Hyderabad Traffic: తెలంగాణ భవన్‌ ముందు ట్రాఫిక్‌ నరకం

24 Dec, 2022 15:26 IST|Sakshi
అగ్రసేన్‌ చౌరస్తాలో సెంట్రల్‌ మీడియన్లతో ఇరుకుగా మారిన రోడ్లు

లోతుగా ఉన్న రోడ్డుపై ఆగిపోతున్న వాహనాలు

అగ్రసేన్‌ చౌరస్తాలో ఇరుకైన రోడ్డు

బంజారాహిల్స్‌ రోడ్‌ నెం. 14 బసవతారకం కేన్సర్‌ ఆస్పత్రి నుంచి రోడ్‌ నెం.12 వైపు వెళ్లే రోడ్డులో తెలంగాణ భవన్‌ ముందు పల్లంగా ఉండటంతో ఎత్తుపైకి ఎక్కలేక వాహనాలు ఆగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో తరచు ట్రాఫిక్‌ స్తంభించిపోతోంది. అంతేకాకుండా వంపుగా ఉన్న తెలంగాణ భవన్‌ వద్ద రోడ్డు నుంచి రోడ్‌ నెం. 12 వైపు వాహనాలు ఎక్కే క్రమంలో రెడీమిక్స్‌ వాహనాల నుంచి సిమెంటు, కంకర కిందపడుతూ గుట్టలుగా పేరుకుపోతోంది. ఇదొక సమస్యగా మారిపోయింది. 

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ భవన్‌ వద్ద ఆర్టీసీ బస్సులు, లారీలు ఇక్కడి నుంచే ఎక్కే క్రమంలో మొరాయిస్తుండటంతో వెనుక ట్రాఫిక్‌ కిలోమీటర్ల మేర ఆగిపోతోంది. సీఎం తెలంగాణ భవన్‌కు వచ్చినప్పుడు వీవీఐపీలు మెయిన్‌ రోడ్డు మీదనే కారు ఆపి దిగే క్రమంలో కూడా వెనుక ఉన్న వాహనాలు పెద్ద ఎత్తున నిలిపోతున్నాయి.  

► తెలంగాణ భవన్‌ ముందు ఈ ట్రాఫిక్‌ సమస్య గత దశాబ్ధ కాలంగా విపరీతంగా పెరిగిపోతున్నది. దీనికి పరిష్కారంగా బసవతారకం కేన్సర్‌ ఆస్పత్రి నుంచి తెలంగాణ భవన్‌ వైపు మళ్లే ప్రాంతం నుంచి అగ్రసేన్‌ చౌరస్తా వరకు రోడ్డును సమాంతరం చేయడం ద్వారా సమస్య కొలిక్కి వస్తుందని ట్రాఫిక్‌ పోలీసులు భావిస్తున్నారు. 

► కేబీఆర్‌ పార్కు నుంచి వరద నీరు తెలంగాణ భవన్‌ పక్కన నిర్మించిన కాల్వలోకి చేరే క్రమంలోనే ఈ రోడ్డు వంపుగా మారింది. ఇక్కడ వరద నీటి పైప్‌లైన్‌ వేసి రోడ్డంతా సమాంతరం చేస్తే ట్రాఫిక్‌ సజావుగా ముందుకు సాగుతుందని ట్రాఫిక్‌ నిపుణులు పేర్కొంటున్నారు.  

ఇరుకుగా అగ్రసేన్‌ చౌరస్తా..
బంజారాహిల్స్‌ రోడ్‌ నెం. 14 నుంచి తెలంగాణ భవన్‌ మీదుగా వాహనాలు ముందుకు సాగడం గగనంగా మారింది. లేచిన దగ్గరి నుంచి అర్ధరాత్రి దాకా ఈ రోడ్డులో వాహనాలు మెళ్లగా ముందుకు కదులుతున్నాయి.  

