హెచ్‌ఎం చనువుతో.. టీచర్‌గా మారిన డ్రైవర్‌ 

3 Nov, 2022 07:48 IST|Sakshi
నిందితుడు రజనీకుమార్‌ , హెచ్‌ఎం మాధవి

సాక్షి, బంజారాహిల్స్‌: డ్రైవర్‌గా ఉండాల్సిన వ్యక్తి సదరు స్కూల్‌ హెచ్‌ఎం ఇచ్చిన చనువుతో ఏకంగా టీచర్‌గా మారాడు. ప్రతిరోజూ ఎల్‌కేజీ విద్యార్థులకు హాజరు తీసుకోవడంతో పాటు క్లాస్‌లు కూడా చెప్పేవాడు. ఇదే చనువుతో ఎల్‌కేజీ విద్యార్థినిపై అత్యాచారం చేసిన ఘటనలో ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో ఊచలు లెక్కిస్తున్నాడు. సంచలనం సృష్టించిన బంజారాహిల్స్‌ రోడ్‌ నెం. 14 డీఏవీ పబ్లిక్‌ స్కూల్‌లో అత్యాచార ఘటనలో ప్రధాన నిందితుడు రజనీకుమార్, హెచ్‌ఎం మాధవిల కస్టడీ మంగళవారంతో ముగిసింది.

వీరిని బుధవారం తిరిగి చంచల్‌గూడ జైలుకు తరలించారు. కస్టడీ విచారణలో పోలీసులు పలు విషయాలను రాబట్టారు. నిందితుడు రజనీకుమార్‌ పాఠశాలలో అన్ని తానై వ్యవహరించడమే కాకుండా ఏకంగా క్లాస్‌ తీసుకునేవాడని విచారణలో తేలింది. ప్రతిరోజూ ఓ క్లాస్‌ తీసుకోవడమే కాకుండా చిన్నారుల హాజరును కూడా నమోదు చేసేవాడని గుర్తించారు. పాఠశాలలోని సీసీ కెమెరాల వ్యవస్థ మొత్తం ఆయన పర్యవేక్షణలోనే ఉండటంతో తన అక్రమాలు వెలుగు చూడకుండా కొన్ని సీసీ కెమెరాల వైర్లను కట్‌ చేసిన విషయాన్ని  నిందితుడు పోలీసుల ఎదుట అంగీకరించాడు.

కొందరు టీచర్లు నిందితుడిపై ఫిర్యాదు చేసినా హెచ్‌ఎం మాధవి నిర్లక్ష్యంగా వ్యవహరించిన విషయం కూడా విచారణలో వెలుగు చూసింది. పాఠశాలలో ఏదైనా కార్యక్రమం జరిగితే తల్లిదండ్రులు డబ్బులను నేరుగా నిందితుడి అకౌంట్‌లోకే పంపించేవారని పోలీసులు గుర్తించారు. డ్రైవర్‌గా ఉండాల్సిన నిందితుడు టీచర్‌ అవతారం ఎత్తడంతో ఈ ఘటనలు చోటు చేసుకున్నట్లు దర్యాప్తులో తేలింది. స్కూల్‌లో ఇష్టారాజ్యం నెలకొనడం, క్రమ శిక్షణ లేకపోవడం ఇవన్నీ ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌ మాధవి నిర్వాకంతోనే జరిగినట్లుగా తేలింది.  

మరిన్ని వార్తలు