Khairatabad Tehsil: వామ్మో ఖైరతా‘బాధ’.. నేనక్కడ పనిచేయను నాయనో!

5 Aug, 2021 08:25 IST|Sakshi

సాక్షి, బంజారాహిల్స్‌ (హైదరాబాద్‌): ఖైరతాబాద్‌.. హైదరాబాద్‌ నగరంలో వీవీఐపీలు నివాసముండే ప్రాంతం..అటువంటి ప్రాంతంలో తహసీల్దార్‌గా పనిచేయాలంటే కత్తిమీద సాములాంటిదే.. అందరికీ అనుకూలంగా ఉండాలి..అందరికీ అందుబాటులో ఉండాలి..అందరికీ పనులు చేసిపెట్టాలి.. అయితే నిబంధనలు అనేవి ఉంటాయి కదా.. అధికారులు వాటినే ఫాలో అవుతారు.. అవి నాయకులకు పట్టవు కదా..ఇవి కొందరికి నచ్చకపోవచ్చు..దీంతో తహసీల్దార్‌ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం.. ఆ తరువాత బదిలీ అస్త్రం వారిపై ప్రయోగించడం జరిగిపోవడం మామూలే.. ఇదీ ఖైరతాబాద్‌ మండలంలో నిత్యం జరుగుతున్న తంతు.  
► ఖైరతాబాద్‌ మండలంలో తహసీల్దార్లు పట్టుమని పది నెలలు కూడా పని చేయకుండానే బదిలీ అవుతున్నారు. వివిధ కారణాలతో బదిలీ అవుతుండటంతో మండల పరిధిలో పాలన అధ్వానంగా మారుతోంది.  
► బదిలీల వెనుక కొందరి ఫిర్యాదులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మండల పరిధిలో సోమాజిగూడ, ఖైరతాబాద్, బోరబండ, ఎర్రగడ్డ, వెంగళరావునగర్, రహ్మత్‌నగర్, యూసుఫ్‌గూడ డివిజన్లు వస్తాయి. అ మండలాన్ని ఎల్లారెడ్డిగూడ, ఖైరతాబాద్‌  యూసూఫ్‌గూడ విలేజ్‌ల పేరుతో విభజించి పాలన అందిస్తున్నారు.  
► 2011 నుంచి రికార్డులు తీసుకుంటే ఒకే సంవత్సరంలో ముగ్గురు తహసీల్దార్లకు స్థాన చలనం కలిగింది.కొందరైతే నెల రోజులకే బదిలీ అయ్యారు.  
► ఇటీవల బదిలీ అయిన జుబేద అనే తహసిల్దార్‌ ఆ పదవిలో పట్టుమని ఏడు నెలలు కూడా ఉండలేకపోయారు. అంతకుముందు పని చేసిన తహసిల్దార్‌ హసీనా ఏడాది గడువు పూర్తి చేసుకోకుండానే ట్రాన్స్‌ఫర్‌ అయ్యారు.  
► దీంతో  రెండు, మూడు నెలలకు, అయిదారు నెలలకు ఒకసారి తహసిల్దార్లు బదిలీలు ఎందుకు అవుతున్నారో ఇటీవల జిల్లా కలెక్టర్‌ ఆరా తీసినట్లు కూడా తెలిసింది.  

పని ఒత్తిడి కూడా కారణమా..!
ఖైరతాబాద్‌ మండల పరిధిలో ప్రముఖుల ఘాట్లు ఉన్నాయి. నెక్లెస్‌ రోడ్డుతో పాటు ఎన్టీఆర్‌ మార్గ్, ఇతరత్రా వీవీఐపీ ప్రాంతాలు కూడా అధికంగా ఉన్నాయి. వివిధ కార్యక్రమాల సందర్భంగా తహసీల్దార్లు నాలుగైదు రోజుల పాటు అక్కడే విధులు నిర్వహించాల్సి ఉంటుంది. దీంతో చాలా మంది ఇక్కడ ఉండేందుకు మొగ్గు చూపడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటు పౌరుల సమస్యలతో పాటు అటు వీవీఐపీల కార్యక్రమాల్లో పాల్గొనేందుకు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నట్లు తెలుస్తోంది. 
► ఇటీవల ఓ తహసిల్దార్‌ను జిల్లా కలెక్టర్‌ ఆమె చేసిన నిర్వాకాలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డట్లుగా తెలిసింది. ప్రజలకు సంతృప్తికరమైన సేవలు అందించడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  

