగించాలని ప్రభుత్వం సూచించడంతో నిర్మాణం పెండింగ్‌లో పడింది. 
    

మరిన్ని వార్తలు