► ఒక వైపు తెలంగాణ భవన్‌ వైపు రోడ్డు లోతుగా ఉండటం, జగన్నాథ టెంపుల్‌ గేటు కూడా రోడ్డు వైపే ఉండటం ట్రాఫిక్‌ను మరింత జఠిలం చేస్తున్నది. దీనికి తోడు అగ్రసేన్‌ చౌరస్తాలో తెలంగాణ భవన్‌ నుంచి రోడ్‌ నెం. 12 వైపు మలుపు మరింత ప్రమాదకరంగా మారింది. ఇక్కడే ట్రాన్స్‌ఫార్మర్, కరెంటు స్తంభాలు, హైటెన్షన్‌ వైర్ల స్తంభాలు టర్నింగ్‌పై ఉన్నాయి. వీటిని తొలగిస్తే ట్రాఫిక్‌ కమాండ్‌ కంట్రోల్‌ వైపు తేలికగా ముందుకు కదులుతుంది.  

► అగ్రసేన్‌ ఐల్యాండ్‌ను కూడా పెద్దగా ఉండటం, చౌరస్తా మొత్తం ఇరుకుగా ఉండటం వాహనాలు మళ్లే పరిస్థితులు జఠిలమవుతున్నాయి. ఈ చౌరస్తాను తగ్గించాల్సిన అవసరం ఉందని, సెంట్రల్‌ మీడియన్లను కూడా కట్‌ చేయాల్సిన పరిస్థితి ఉందని ట్రాఫిక్‌ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ మేరకు ట్రాఫిక్‌ పోలీసులు కూడా అగ్రసేన్‌ ఐల్యాండ్‌ను, సెంట్రల్‌ మీడియన్‌ను తగ్గించాలని జీహెచ్‌ఎంసీకి లేఖ కూడా రాశారు.  

జీహెచ్‌ఎంసీ మొద్దు నిద్ర..
బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌ రహదారులపై ట్రాఫిక్‌ విపరీతంగా పెరిగిపోతున్నది. ఏ రోడ్డు చూసినా ట్రాఫిక్‌ దిగ్బంధంలో చిక్కుకొని వాహనదారులు విలవిల్లాడుతున్నారు. ట్రాఫిక్‌ పోలీసులు పలుమార్పులు, చేర్పులు చేస్తూ ఉన్నదాంట్లోనే సిబ్బందిని వినియోగించుకుంటూ ట్రాఫిక్‌ మళ్లింపులు చేపడుతూ వాహనదారులను ముందుకు వెళ్లే దిశలో చర్యలు తీసుకుంటున్నారు.  

► ట్రాఫిక్‌ పోలీసులకు జీహెచ్‌ఎంసీ అధికారులు ఏ మాత్రం సహకరించడం లేదని ఫిర్యాదులు అందుతున్నాయి. పలుచోట్ల సెంట్రల్‌ మీడియన్లు తగ్గించాలని ఐల్యాండ్‌లను కట్‌ చేయాలని, అడ్డుగా ఉన్న చెట్లను తొలగించాలని, ఫుట్‌పాత్‌లపై విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్ల షిఫ్టింగ్‌కు తోడ్పాటు నందించాలని, అడ్డుగా ఉన్న కరెంటు స్తంభాలు, టెలిఫోన్‌ స్తంభాలను అనువైన చోటుకు మార్చాలని ట్రాఫిక్‌ పోలీసులు లేఖలు రాస్తున్నా జీహెచ్‌ఎంసీ అధికారులు పట్టించుకున్న పాపాన పోవడం లేదు. జీహెచ్‌ఎంసీతో ట్రాఫిక్‌ పోలీసులు సమన్వయం పూర్తిగా కొరవడింది. (క్లిక్ చేయండి: రసాభాసగా జీహెచ్‌ఎంసీ మీటింగ్.. చర్చ లేకుండానే బడ్జెట్‌కు ఆమోదం)

>
మరిన్ని వార్తలు