ఇవీ బదిలీలు..
► 2011 జనవరి 3న పి.లీల ఖైరతాబాద్‌ మండల తహసీల్దార్‌గా బాధ్యతలు స్వీకరించి అదే ఏడాది మే 28న బదిలీ అయ్యారు. ఆమె ఆ పదవిలో నాలుగు నెలలు కూడా ఉండలేదు.  
► జె. శ్రీనివాస్‌  2011 మే 29న బాధ్యతలు స్వీ­కరించగా రెండు నెలలు గడవకుండానే అదే ఏడాది జూలై 6వ తేదీన బదిలీ అయ్యారు.  
► ఎం. కృష్ణ జూలై 7న బాధ్యతలు స్వీకరించి 2012 జూలై 24న బదిలీ అయ్యారు.  
► జె.శ్రీనివాస్‌ జూలై 25న బాధ్యతలు స్వీకరించి కేవలం ఒక్క రోజులోనే అంటే జూలై 26న బదిలీ అయ్యారు.  
► వి. అనురాధ జూలై 27న బాధ్యతలు స్వీకరించగా 2013 జూన్‌ 6న బదిలీ అయ్యారు.  
► సునీత 2013 జూన్‌ 7న బాధ్యతలు స్వీకరించి 20 రోజులు తిరగకముందే అదే ఏడాది 25వ తేదీన బదిలీ అయ్యారు.  
►కె. వేణుగోపాల్‌రెడ్డి 2013 జూన్‌ 26న బాధ్యతలు స్వీకరించి నెలన్నర తిరక్కుండానే ఆగస్టు 31న బదిలీ అయ్యారు.  
► వంశీకృష్ణ 2013 సెప్టెంబర్‌ 1వ తేదీన బాధ్యతలు స్వీకరించి అయిదు నెలలు తిరగకుండానే 2014 ఫిబ్రవరి 11వ తేదీన బదిలీ అయ్యారు.  
► ఎం. శ్రీనివాసరావు 2014 ఫిబ్రవరి 10వ తేదీన బాధ్యతలు స్వీకరించగా నాలుగు నెలలు తిరగకుండానే అదే ఏడాది జూన్‌ 3వ తేదీన బదిలీ అయ్యారు.  
► ఎన్‌.శ్రీనివాస్‌రెడ్డి 2014 జూన్‌ 4వ తేదీన బాధ్యతలు స్వీకరించగా 2015 సెప్టెంబర్‌ 10న బదిలీ అయ్యారు. ఈయన ఒక్కరే ఏడాది కాలం పూర్తి చేసుకున్న తహసిల్దార్‌.  
► టి.సైదులు 2015 సెప్టెంబర్‌ 11వ తేదీన బాధ్యతలు స్వీకరించి రెండున్నరేళ్ళ పాటు సేవలు అందించి 2018 ఆగస్టు 17వ తేదీన బదిలీ అయ్యారు.  
► కె. జానకి 2018 ఆగస్టు 18న బాధ్యతలు స్వీకరించి నెలన్నర తిరగకుండానే 2018 అక్టోబర్‌ 16న బదిలీ అయ్యారు.  
► పి. కృష్ణకుమారి 2018 అక్టోబర్‌ 17వ తేదీన బాధ్యతలు స్వీకరించి ఏడాది తిరగకుండానే 2019 జూన్‌ 16న బదిలీ అయ్యారు.  
► హసీన 2019 జూన్‌ 19న బాధ్యతలు స్వీకరించి ఏడాది తిరగకుముందే 2020 నవంబర్‌ 3న బదిలీ అయ్యారు.  
► జుబేదా 2020 నవంబర్‌ 4న బాధ్యతలు స్వీకరించి 2021 ఆగస్టు 1వ తేదీన బదిలీ అయ్యారు. ఆమె తొమ్మిది నెలలు మాత్రమే విధుల్లో ఉన్నారు.  
► ప్రస్తుత అన్వర్‌ ఖైరతాబాద్‌ మండల తహసిల్దార్‌గా బాధ్యతలు చేపట్టారు. ఈయన ఆగస్టు 2న బాధ్యతలు స్వీకరించారు. 

మరిన్ని వార్తలు