హైదరాబాద్‌లో ఆకాశాన్ని తాకే అపార్ట్‌మెంట్లు.. మెయింటెనెన్స్‌ లేకుంటే ముప్పే!?

23 Feb, 2022 08:44 IST|Sakshi

95 శాతం భవనాలు పశ్చిమ హైదరాబాద్‌లోనే

ప్రస్తుతం 25 నుంచి 30 వేల ఫ్లాట్ల నిర్మాణం

రానున్న అయిదేళ్లలో మరో 70 వేల యూనిట్లు

మౌలిక వసతుల కల్పన బాధ్యత ప్రభుత్వానిదే

భవిష్యత్తు జనాభా, వాహన రద్దీని అంచనా వేయాలి

అనంతర పరిణామాలకు అందరూ బాధ్యులే  

‘హైదరాబాద్‌ నగరానికి చెందిన ఓ నిర్మాణ సంస్థ పదేళ్ల క్రితం ఏఎస్‌రావు నగర్‌లో మూడున్నర ఎకరాల్లో 25 అంతస్తుల్లో హైరైజ్‌ అపార్ట్‌మెంట్లను నిర్మించింది. అప్పట్లో నగరంలోని ఆకాశహర్మ్యాలలో టాప్‌– 5లో ఇదొకటి. నాలుగేళ్లలో నిర్మాణం పూర్తి చేసి ఫ్లాట్లన్నీ అమ్మేసి సొమ్ము చేసుకుంది. కార్పస్‌ ఫండ్‌ కింద ఫ్లాట్‌ రూ.లక్ష చొప్పున వసూలు చేసి రెండేళ్ల పాటు నిర్వహణ కంపెనీయే చేపట్టింది. ఇక్కడిదాకా బాగానే ఉంది.. ఆ తర్వాతే అసలు కథ మొదలైంది. నివాసితుల సంఘం ప్రాజెక్ట్‌లోని వసతులను వార్షిక నిర్వహణ చేపట్టలేకపోయింది. అపార్ట్‌మెంట్లు రంగులు, అంతర్గత రోడ్లు పాడైపోయాయి. దీంతో ప్రస్తుతం ఆ ప్రాంతంలో చ.అ.కు రూ.4 వేల ధర పలుకుతుంటే.. ఈ ప్రాజెక్ట్‌లో మాత్రం రూ.3 వేలకు మించి రీసేల్‌ కావటం లేదు’ 

సాక్షి, హైదరాబాద్‌: ఇదీ ఓ హైరైజ్‌ అపార్ట్‌మెంట్‌ వాసుల పరిస్థితి. కొనేటప్పుడు బాగానే ఉన్నా.. భవిష్యత్తు హైరైజ్‌ రిస్క్‌లను అంచనా వేయటంలో నిర్మాణ సంస్థ, కొనుగోలుదారూ విఫలం చెందిన ఘటనకు ఇదో మచ్చుతునక. అంటే.. ఆకాశహర్మ్యాలు నిర్మించొద్దని కాదు.. నిర్వహణ సరిగా చేయలేకపోయినా, దీర్ఘకాలంలో తలెత్తే సమస్యలకు ముందస్తు పరిష్కారం చూపించలేకపోయినా నష్టపోయేది కొనుగోలుదారులే. నిర్మాణ సంస్థదేముంది కట్టేసి, అమ్మేసి చేతులు దులుపుకొంటుంది అంతే. ఆ తర్వాత కష్టాలు షరామామూలే.

41 శాతం ఎక్కువ.. 
భాగ్యనగరంలో ఆకాశహర్మ్యాల సంస్కృతి భారీగా పెరిగింది. ముంబై, ఢిల్లీ, బెంగళూరు వంటి నగరాలకే పరిమితమైన హైరైజ్‌ భవనాలు క్రమంగా ఇక్కడా పెరిగిపోతున్నాయి. గతేడాది జీహెచ్‌ఎంసీ పరిధిలో 140 ప్రాజెక్ట్‌లకు అనుమతి రాగా.. ఇందులో 57 హైరైజ్‌ భవనాలే. 2020తో పోలిస్తే 41 శాతం ఎక్కువ.   

తొందరపడితే నష్టాలే.. 
పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు.. ఒకర్ని చూసి మరొకరు  హైరైజ్‌ నిర్మాణాలను చేపడుతున్నారు. గచ్చిబౌలి, గండిపేట, కొండాపూర్, నానక్‌రాంగూడ, ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్, కోకాపేట, ఖాజాగూడ, పుప్పాలగూడ, కొత్తగూడ, గచ్చిబౌలి, రాయదుర్గం నార్సింగి, శంకర్‌పల్లి, తెల్లాపూర్, నల్లగండ్ల వంటి పశ్చిమ హైదరాబాద్‌లోనే ఎక్కువగా హైరైజ్‌ నిర్మాణాలు వెలుస్తున్నాయి.

ప్రస్తుతం ఆయా ప్రాంతాలలో 25 నుంచి 30 వేల ఫ్లాట్లు నిర్మాణంలో ఉన్నట్లు అంచనా. వచ్చే నాలుగైదు ఏళ్లలో అదనంగా 70 వేల ఫ్లాట్లు అందుబాటులోకి వస్తాయంటున్నారు నిపుణులు. ఇంత భారీ స్థాయిలో సరఫరాను అందుకునే డిమాండ్‌ ఉందా? డిమాండ్‌కు మించి సరఫరా జరిగితే ఇన్వెంటరీ పెరిగి రియల్టీ మార్కెట్‌ దెబ్బ తింటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

ప్రభుత్వం ఇలా చేయాలి..  
భవిష్యత్తులో పశ్చిమ హైదరాబాద్‌లోని నివాసితులు, వాహనాల సంఖ్య, జనసాంద్రతకు తగ్గట్టుగా రహదారులు, పారిశుద్ధ్యం, నీరు, విద్యుత్‌ వంటి మౌలిక వసతులను కల్పించాలి. ప్రాజెక్ట్‌ మొత్తం స్థలంలో 20 శాతం లోపు మాత్రమే నిర్మాణానికి అనుమతి ఇవ్వాలి. మిగిలిన స్థలాన్ని గ్రీనరీకి, మౌలిక వసతుల కల్పనకు వినియోగించాలి.  ప్రతి అంతస్తునూ ప్రత్యక్షంగా పర్యవేక్షించాలి. పార్కింగ్, డ్రైనేజీ, అగ్ని ప్రమాద నివారణ ఏర్పాట్లు వంటి అంశాలను తనిఖీ చేయాలి. 

ఆ స్థోమత బిల్డర్‌కు ఉందా? 
హైరైజ్‌ ప్రాజెక్ట్‌లను నిర్మించే ఆర్థిక స్థోమత డెవలపర్లకు ఉందా? లేదా? అనేది చూడాలి. లేకపోతే ప్రాజెక్ట్‌ మధ్యలో బిల్డర్‌ చేతులెత్తేస్తే కొనుగోలుదారులు నిలువెల్లా నష్టపోతారు. అనుమతుల జారీలో ప్రభుత్వం, కొనుగోలు సమయంలో కస్టమర్లు ఇద్దరూ.. డెవలపర్‌ గత చరిత్ర, ప్రమోటర్ల ఆర్థిక స్థోమత, ఇతరత్రా అంశాల గురించి ఆరా తీయాలి.
- నరేంద్ర కుమార్‌ కామరాజు,   డైరెక్టర్, ప్రణీత్‌ గ్రూప్‌ 

ఇంపాక్ట్‌ ఫీజు పెంచాలి.. 
హైరైజ్‌ నిర్మాణాలను నియంత్రించాలంటే ఫ్లోర్‌ స్పేస్‌ ఇండెక్స్‌ (ఎఫ్‌ఎస్‌ఐ)కు క్యాప్‌ పెట్టడం సరైన నిర్ణయం కాదు. హైదరాబాద్‌ బ్రాండ్‌ దెబ్బ తింటుంది. అపరిమిత ఎఫ్‌ఎస్‌ఐ కారణంగానే ఇతర నగరాల నిర్మాణ సంస్థలు హైదరాబాద్‌లో నిర్మాణాలు చేపడుతున్నాయి. హైరైజ్‌ భవనాలను నియంత్రించాలంటే చేయాల్సింది ఇంపాక్ట్‌ ఫీజును పెంచాల్సిందే.
– సి.శేఖర్‌ రెడ్డి, జాతీయ మాజీ అధ్యక్షుడు, క్రెడాయ్‌  

మరిన్ని వార్తలు